ప్రత్యర్థి కోర్టులో ఏ మూలలోనైనా ఓ నాణేన్ని పెట్టి అవతలి కోర్టు నుంచి బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్‌తో దాన్ని లేపమనండి.. ఎవరికి ఉంటుంది ఆ నైపుణ్యం.. ఒక్క పిచ్చయ్యకు తప్ప... 1800 టోర్నమెంట్స్.. ఎన్నెన్నో విజయాలు.. ఈ ఆటలో తొలి అర్జున అవార్డు గ్రహీత.. తొమ్మిది సార్లు జాతీయ చాంపియన్ ... ఇవన్నీ ఈ పిచ్చయ్య సాధించిన ఘనతలే. గ్రామీణ క్రీడల్లో తిరుగులేని ఆదరణ ఉన్న బాల్ బ్యాడ్మింటన్‌కు భీష్మాచార్యుడు ఆయన. కానీ ఆట ద్వారా ఆయన సంపాదించింది మాత్రం శూన్యం. ప్రస్తుతం 96 ఏళ్ల వయసులో ఆర్థికంగా ఎలాంటి అండా లేక కడు పేదరికంతో జీవిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం అమ్మితే తప్ప జీవనం సాగించలేని కష్ట పరిస్థితిలో ఉన్నారు.
- పెరుమాండ్ల వెంకట్ (సాక్షి, వరంగల్ డెస్క్)
జమ్మలమడక పిచ్చయ్య .... బాల్ బ్యాడ్మింటన్ ఆట అనగానే గుర్తొచ్చే పేరు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన జీవితం ఈ ఆటతో మమేకమైంది. ఒకప్పుడు పిచ్చయ్య ఆడుతున్నాడంటే టికెట్లు కొనుక్కుని మరీ బాల్ బ్యాడ్మింటన్ చూసేవారు. టోర్నీ ముగిశాక గోనె సంచుల్లో ట్రోఫీలను, కప్పులను తీసుకుని వెళ్లేవారాయన. ‘పిచ్చయ్య బ్యాట్’ అంటూ ఆయన పేరు మీద మార్కెట్‌లో బ్యాట్లు వచ్చాయి. ఆయనేంటో చెప్పడానికి ఇవి చాలు.
1938లో అరంగేట్రం
1918లో మచిలీపట్నంలో జన్మించిన పిచ్చయ్య 1938లో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించారు. 1939లో ముదినేపల్లిలో బాల్ బ్యాడ్మింటన్ టోర్నీని నిర్వహించారు. మద్రాస్‌కు చెందిన దక్షిణమూర్తి ఆరోజుల్లో చాలా పేరున్న ఆటగాడు. తనతో ఆడిన గేమ్‌లో పిచ్చయ్య ఒక పాయింట్‌తో ఓడిపోయారు. అయినా దక్షిణమూర్తి తనకు వచ్చిన ప్రత్యేక బహుమతిని ఇచ్చి ప్రోత్సహించారు. 1947లో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ టౌన్ క్లబ్‌లో చేరి 1951 నుంచి 1963 వరకు తొమ్మిది నేషనల్స్ ఆడి ఐదింటిలో ప్రథమ బహుమతి సాధించారు.
మరిచిపోని జ్ఞాపకం..
పిచ్చయ్యకు ఈ ఆటలో గురువులు లేరు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నదీ లేదు. ప్రముఖ ఆటగాళ్ల ‘స్ట్రోక్స్, స్పీడ్, స్పిన్’ చూసి నేర్చుకున్నారు. 1958లో దక్షిణమూర్తితో మరోసారి తలపడాల్సి వచ్చింది. మూడు సెట్లలో చెరో సెట్టు గెలిచారు. మూడో సెట్టు కీలకమైంది. వాళ్లు అప్పటికి ఇరవై ఎనిమిది పాయింట్లు సాధించారు.. పిచ్చయ్య జట్టు 13 పాయింట్లతో వెనకబడి ఉంది. ఈ దశలో పిచ్చయ్య అద్భుత ఆటతీరుతో గేమ్ పాయింట్‌పై ఆడుతున్న దక్షిణమూర్తిని నిలువరించి మ్యాచ్ గెలిచారు.
1947లో వరంగల్‌కు..
1940లో మచిలీపట్నంలో స్పోర్ట్స్ ఆఫీస్‌లో క్లర్క్‌గా, 1943 నుంచి 48 వరకు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో పనిచేశారు. 1947లో ఒక మిత్రుడి కోరిక మీద వరంగల్ ఆజాం జాహీ మిల్లు జట్టు తరఫున ఆడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆ మిల్లులోనే ఉద్యోగం చూస్తామన్నారు. దీంతో వరంగల్‌కు వచ్చారు. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. అయినా నిరాశపడలేదు. స్నేహితుల సహకారంతో అక్కడే స్పోర్ట్స్ షాపు పెట్టుకున్నారు.
అవార్డుల పంట....
క్రీడారంగంలో కృషికి 1970లో అప్పటి అధ్యక్షుడు వీవీ గిరి చేతుల మీదుగా పిచ్చయ్య అర్జున అవార్డును అందుకున్నారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ 1966లో ఆయనకు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేశారు. 1958లో మధురైలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజర్డ్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ అవార్డు తీసుకున్నారు. 1978లో రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఆయనను ఘనంగా సత్కరించారు. 1997లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు పలు పదవులను అలంకరించారు. 1978లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ బోర్డు సభ్యుడిగా, వరంగల్ క్రీడా మండలి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, శాప్ మెంబర్‌గా సేవలందించారు.
గెలిచిన కప్పులను అమ్ముకుని..
ఇంత చేసినా పిచ్చయ్య సంపాదించుకుంది ఏమీ లేదు. దీంతో కెరీర్‌లో గెలుచుకున్న కప్పులను అమ్మగా వచ్చిన రూ.19 వేలతో వరంగల్‌లో ఇల్లు కట్టుకున్నారు. అనంతరం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో ఆ ఇల్లు కూడా అమ్మి, ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఓ చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. ఏ ఆదాయం లేకపోవడంతో ఇప్పుడు దాన్ని కూడా అమ్మే ఆలోచనలో ఉన్నారు. 1997లో ఎన్టీఆర్ అవార్డు కింద వచ్చిన రూ.50 వేలను తన ఉన్నతికి ఎంతగానో సహకరించిన భార్య సత్యవతి పేరిట ఫిక్స్ చేసి ఉంచారు. 2007లో ఆమె చనిపోయింది. కుటుంబ పోషణ కోసం ఆ డబ్బును కూడా ఖర్చు చేయాల్సి రావడం విషాదకరం. గతంలో తక్కువ అద్దెతో మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఓ షాపును కేటాయించారు. తర్వాత దాన్ని కూడా తీసేసుకున్నారు. ఇంత అద్భుత ఆటగాడికి ప్రభుత్వం నుంచి సహకారం కాదు కదా.. కనీసం పింఛన్ కూడా రాకపోవడం శోచనీయం. ప్రస్తుతం ఆయన చిన్నమ్మాయి (వరంగల్) దగ్గర ఉంటున్నారు.
‘నిజంగానే ఇది ‘పూర్’ మెన్ గేమ్’
పూర్ మెన్ గేమ్‌గా పేరున్న బాల్ బ్యాడ్మింటన్ ప్రస్తుతం షటిల్, క్రికెట్ జోరులో వెనకబడిపోయింది. నేటికీ కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈ క్రీడకు ప్రాచుర్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల క్రీడల్లో ఈ క్రీడను చేర్చితే పూర్వ వైభవం వస్తుంది. నాకు జీవితాన్నిచ్చిన బాల్ బ్యాడ్మింటన్ నా కళ్ల ముందే పతనం కావడం బాధిస్తోంది. ఈ క్రీడకు పూర్వవైభవం రావాలన్నదే నా కోరిక.
- జమ్మలమడక పిచ్చయ్య
బాల్ బ్యాడ్మింటన్‌కు భీష్ముడు కష్టాలలో ‘అర్జునుడు’
Published Fri, Feb 28 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement