మాల్దీవ్స్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మైదానంలో ఉన్నా, మైదానం వెలుపల ఉన్నా సందడి మాత్రం కామన్‌గా కనిపిస్తుంటుంది. క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీలు, సిక్సర్లతో అలరించే ఈ విండీస్ విధ్వంసకర వీరుడు.. మైదానం వెలుపల రకరకాల డ్యాన్సులు చేస్తూ, తనలో దాగి ఉన్న అనేక నైపుణ్యాలను బయటపెడుతూ.. ఫ్యాన్స్ కావాల్సిన కనువిందును అందిస్తుంటాడు. భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడటంతో మాల్దీవుల్లో సేదతీరేందుకు బయల్దేరిన ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. అక్కడ తనలో దాగి ఉన్న మరో కళను ఆవిష్కరించాడు. ఎగిసిపడుతున్న సముద్రపు అలలపై జెట్ స్కీయింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రచ్చరచ్చ చేశాడు.
స్కీయింగ్ చేస్తూ, చేతిలో సిగార్‌తో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా గంటల వ్యవధిలో 1.3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో అతని స్టామినా ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తుంది. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా, దానికి కూడా రెండు లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే, తమ దేశంలో అంక్షల కారణంగా ఐపీఎల్‌లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లు కూడా కొద్ది రోజుల పాటు మాల్దీవుల్లోనే గడిపారు. సోమవారం ఆసీస్ ఆటగాళ్లంతా స్వదేశానికి చేరుకోగా యూనివర్సల్ బాస్ మాత్రం మరికొద్ది రోజులు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడట.
చదవండి: టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్..
Comments
Please login to add a commentAdd a comment