బొల్లారం నుంచి బ్రెజిల్‌ దాకా.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వాళ్లు సైతం.. | Bolarum Sporting Club Successful Journey Of International Football Players | Sakshi
Sakshi News home page

బొల్లారం నుంచి బ్రెజిల్‌ దాకా.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వాళ్లు సైతం..

Published Wed, May 10 2023 2:38 PM | Last Updated on Wed, May 10 2023 4:40 PM

Bolarum Sporting Club Successful Journey Of International Football Players - Sakshi

ఉదయం 6 గంటలు... పక్షుల కిలకిలరావాలు.. అప్పుడప్పుడే బయటకు వస్తోన్న ప్రజలు. బొల్లారంలోని సదర్‌ బజార్‌లో ఓ ఇరుకు గల్లీ నుంచి కొద్దిగా ముందుకు వెళితే ఓ గ్రౌండ్‌.. ఓ వైపు వందేళ్ల కింద కట్టిన బ్రిటీష్‌ కాలం నాటి ప్రభుత్వ పాఠశాల, మరోవైపు సదర్‌ బజార్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌. వాటి మధ్య విశాలమైన క్రీడా ప్రాంగణం. అదే కంటోన్మెంట్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అడ్డా బొల్లారం స్పోర్టింగ్‌ గ్రౌండ్‌.

లోపలికి అడుగుపెడితే ఇంత పెద్ద గ్రౌండ్‌ లోపల ఉందా.. అనుకుంటూ ఆశ్చర్యపోతాం.. అక్కడి స్పోర్టింగ్‌ క్లబ్‌లో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా పిల్లలు రెడీ అయిపోతారు. 6గంటల కంటే ముందే వందకు పైగా పిల్లలు సాకర్‌ గెటప్‌లో వచ్చేస్తారు.

1,2,3.. వరుసగా కౌంట్‌ చేసుకుంటూ పిల్లలు వేసే కేకలు.. విశాల ప్రాంగణంలో మార్మోగుతాయి. ఎండాకాలం సెలవులంటే ఇంట్లోనే సెల్‌ఫోన్లకు పరిమితమై పోయే పిల్లలను ఫుట్‌బాల్‌ వైపు నడిపిస్తోంది బొల్లారం స్పోర్టింగ్‌ క్లబ్‌. ఇది కమర్షియల్‌గా చేస్తోంది కాదు.

పూర్తిగా సామాజిక సేవగా, మట్టిలో మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా క్లబ్‌ కోచ్‌లు, గతంలో క్లబ్‌తో కలిసి ప్రయాణం చేసిన మాజీ ఆటగాళ్లు ఈ క్యాంప్‌ను నడిపిస్తున్నారు. సాధారణ వ్యక్తుల్లా ఇదే క్లబ్‌లో అడుగుపెట్టి.. ప్రొఫెషనల్‌ ఆటగాళ్లుగా మారి.. ఇప్పుడు వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తోన్న కోచ్‌లు.. తమకిష్టమైన ఫుట్‌బాల్‌ కోసం వంతుల వారీగా బొల్లారం వచ్చి పిల్లలకు మెలకువలు నేర్పిస్తున్నారు. 

1946లో ప్రారంభమైన బొల్లారం స్పోర్టింగ్‌ క్లబ్‌ 75 ఏళ్ల వజ్రోత్సవాలను 2022లో పూర్తి చేసుకుంది. వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మాయిలకు, అబ్బాయిలకు ఫుట్‌బాల్‌ టోర్నీలను ఏడాదంతా నిర్వహించింది. మొత్తం 75 మ్యాచ్‌లు ఇందులో భాగంగా నిర్వహించారు.

ఈ క్లబ్‌లో ఓనమాలు నేర్చుకుని జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లు వేర్వేరు సంవత్సరాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. బొల్లారం ఫుట్‌ క్లబ్‌ నుంచి కొందరు ఆణిముత్యాలు.

1.పీటర్‌ తంగరాజ్‌ రెండు సార్లు ఒలింపిక్స్‌ (1956, 1960లో) ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ల్లో ఆడారు. అలాగే 1967లో అర్జున అవార్డు అందుకున్నారు. 
2.తులసీదాస్‌ బలరాం కూడా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. పీటర్‌ తంగరాజ్‌తో కలసి 1956, 1960 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 
3.డి.కన్నన్‌ 1958 ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 
4.అంటోనీ పాట్రిక్‌ ఇక్కడి నుంచే గేమ్‌ మొదలుపెట్టి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 
5.GM పెంటయ్య 1960లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌లో కోచ్‌గా సేవలందించారు. 

6.అలీం ఖాన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. DYSOగా పని చేసి రిటైర్‌ అయ్యారు
7.KRV మూర్తి ఇదే క్లబ్‌ నుంచి ఎన్నో మ్యాచ్‌లు ఆడి స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌లో పని చేసి రిటైరయ్యారు
8.GP విజయ్‌ కుమార్‌ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌గా రాణించారు, రాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత స్పోర్ట్స్‌ కోటాలో సెంట్రల్‌ ఎక్సైజ్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. 
9.B వేణుగోపాల్‌, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ నుంచి సాయ్‌లో సీనియర్‌ కోచ్‌గా ఎదిగారు. అలాగే NIS సర్టిఫైడ్‌ కూడా
10.విక్టర్‌ అమూల్‌ రాజ్‌ బొల్లారం నుంచి భారత జట్టకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. 

11.మణిభూషణ్‌, రాష్ట్ర జట్టుకు ఆడారు
12.ES శ్యాం స్థానిక ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మొదలుపెట్టి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌గా పని చేస్తూనే కోచ్‌గానూ సేవలందిస్తున్నారు. AFC ‘A’  లైసెన్స్‌ సర్టిఫైడ్‌ కోచ్‌గా ఉన్నారు
13. BR వివేక్‌– రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రైల్వేస్‌లో పని చేసి రిటైరయ్యారు
14. జయకుమార్‌ - రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రైల్వేస్‌లో పని చేసి రిటైరయ్యారు
15. అమర్‌ చంద్‌ -  రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. స్టేట్‌ బ్యాంకులో పని చేస్తున్నారు.

యువతలో ముఖ్యంగా చిన్నారుల్లో ఆటల పట్ల ఉత్సాహం పెంచాలన్నది ఈ సమ్మర్‌ క్యాంపు ప్రధాన ఉద్దేశ్యం. దానికి ఫుట్‌బాల్‌ను ఒక టూల్‌గా వాడుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు ఉత్సాహం పెంచడానికి కృషి చేస్తున్నారు.

అలాగే చారిత్రక బొల్లారం ఫుట్‌బాల్‌ క్లబ్‌ నుంచి మరింత మంది కొత్త ప్లేయర్లను తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్లబ్‌ నిర్వహణకు అన్ని రకాల సహకారం అందిస్తోన్న మాజీ కార్యదర్శులు భాస్కర్‌ రెడ్డి, గోపాల్‌రావు, జ్ఞానేశ్వర్‌, జీపీ విజయ్‌కుమార్‌తో పాటు ప్రస్తుత కార్యదర్శి రాజ్‌ సాయికృపా ఆనంద్‌లకు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రస్తుతం రెగ్యులర్‌ కోచ్‌లుగా సీనియర్‌ ఆటగాళ్లున్నారు.

1. గండ్ల సందీప్‌, రంగారెడ్డి జిల్లాతో పాటు యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు

2. S సునీల్‌ కుమార్‌, అండర్‌ 19 రాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించారు
3. C ప్రభాకర్‌ రెడ్డి, NIS సర్టిఫైడ్‌ కోచ్‌, కేంద్రీయ విద్యాలయం బొల్లారంలో కోచ్‌గా ఉన్నారు

4. బొడ్డు రాఘవేందర్‌, జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్‌ ప్లేయర్‌
5. Y వినోద్‌ కుమార్‌, సీనియర్‌ ప్లేయర్‌
6. R చండిల్, సీనియర్‌ ప్లేయర్‌
7. B అనిల్‌ కుమార్, సీనియర్‌ ప్లేయర్‌

వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తోన్న మాజీ ఆటగాళ్లు ఈ క్లబ్‌ నిర్వహణలో తమ వంతుగా సహకరిస్తున్నారు. సమ్మర్‌ క్యాంపులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు, వారందరికి ధన్యవాదాలు. ప్రతీ రోజు ఉదయాన్నే పిల్లలకు ఆటతో పాటు క్రమశిక్షణ, వ్యాయామం నేర్పిస్తున్నాం. ఈ సమ్మర్‌ క్యాంపులో పాల్గొన్న పిల్లల్లో స్పష్టమైన మార్పును కనిపెట్టవచ్చు. శారీరకంగా ఉత్సాహాంగా ఉంటారు.
-సునీల్‌, కోచ్‌, బొల్లారం స్పోర్టింగ్‌ క్లబ్‌



వ్యక్తిగతంగా తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాం. ఎక్కడెక్కడో పని చేస్తున్నా.. ఈ క్యాంపు కోసం వంతులు వేసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించి రెండు, మూడు రోజులు ప్లేయర్లతో గడుపుతున్నాం. ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా.. వీకెండ్‌లో ఇక్కడికి వచ్చి క్లబ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ తరంలో కొందరయినా.. బొల్లారం క్లబ్‌కు పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాం.
-శ్యాం, ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌, కోచ్‌, స్టేట్‌ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌

చిన్నప్పటి నుంచి ఈ క్లబ్‌తో అనుబంధం ఉంది. ఇక్కడే ఎంతో నేర్చుకున్నాం. అదే ఆటను ఇక్కడి వాళ్లకు నేర్పించడంలో ఎంతో ఆనందం ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. ఇక్కడికి వచ్చి పిల్లలకు మెలకువలు నేర్పిస్తాం. బొల్లారం ఫుట్‌బాల్‌ క్లబ్‌ మా జీవితంలో భాగం.
సందీప్‌, కోచ్‌, బొల్లారం స్పోర్టింగ్‌ క్లబ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement