కరోనా భయంలో పలువురు స్టార్ క్రీడాకారిణులు దూరమైన నేపథ్యంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కరోలినా ప్లిస్కోవాకు రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఈ మాజీ నంబర్‌వన్‌కు ఫ్రాన్స్ అమ్మాయి గార్షియా షాక్ ఇచ్చింది. పురుషుల విభాగంలో ఎలాంటి సంచలనాలు లేకుండా టాప్ ఆటగాళ్లంతా ముందంజ వేశారు.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. చెక్ రిపబ్లిక్ స్టార్, టాప్‌సీడ్ ప్లిస్కోవా రెండో రౌండ్లోనే కంగుతింది. ఫ్రాన్స్ అమ్మాయి కరోలిన్ గార్షియా... ప్రపంచ మూడో ర్యాంకర్‌కు చెక్‌పెట్టింది. మిగతా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్ స్టార్ నాలుగో సీడ్ నవోమి ఒసాకా అలవోక విజయం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్, నాలుగో సీడ్ సిట్సిపాల్ (గ్రీస్), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు.
గార్షియా దూకుడు...
కరోలిన్ గార్షియా (ఫ్రాన్స్) ర్యాంకే కాదు... గత ప్రదర్శన కూడా ప్లిస్కోవా ముందు తీసికట్టే! 50వ ర్యాంకర్ అయిన ఆమె ఏకంగా ప్రపంచ మూడో ర్యాంకర్ ప్లిస్కోవాను వరుస సెట్లలో ఓడించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో గార్షియా 6–1, 7–6 (7/2)తో టాప్‌సీడ్ ప్లిస్కోవాను ఇంటిదారి పట్టించింది. గంటా 33 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ను ముగించి సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జపాన్ స్టార్, నాలుగో సీడ్ నవోమి ఒసాకా 6–1, 6–2తో ఇటలీకి చెందిన కెమిలా గియోర్గీపై అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 10 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పదో సీడ్ ముగురుజా (స్పెయిన్) పోరాటం కూడా ముగిసింది. స్వెతానా పిరోంకోవా (బల్గేరియా) 7–5, 6–3తో ఆమెను ఓడించింది.
స్నేహితురాలి ఓటమి...
స్కోరు 6–1, 5–1...మ్యాచ్ గెలిచే క్రమంలో సర్వీస్ అవకాశం...అయితే ఇలాంటి స్థితిలో కూడా క్రిస్టినా మ్లాడినోవిక్ (ఫ్రాన్స్) ఓటమిపాలైంది. గార్షియా స్నేహితురాలు, 2016లో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుపులో భాగస్వామి అయిన మ్లాడినోవిక్‌పై 1–6, 7–6 (7–2), 6–0తో వర్వారా గ్రాషెవా (రష్యా) విజయం సాధించింది. ఓటమి అంచుల్లోనే రెండో సెట్‌ను గెలుచుకున్న గ్రాషెవా చివరి సెట్‌లో క్రిస్టినాను చిత్తు చేసింది.
జొకో జోరు
ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో (2011, 2015, 2018) మూడు సార్లు విజేత అయిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కాస్త శ్రమించినా తేలిగ్గానే ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్ రెండ్లో సెర్బియా స్టార్ 6–7 (5/7), 6–3, 6–4, 6–2తో ఎడ్మండ్ (బ్రిటన్)పై గెలుపొందాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ 7–5, 6–7 (8/10), 6–3, 6–1తో అమెరికాకు చెందిన బ్రాండన్ నకషిమాపై నెగ్గాడు. నాలుగో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 7–6 (7/2), 6–3, 6–4తో క్రెసీ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7–6 (8/6), 4–6, 6–1, 6–4తో లాయిడ్ హరిస్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment