ball badminton
-
పంచెకట్టులో రెచ్చిపోయిన పిచ్చయ్య.. బిత్తరపోయిన బ్రిటిష్ దొరలు
బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం, అర్జున అవార్డు గ్రహీత 104 ఏళ్ల పిచ్చయ్యను ఇంటర్వ్యూ చేసేందుకు ‘సాక్షి’ అనుకోకుండా ఆదివారం ఆయనుంటున్న మనవడి ఇంటికెళ్లింది. పిచ్చయ్య నెమ్మదిగా తన వివరాలు చెప్పారు. ఆయన మనవడు దగ్గరుండి ఆయన చెప్పిన విషయాలను వివరించారు. ‘సాక్షి’తో చివరిసారిగా ఆయన మాటామంతీ.. ‘లగాన్’ సినిమాలో అమీర్ ఖాన్ క్రికెట్ ఆడేందుకు బ్యాట్ పట్టుకుని పంచెకట్టుతో బరిలోకి దిగుతా డు. బ్రిటిష్ దొరలు అతన్ని హేళన చేస్తారు. 2001 నాటి ఈ ముచ్చట చాలామందికి తెలుసు. కానీ సరిగ్గా ఇలాంటి ఉదంతమే నిజ జీవితంలో అంతకు అరవై ఏళ్ల ముందే చోటు చేసుకుంది. వరంగల్ స్పోర్ట్స్: స్వాతంత్య్రానికి పూర్వం 1939– 40లో అప్పటి మద్రాస్‌లో స్టేట్ స్టాఫ్ క్లబ్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో ఓ ఆటగాడు నిక్కర్, టీ షర్ట్ లాంటి క్రీడా దుస్తులకు భిన్నంగా పంచెకట్టుతో కోర్టులో అడుగు పెట్టాడు. అతడి కాళ్లకు కనీసం బూట్లు కూడా లేవు. అతడిని చూసిన బ్రిటిష్ దొరలు, క్రీడా విశ్లేషకులు.. ‘పొలం దున్నుకునే వాడిని బ్యాడ్మింటన్ కోర్టుకు ఎందుకు రానిచ్చారు’ అని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత వాళ్లకు అర్థమైంది ‘వీడు వచ్చింది కోర్టును దున్నేయడానికి అని..’ నాటి నుంచి వెనుతిరిగి చూడకుండా కోర్టును దున్నేస్తూ చివరికి బాల్ బ్యాడ్మింటన్‌లో లెక్కకు మించిన అవార్డుల పంట పండించారు. అతనే మన ‘అర్జున’ పిచ్చయ్య. క్లబ్బుల్లో నేర్చుకుని..ఛాంపియన్‌షిప్‌లు గెలిచి పిచ్చయ్య సమకాలీకులెవరూ ఇప్పుడు లేరు. మనవడు చెప్పిన వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పిచ్చయ్య బందరు పట్ట ణంలో మినర్వ క్లబ్, మోహన్ క్లబ్‌లలో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు చేసుకున్నారు. 1935–36లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచారు. హైదరాబాద్ రాష్ట్రంలో చాదర్‌ఘాట్‌లో జరిగిన పోటీల్లో ఆజంజాహి మిల్లు తరఫున ఆడి గెలిచారు. 1954–55లో హైదరాబాద్‌లోనే జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 9 ఛాంపియన్షిప్లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించారు. హైదరాబాద్ స్టేట్ తరఫున 5, ఆంధ్రప్రదేశ్ తరఫున 9 జాతీయస్థాయి పోటీల్లో ఆడారు. 1966లో జంషెడ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత పిచ్చయ్య స్టార్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. పిచ్చయ్య పేరుపై రాకెట్లు వింబుల్డన్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ అని పిలిచే మధురై టోర్నీ ఫైనల్లో నాటి మేటి ఆటగాడు దక్షిణామూర్తిపై విజయం సాధించి విజార్డ్ ఆఫ్ బాల్ బ్యా డ్మింటన్గా పేరుపొందారు. ఆ మ్యాచ్‌లో పిచ్చయ్య ప్రదర్శన చూసి పంజాబ్ జలంధర్‌లో బాల్ బ్యా డ్మింటన్ రాకెట్లు తయారు చేసే కంపెనీ పిచ్చయ్య పేరుపై రాకెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పట్లో సొంత ఇల్లే లేదు.. జాతీయస్థాయిలో ఆడిన పిచ్చయ్యకు అప్పట్లో సొం త ఇల్లూ లేదు. అంత తాహతూ లేదు. దీంతో అప్పటివరకు తనకు వచ్చిన వెండి బహుమతులను అమ్మేయగా రూ.19 వేలు రాగా.. వాటితో 1965లో వరంగల్ కృష్ణ కాలనీలో సొంత ఇల్లు కట్టుకున్నట్లు ఆయన స్నేహితులు చెబుతుంటారు. తర్వాత ప్రభు త్వం వరంగల్‌లోని దేశాయిపేటలో 500 గజాల స్థలం కేటాయిస్తే.. పాత ఇల్లు అమ్మి ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 104 ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకునే వారు. శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఎక్కడికైనా సైకిల్ పైనే వెళ్లేవారు. -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
ఆదిలాబాద్‌కు రెండు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆదిలాబాద్ జిల్లా జట్లు సత్తా చాటాయి. బాలానగర్‌లోని హెచ్ఎల్ఏ గ్రౌండ్లో జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో ఆదిలాబాద్ 35–31, 29–35, 35–27తో కరీంనగర్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో కరీంనగర్ 35–25, 35–33తో ఖమ్మంపై, ఆదిలాబాద్ 35–29, 35–29తో రంగారెడ్డిపై గెలుపొందాయి. బాలికల టైటిల్‌పోరులో ఆదిలాబాద్ 35–33, 35–29తో వరంగల్‌ను ఓడించింది. సెమీఫైనల్లో వరంగల్ 35–24, 35–22తో నల్లగొండపై, ఆదిలాబాద్ 35–28, 35–33తో నిజామాబాద్ జట్లపై విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హెచ్ఏఎల్ ప్రాజెక్ట్స్ చీఫ్ అనిల్ మట్టూ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, కార్యదర్శి ఎ. రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. నారాయణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిఫరీగా లిమ్మేష్‌కుమార్
కవిటి(ఇచ్ఛాపురం): మండలంలోని పెద్దమెళియాపుట్టుగ జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లిమ్మేష్‌కుమార్ పండా ఈ నెల ఎనిమిది నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లిలో జరగనున్న 62వ జూనియర్స్ జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సమాచారం వచ్చింది. పలుమార్లు రిఫరీగా ఎంపికైన తనకు మరోసారి అవకాశం లభించడంపై కవిటి పంచాయతీ సర్పంచ్ పాండవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. -
అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు. కార్యక్రమానికి డీవైఈఓ లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారిలో అత్యంత ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ చెప్పారు.ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 20 వరకు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. అండర్–14 బాలుర జట్టు సతీష్, నితీష్, ప్రసాద్‌నాయక్, వినయ్, తరుణ్, పురుషోత్తం, తేజ, శివ అండర్–14 బాలికల జట్టు మమత, లక్షీ, శాంతకుమారి, చైతన్య, భవ్య, పద్మ, గంగోత్రి, బృందారిక -
బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
చాగల్లు : అండర్–14 స్కూల్‌గేమ్స్ జిల్లా స్థాయి బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా వ్యాయామ ఉపా«ధ్యాయుల సంఘం అధ్యక్షుడు మరడాని అచ్యుత్, స్కూల్‌గేమ్స్ జిల్లా కార్యదర్శి ఎ.సాయి శ్రీనివాస్ ముఖ్య అతి«థులుగా హాజరై పర్యవేక్షించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ కన్వీనర్ సీహెచ్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు నవంబర్ నెలలో పెంటపాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.అనిల్‌కుమార్, వట్టికూటి సత్యనారాయణ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ∙బాలుర విభాగం జట్టు జి.కరుణ్య, యు.నితిన్, ఎం.రోహిణీకుమార్ (చాగల్లు), బి.రాహుల్(గౌరీపట్నం), యు.నరేష్ (బ్రాహ్మణగూడెం), కె.వెంకట రమణ (మద్దూరు), ఎస్.భార్గవ (పెంటపాడు), ఎం.సతీష్ (సమిశ్రగూడెం) ∙బాలికల విభాగం సీహెచ్ శ్రీజ, బి.స్వాతి (చాగల్లు), కె.శ్యామ్, ఎస్.పూజిత, ఎస్కే షలాంబి (పెంటపాడు), కె.జ్యోతి (శెట్టిపేట), ఎం.హిమవతి (తాళ్లపూడి), జె.జయరేఖ(ఊనగట్ల) ఎంపికయ్యారు. -
బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా విద్యార్థులు
మాదల (ముప్పాళ్ళ): మండలంలోని మాదల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్ రియాజ్ మంగళవారం తెలిపారు. గుంటూరులో ఆదివారం బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి (అండర్–19) విభాగంలో జరిగిన పోటీలలో ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. పాఠశాలలోని పదోతరగతికి చెందిన గోగుల మౌనిక, యనమదల మంజులు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు చెప్పారు. వీరు ఈ నెల 23, 24, 25 తేదీలలో కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వీరిరువురిని పాఠశాల ప్రధానోపా«ధ్యాయుడు జె.లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. -
7న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపికల ఈనెల 7వ తేదీన పట్టాభిపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శివ శంకర్ సోమవారం తెలిపారు. ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు 02–01–1997 తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జారి చేసిన జనన ధ్రువీకరణ పత్రము తీసుకొని రావాలని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌కు పంపటం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 93969 90666, 98497 03676 నెంబర్లకు సంప్రదించాలన్నారు. -
ఆటాడుకుందాం.. రా
బాల్ బ్యాడ్మింటన్ వూల్‌తో గుండ్రంగా 23 గ్రాముల బంతితో 12 నుంచి 24 మీటర్ల పొడవైన కోర్టులో ఆడే ఆటే బాల్ బ్యాడ్మింటన్. రాకెట్‌తో ఆడే ఆటలకు భారతదేశం పెట్టింది పేరు. ఇక్కడే పుట్టిన ఈ ఆట దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి ప్రాచుర్యం పొందింది. బాల్ బ్యాడ్మింటన్ బంతిపై పట్టుకు చక్కటి నైపుణ్యం ఎంతో అవసరం. సాయం సమయాల్లో ఓ రాకెట్తోపాటు మెత్తని బంతితో గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎంతో ఉత్సాహంతో ఆడుకుంటారు. ఆటలో ఎటువంటి ప్రమాదం జరగకుండా నిలకడతో ఆడుకునే ఆటగా ప్రసిద్ధం. తొలుత ఈ ఆట ఔట్‌డోర్ క్రీడగానే ఆడినా ఇటీవల కాలంలో ఇండోర్‌లోనూ ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఆటగాళ్లకు మంచి పట్టున్న ఆటల్లో ఇది ఒకటి. చక్కటి నైపుణ్యం ప్రదర్శించిన ఆటగాళ్లకు స్టార్ ఆఫ్ ఇండియాతో సత్కరిస్తారు. తొలి జాతీయ చాంపియన్‌షిప్‌ను 1956లో ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించారు. విశాఖపట్నం ఆట ఇలా... జట్టులో ఏడుగురు ఆటగాళ్లున్నా ఆటకు దిగేది ఐదుగురే. 12 ఁ 12 మీటర్ల కోర్టులో ఇద్దరు ఫ్రంట్ పొజిషన్లో ఆడుతుంటే మరో ఇద్దరు బ్యాక్ పొజిషన్లో ఆడతారు. ఒకరు సెంటర్ ఆటగాడు. 29 పాయింట్లు సాధించిన జట్టుదే విజయం. డబుల్స్ ఆటలో జట్టుకు ఇద్దరితోనూ ఆడుతారు. నిబంధనలు రెండు విధాల ఆటకు ఒకేలా ఉంటాయి. నెట్ భూమికి రెండు మీటర్ల ఎత్తుగా ఉంటుంది. ఆడేది ఇలా... బంతిని కోర్టు కుడివైపు ఆటగాడు సర్వీస్‌తో ప్రారంభిస్తాడు. బంతి ప్రత్యర్ధి జట్టులోని కుడివైపు కోర్టులో నెట్‌కు తాకకుండా పడాలి. లేకుంటే ఫౌల్. పాయింట్ వస్తే కుడివైపు నుంచి ఎడమవైపుకు వెళ్ళి సర్వీస్ చేస్తాడు. బంతి ఈసారి ఎడమవైపు కోర్టులోకి వెళ్ళాలి. ఇలా పాయింట్లు వస్తున్నంత సేపు ఆదే ఆటగాడు ఆటను కొనసాగిస్తాడు. రిసీవ్ చేసుకున్న ఆటగాడు ఒక స్ట్రోక్లోనే తిరిగి ప్రత్యర్థి కోర్టులోకి పంపాలి. ఎటువైపు కోర్టులోకి పంపినా పర్వాలేదు. 8, 15, 22పాయింట్ల వద్ద కోర్టు మారాల్సి ఉంటుంది. సర్వీస్ మాత్రం అండర్ హాండ్గానే చేయాలి. నడుముకు పైభాగంలోకి వెళ్లకూడదు. విజయమిలా... మూడు గేమ్‌లుంటాయి. తొలి గేమ్ తర్వాత రెండు నిమిషాల విరామమిస్తే తర్వాత రెండు గేమ్‌లకు ఐదు నిమిషాలు విరామమంటుంది. రెండు వరుస గేమ్‌ల్ని ఓ జట్టు గెలుచుకుంటే మూడో గేమ్ ఆడకుండానే విజయం సొంతమవుతుంది. ప్రతి మ్యాచ్‌ను ఇద్దరు రిఫరీలతోపాటు ఒక అంపైర్ పర్యవేక్షిస్తుంటారు. ఆటలో నైపుణ్యాలు... రాకెట్ పట్టుకునే విధానం గ్రిప్ అయితే సర్వీసుల్లో లో, హై, ఫ్లిక్, స్క్రూ అనే విధంగా ఉంటాయి. రిటర్న్ ఇవ్వడం, బంతిని ఆటలో ఉంచడం, టాప్ స్పిన్ చేయడం, హఠాత్తుగా బంతిని డ్రాప్ చేయడం ఆటలో నైపుణ్యాలే. -
అర్జున్ అవార్డు గ్రహీత ఇక్భాల్ కన్నుమూత
హైదరాబాద్: మాజీ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత ఎల్.ఏ ఇక్భాల్(90) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఇక్భాల్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి బాల్ బ్యాడ్మింటన్ సమాఖ్య తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన మృతదేహాన్ని సందర్శించిన హైదరాబాద్ బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి రవీందర్ లు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన బ్యాడ్మింటన్ కు విశేషలు సేవలందించారని కొనియాడారు. -
బాల్ బ్యాడ్మింటన్‌కు భీష్ముడు కష్టాలలో ‘అర్జునుడు’
ప్రత్యర్థి కోర్టులో ఏ మూలలోనైనా ఓ నాణేన్ని పెట్టి అవతలి కోర్టు నుంచి బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్‌తో దాన్ని లేపమనండి.. ఎవరికి ఉంటుంది ఆ నైపుణ్యం.. ఒక్క పిచ్చయ్యకు తప్ప... 1800 టోర్నమెంట్స్.. ఎన్నెన్నో విజయాలు.. ఈ ఆటలో తొలి అర్జున అవార్డు గ్రహీత.. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్ ... ఇవన్నీ ఈ పిచ్చయ్య సాధించిన ఘనతలే. గ్రామీణ క్రీడల్లో తిరుగులేని ఆదరణ ఉన్న బాల్ బ్యాడ్మింటన్‌కు భీష్మాచార్యుడు ఆయన. కానీ ఆట ద్వారా ఆయన సంపాదించింది మాత్రం శూన్యం. ప్రస్తుతం 96 ఏళ్ల వయసులో ఆర్థికంగా ఎలాంటి అండా లేక కడు పేదరికంతో జీవిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం అమ్మితే తప్ప జీవనం సాగించలేని కష్ట పరిస్థితిలో ఉన్నారు. - పెరుమాండ్ల వెంకట్ (సాక్షి, వరంగల్ డెస్క్) జమ్మలమడక పిచ్చయ్య .... బాల్ బ్యాడ్మింటన్ ఆట అనగానే గుర్తొచ్చే పేరు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన జీవితం ఈ ఆటతో మమేకమైంది. ఒకప్పుడు పిచ్చయ్య ఆడుతున్నాడంటే టికెట్లు కొనుక్కుని మరీ బాల్ బ్యాడ్మింటన్ చూసేవారు. టోర్నీ ముగిశాక గోనె సంచుల్లో ట్రోఫీలను, కప్పులను తీసుకుని వెళ్లేవారాయన. ‘పిచ్చయ్య బ్యాట్’ అంటూ ఆయన పేరు మీద మార్కెట్లో బ్యాట్లు వచ్చాయి. ఆయనేంటో చెప్పడానికి ఇవి చాలు. 1938లో అరంగేట్రం 1918లో మచిలీపట్నంలో జన్మించిన పిచ్చయ్య 1938లో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించారు. 1939లో ముదినేపల్లిలో బాల్ బ్యాడ్మింటన్ టోర్నీని నిర్వహించారు. మద్రాస్‌కు చెందిన దక్షిణమూర్తి ఆరోజుల్లో చాలా పేరున్న ఆటగాడు. తనతో ఆడిన గేమ్‌లో పిచ్చయ్య ఒక పాయింట్‌తో ఓడిపోయారు. అయినా దక్షిణమూర్తి తనకు వచ్చిన ప్రత్యేక బహుమతిని ఇచ్చి ప్రోత్సహించారు. 1947లో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ టౌన్ క్లబ్లో చేరి 1951 నుంచి 1963 వరకు తొమ్మిది నేషనల్స్ ఆడి ఐదింటిలో ప్రథమ బహుమతి సాధించారు. మరిచిపోని జ్ఞాపకం.. పిచ్చయ్యకు ఈ ఆటలో గురువులు లేరు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నదీ లేదు. ప్రముఖ ఆటగాళ్ల ‘స్ట్రోక్స్, స్పీడ్, స్పిన్’ చూసి నేర్చుకున్నారు. 1958లో దక్షిణమూర్తితో మరోసారి తలపడాల్సి వచ్చింది. మూడు సెట్లలో చెరో సెట్టు గెలిచారు. మూడో సెట్టు కీలకమైంది. వాళ్లు అప్పటికి ఇరవై ఎనిమిది పాయింట్లు సాధించారు.. పిచ్చయ్య జట్టు 13 పాయింట్లతో వెనకబడి ఉంది. ఈ దశలో పిచ్చయ్య అద్భుత ఆటతీరుతో గేమ్ పాయింట్‌పై ఆడుతున్న దక్షిణమూర్తిని నిలువరించి మ్యాచ్ గెలిచారు. 1947లో వరంగల్‌కు.. 1940లో మచిలీపట్నంలో స్పోర్ట్స్ ఆఫీస్‌లో క్లర్క్‌గా, 1943 నుంచి 48 వరకు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో పనిచేశారు. 1947లో ఒక మిత్రుడి కోరిక మీద వరంగల్ ఆజాం జాహీ మిల్లు జట్టు తరఫున ఆడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆ మిల్లులోనే ఉద్యోగం చూస్తామన్నారు. దీంతో వరంగల్‌కు వచ్చారు. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. అయినా నిరాశపడలేదు. స్నేహితుల సహకారంతో అక్కడే స్పోర్ట్స్ షాపు పెట్టుకున్నారు. అవార్డుల పంట.... క్రీడారంగంలో కృషికి 1970లో అప్పటి అధ్యక్షుడు వీవీ గిరి చేతుల మీదుగా పిచ్చయ్య అర్జున అవార్డును అందుకున్నారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ 1966లో ఆయనకు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేశారు. 1958లో మధురైలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజర్డ్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ అవార్డు తీసుకున్నారు. 1978లో రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఆయనను ఘనంగా సత్కరించారు. 1997లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు పలు పదవులను అలంకరించారు. 1978లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ బోర్డు సభ్యుడిగా, వరంగల్ క్రీడా మండలి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, శాప్ మెంబర్‌గా సేవలందించారు. గెలిచిన కప్పులను అమ్ముకుని.. ఇంత చేసినా పిచ్చయ్య సంపాదించుకుంది ఏమీ లేదు. దీంతో కెరీర్లో గెలుచుకున్న కప్పులను అమ్మగా వచ్చిన రూ.19 వేలతో వరంగల్‌లో ఇల్లు కట్టుకున్నారు. అనంతరం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో ఆ ఇల్లు కూడా అమ్మి, ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఓ చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. ఏ ఆదాయం లేకపోవడంతో ఇప్పుడు దాన్ని కూడా అమ్మే ఆలోచనలో ఉన్నారు. 1997లో ఎన్టీఆర్ అవార్డు కింద వచ్చిన రూ.50 వేలను తన ఉన్నతికి ఎంతగానో సహకరించిన భార్య సత్యవతి పేరిట ఫిక్స్ చేసి ఉంచారు. 2007లో ఆమె చనిపోయింది. కుటుంబ పోషణ కోసం ఆ డబ్బును కూడా ఖర్చు చేయాల్సి రావడం విషాదకరం. గతంలో తక్కువ అద్దెతో మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఓ షాపును కేటాయించారు. తర్వాత దాన్ని కూడా తీసేసుకున్నారు. ఇంత అద్భుత ఆటగాడికి ప్రభుత్వం నుంచి సహకారం కాదు కదా.. కనీసం పింఛన్ కూడా రాకపోవడం శోచనీయం. ప్రస్తుతం ఆయన చిన్నమ్మాయి (వరంగల్) దగ్గర ఉంటున్నారు. ‘నిజంగానే ఇది ‘పూర్’ మెన్ గేమ్’ పూర్ మెన్ గేమ్‌గా పేరున్న బాల్ బ్యాడ్మింటన్ ప్రస్తుతం షటిల్, క్రికెట్ జోరులో వెనకబడిపోయింది. నేటికీ కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈ క్రీడకు ప్రాచుర్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల క్రీడల్లో ఈ క్రీడను చేర్చితే పూర్వ వైభవం వస్తుంది. నాకు జీవితాన్నిచ్చిన బాల్ బ్యాడ్మింటన్ నా కళ్ల ముందే పతనం కావడం బాధిస్తోంది. ఈ క్రీడకు పూర్వవైభవం రావాలన్నదే నా కోరిక. - జమ్మలమడక పిచ్చయ్య -
జోరుగా బాల్‌బ్యాడ్మింటన్
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషులు, మహిళల 59వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సోమవారంనాటికి మూడో రోజుకు చేరింది. మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతుండటంతో క్రీడాభిమానులు పెద్దసంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. గత ఏడాది జరిగిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల విభాగంలో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన ఇండియన్ రైల్వేస్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఆంధ్ర, ముంబై, కేరళ, కర్నాటక, తమిళనాడు టీంలు ఈ టోర్నీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఆడిన లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి నాకౌ ట్ దశకు మార్గం సుగమం చేసుకుంటున్నాయి. సోమవా రం పురుషుల పూల్-ఏ విభాగంలో భారత రైల్వేస్, ఒడిశాపై 29-15, 29-10తో ఘన విజయం సాధించింది. పూల్-బిలో హైదరాబాద్, బీహార్‌పై 29-08, 29-04తో విజయం సాధిం చింది. పూల్- సీలో కర్ణాటక-మేజర్ పోర్ట్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మేజర్ పోర్ట్స్ మొదటి సెట్‌ను 29-26తో నెగ్గగా.. రెండో సెట్లో కర్నాటక ఆధిపత్యాన్ని సాధించింది. 29-27, 29-27తో రెండు సెట్లను కైవసం చేసుకుని విజయం సాధించింది. పూల్-డీలో ఆంధ్రా, అసోంపై 29-09,29-08తో సునాయాస విజయంసాధించింది. ఆంధ్రా- తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్‌లో 29-27, 29-11తో ఆంధ్రా గెలుపొందింది. మహిళల పూల్-ఏలో తమిళనాడు, పుదుచ్చేరిపై 29-03, 29-01తో నెగ్గింది. అదే ఫూల్లో హైదరాబాద్, హర్యానపై 29-27, 29-20తో విజయం సాధించింది. పూల్-బీలో కేరళ, ఢిల్లీపై 29-03, 29-07తో గెలిచింది. పూల్-సీలో కర్ణాటక, ఇస్రో జట్టుపై 29-2, 29-0 తో ఘన విజయం సాధించింది. పూల్-డీలో ఆంధ్రా, ఎన్సీఆర్ జట్టుపై 29-12, 29-08తో గెలుపొందింది. ఆర్గనైజింగ్ కార్యదర్శులు వేజెళ్ల సురేష్‌కుమార్, హుస్సేన్, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు మ్యాచ్‌లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్రీడాకారులకు వైద్య సహాయం అం దించేందుకు మంచుకొండ పీహెచ్సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. -
ఉత్సాహంగా బాల్‌బ్యాడ్మింటన్
ఖమ్మం స్పోర్ట్స్ , న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో జరుగుతున్న జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండోరోజైనా సోమవారం పురుషుల, మహిళల లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. పలు జట్ల క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపర్చారు. ఈనెల 15 వరకూ ఈ పోటీలు జరగనున్నాయి. ఆర్గైనె జింగ్ సెక్రెట్రీ సురేష్, అబ్జల్ హసన్, బొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. క్రీడాకారులకు అనుగుణంగా వంట ఏర్పాట్లు.... సీనియర్ బాల్ బ్యాడ్మింటిన్ టోర్నీకి హాజరైన క్రీడాకారులకు నిత్యం ఆయా ప్రాంతాల ఆహార నియమాల ప్రకారం భోజన ఏర్పాట్లు చేసినట్లు మెస్ కమిటీ సభ్యులు యలమంచిలి సూర్యనారాయణ, దిరిశాల వెంకటేశ్వర్లు, కె.రత్నాకర్, బోప్పన సాయిబాబా తదితరులు పేర్కొన్నారు. నేడు క్యాంప్ ఫైర్... టోర్నీలో భాగంగా మూడో రోజైన సోమవారం సాయంత్రం క్యాంప్‌ఫైర్,మ్యూజికల్‌నైట్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బాడ్మింటన్ కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు తెలిపారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు నిర్వహించే కార్యక్రమాలలో క్రీడాకారులు విధిగా హాజరుకావాలని తెలిపారు. నగరంలోని క్రీడాభిమానులు అదిక సంఖ్యలో పాల్గొని క్యాంప్‌ఫైర్‌ను విజయవంతం చేయాలని కొరారు. -
బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు గురువారం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ శివారు కృష్ణవేణి నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. నరసరావుపేట డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తొలిరోజు నిర్వహించిన మ్యాచ్‌లలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టుపై ఏపిఆర్(సాగర్) డిగ్రీ కళాశాల జట్టు, చెరుకుపల్లి ఎస్ఎంపి జట్టుపై వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్(చీరాల) జట్టు, ఏఎన్‌యూ వ్యాయామ కళాశాల జట్టుపై రేపల్లె ఎస్‌ఏబీ జట్టు, పీఎన్‌సి అండ్ కేఆర్(నరసరావుపేట) జట్టుపై గుంటూరు టీజేపిఎస్ కళాశాల జట్టు, ఎస్‌ఈఏఎస్ (మద్దిరాల) జట్టుపై వీఆర్ఎస్అండ్ వైఆర్ఎన్ జట్టు, ఏపిఆర్‌డిసి (నాగార్జునసాగర్) జట్టుపై ఆర్సి కళాశాల(రేపల్లె) జట్టు విజయం సాధించి లీగ్ మ్యాచ్లలోకి ప్రవేశించాయి. కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఈదర ఆదిబాబు, జొన్నలగడ్డ సర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.