న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) ద్వయం 2 గంటల్లో 2–6, 6–3, 6–4తో బోపన్న–ఎబ్డెన్ జంటను ఓడించి వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్‌బరీ ద్వయం గుర్తింపు పొందింది. జాన్ డోగ్–జార్జి లాట్ (అమెరికా) జోడీ 1928, 1929, 1930లలో వరుసగా మూడేళ్లు ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. విజేత రాజీవ్–సాలిస్‌బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తాజా ఫలితంతో 43 ఏళ్ల 6 నెలల వయసున్న బోపన్న తన కెరీర్‌లో రెండోసారి పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో కలిసి ఆడిన బోపన్న డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం రోహన్ బోపన్న ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి బోపన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.
బ్రేక్ పాయింట్ అవకాశాలు వృథా...
రాజీవ్, సాలిస్‌బరీలతో జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం తొలి సెట్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అయితే రాజీవ్–సాలిస్‌బరీ ఆందోళన చెందకుండా రెండో సెట్‌లో పుంజుకున్నారు. ఆరో గేమ్‌లో బోపన్న–ఎబ్డెన్ సర్విస్‌ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరులో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో సెట్‌లో బోపన్న జోడీ కీలకదశలో తడబడింది.
2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మూడో గేమ్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సర్విస్‌ను నిలబెట్టుకున్న రాజీవ్–సాలిస్‌బరీ ద్వయం స్కోరును 2–2తో సమం చేయడంతోపాటు ఐదో గేమ్‌లో బోపన్న జంట సర్విస్‌ను బ్రేక్ చేసి, ఆరో గేమ్‌లో తమ సర్విస్‌ను కాపాడుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6–4తో రాజీవ్–సాలిస్‌బరీ జోడీ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment