ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన లెక్‌లెర్క్
ఐదేళ్ల తర్వాత సొంతగడ్డపై ఫెరారీకి దక్కిన విజయం
లాండో నోరిస్‌కు మూడో స్థానం
ఆరో స్థానంతో వెర్‌స్టాపెన్ సంతృప్తి
ఫార్ములావన్ ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్‌లెర్క్ టైటిల్ గెలుచుకున్నాడు. నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్.. వాయువేగంతో ముందుకు సాగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
గత వారం డచ్ గ్రాండ్‌ప్రి టైటిల్ దక్కించుకున్న లాండో నోరిస్ మూడో స్థానంతో సరిపెట్టుకోగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ‘టాప్’లో ఉన్న వెర్‌స్టాపెన్ ఆరో స్థానానికే పరిమితమయ్యాడు.
మోంజా (ఇటలీ): ఫార్ములావన్ సీజన్ 16వ రేసు ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ విజేతగా నిలిచాడు.
ఆదివారం జరిగిన ప్రధాన రేసులో లెక్‌లెర్క్ అందరికంటే ముందుగా నిరీ్ణత 53 ల్యాప్‌లను 1 గంటా 14 నిమిషాల 40.727 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఫెరారీ జట్టు ప్రధాన కేంద్రమైన ఇటలీలో ఆ జట్టుకు టైటిల్ దక్కడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2019లో లెక్‌లెర్కే ఫెరారీ జట్టుకు ఇక్కడ టైటిల్ అందించాడు.
నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన లెక్‌లెర్క్ తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్లాడు. గత కొన్ని రేసుల నుంచి టాప్ త్రీలో చోటు దక్కించుకోలేకపోతున్న లెక్‌లెర్క్ ఈసారి సత్తా చాటగా... గత వారం డచ్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
మెక్‌లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 గంటా 14 నిమిషాల 43.391 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానం దక్కించుకున్న లెక్‌లెర్క్‌తో పోల్చుకుంటే... పియాస్ట్రి 2.664 సెకన్లు ఆలస్యంగా గెలుపు గీత దాటాడు.
మొత్తం 53 ల్యాప్‌లు గల 306.720 కిలోమీటర్ల ఈ రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన నోరిస్ 1 గంటా 14 నిమిషాల 46.880 సెకన్లలో గమ్యాన్ని చేరి మూడో స్థానం దక్కించుకున్నాడు. డ్రైవర్స్ చాంపియన్‌ప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 1 గంట 15 నిమిషాల 18.659 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సీజన్‌లో మరో ఎనిమిది రేసులు మిగిలుండగా... వెర్‌స్టాపెన్ 303 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా... 241 పాయింట్లతో నోరిస్ రేండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో ఉన్న డ్రైవర్ల మధ్య ప్రస్తుతం 62 పాయింట్ల వ్యత్యాసం ఉంది.
రేసు రేసు ఆరంభంలోనే లెక్‌లెర్క్ ఆధిక్యం దక్కించుకోగా... మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ కూడా వాయువేగంతో దూసుకెళ్లాడు. అయితే రెండో మలుపు వద్ద నోరిస్‌ను మెక్‌లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చాడు.
చివరకు వరకు పియాస్ట్రి అదే జోరు కొనసాగించినా.. లెక్‌లెర్క్‌ను అందుకోలేకపోయాడు. కార్లోస్ సెయింజ్ జూనియర్ (ఫెరారీ) 1 గంట 14 నిమిషాల 56.348 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలవగా... బ్రిటన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) 1 గంట 15 నిమిషాల 3.547 సెకన్లలో రేసును ముగించి ఐదో స్థానం దక్కించుకున్నాడు.
ఈ రేసు ద్వారానే ఫార్ములావన్ అరంగేట్రం చేసిన విలియమ్స్ రేసింగ్ జట్టు డ్రైవర్ ఫ్రాంకో కొలాపింటో 12వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న బాకు సిటీలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment