gayle
-
మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేసిన యూనివర్సల్ బాస్..
మాల్దీవ్స్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మైదానంలో ఉన్నా, మైదానం వెలుపల ఉన్నా సందడి మాత్రం కామన్‌గా కనిపిస్తుంటుంది. క్రికెట్ గ్రౌండ్లో బౌండరీలు, సిక్సర్లతో అలరించే ఈ విండీస్ విధ్వంసకర వీరుడు.. మైదానం వెలుపల రకరకాల డ్యాన్సులు చేస్తూ, తనలో దాగి ఉన్న అనేక నైపుణ్యాలను బయటపెడుతూ.. ఫ్యాన్స్ కావాల్సిన కనువిందును అందిస్తుంటాడు. భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వాయిదా పడటంతో మాల్దీవుల్లో సేదతీరేందుకు బయల్దేరిన ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాడు.. అక్కడ తనలో దాగి ఉన్న మరో కళను ఆవిష్కరించాడు. ఎగిసిపడుతున్న సముద్రపు అలలపై జెట్ స్కీయింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రచ్చరచ్చ చేశాడు. స్కీయింగ్ చేస్తూ, చేతిలో సిగార్‌తో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా గంటల వ్యవధిలో 1.3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో అతని స్టామినా ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా, దానికి కూడా రెండు లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే, తమ దేశంలో అంక్షల కారణంగా ఐపీఎల్లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లు కూడా కొద్ది రోజుల పాటు మాల్దీవుల్లోనే గడిపారు. సోమవారం ఆసీస్ ఆటగాళ్లంతా స్వదేశానికి చేరుకోగా యూనివర్సల్ బాస్ మాత్రం మరికొద్ది రోజులు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడట. చదవండి: టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్.. View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) View this post on Instagram A post shared by KingGayle 👑 (@chrisgayle333) -
బెంగళూరు గెలిచిందోచ్
ఒకటి కాదు... రెండు కాదు... బెంగళూరు ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడింది. ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. కోహ్లి పట్టుదల, డివిలియర్స్ మెరుపులు రాయల్ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కాస్త మెరుగనిపించారు. బ్యాటింగ్‌లో టాపార్డరే విజయందాకా లాక్కొచ్చింది. ఆఖర్లో స్టొయినిస్ ధనాధన్ ఒత్తిడిని జయించేలా చేసింది. బెంగళూరును గెలిపించింది. మొహాలి: హమ్మయ్య బెంగళూరు కూడా పాయింట్ల పట్టికలో గెలుపు కాలమ్‌ను భర్తీ చేసింది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడినా అందని విజయం ఏడో మ్యాచ్‌లో దక్కింది. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ జట్టు 8 వికెట్లతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (64 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు. సుడి‘గేల్’ ఆఖరిదాకా... టాస్ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ పరుగులు ప్రారంభించేందుకు దిగింది. ఉమేశ్ తొలి ఓవర్లో 2 పరుగులే ఇచ్చాడు. తర్వాత సైనీ ఓవర్లో బౌండరీతో గేల్ పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. మూడో ఓవర్‌ను ఉమేశ్ వేయగా 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. ఇక హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగ్‌కు దిగితే బౌండరీలకు గేట్లెత్తినట్లుగా బాదేశాడు గేల్. ఈ ఆరో ఓవర్లో 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగుల్ని పిండుకున్నాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు 60/0. ఇందులో గేల్ ఒక్కడివే 48 కావడం విశేషం. శుభారంభం దక్కిన కింగ్స్ ఇన్నింగ్స్‌కు చహల్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్ 7వ)లో బ్రేక్ వేశాడు. మొదటి బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చినా... ఎంతోసేపు నిలువలేకపోయాడు. గేల్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తన రెండో ఓవర్లో చహల్... మయాంక్‌నూ ఔట్ చేశాడు. అచ్చు రాహుల్ లాగే సిక్స్ కొట్టి మరుసటి బంతికే మయాంక్ (15; 1 ఫోర్, 1 సిక్స్) ఔటయ్యాడు. ఈ దశలో గేల్ నెమ్మదించాడు. పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే సర్ఫరాజ్ ఖాన్ (15; 1 ఫోర్, 1 సిక్స్)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో స్యామ్ కరన్ (1) మొయిన్ అలీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అలా 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. అనంతరం గేల్‌కు మన్దీప్ సింగ్ జతయ్యాడు. మరో వికెట్ పడకుండా ఇద్దరు పరుగుల వేగం పెంచారు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో గేల్ సరిగ్గా 99 స్కోరు చేసి సెంచరీకి పరుగు దూరంలో అజేయంగా ఆగిపోయాడు. ధాటిగా మొదలైంది... ఎలాగైనా గెలవాలన్నా కసో లేక మిడిలార్డర్‌పై అపనమ్మకమో గానీ... కోహ్లి, పార్థివ్ పటేల్ ద్వయం బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. పార్థివ్ ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్లో కోహ్లి రెండు, పార్థివ్ మరో ఫోర్ కొట్టారు. మూడో ఓవర్లో ఈ సారి కోహ్లి ఒక బౌండరీ బాదితే... పార్థివ్ రెండు బాదాడు. 3 ఓవర్లలో రాయల్ చాలెంజర్స్ స్కోరు 36/0. నాలుగో ఓవర్ వేసిన అశ్విన్... పార్థివ్ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను ఔట్ చేసి ఈ జోడీని విడగొట్టాడు. తర్వాత డివిలియర్స్ వచ్చిరాగానే 2 ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. కోహ్లి, డివిలియర్స్ ఫిఫ్టీ–ఫిఫ్టీ కోహ్లి, డివిలియర్స్ ఇద్దరు క్రీజ్‌లో పాతుకుపోవడంతో పంజాబ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా డివిలియర్స్ పాదరసంలా పరుగెత్తాడు. దీంతో సింగిల్స్ వచ్చే చోట బెంగళూరు రెండేసి పరుగుల్ని చకచకా సాధించింది. 10 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 88/1. ఇద్దరు సమన్వయంతో ఆడటంతో భారీషాట్లు కొట్టకుండానే బెంగళూరు అవసరమైన రన్‌రేట్‌ను సాధిస్తూ వచ్చింది. 11వ ఓవర్లో కోహ్లి 37 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటే 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మెరుపుల్లేకపోయినా పరుగులు మాత్రం చేస్తుండటంతో పంజాబ్ బౌలర్లకు ఎటూ పాలుపోలేదు. ఈ ద్వయాన్ని పడగొట్టలేక, పరుగుల్ని నియంత్రించలేక విలవిల్లాడారు. ఇలా చూస్తుండగానే రాయల్ చాలెంజర్స్ 15 ఓవర్లలో 126/1 స్కోరు చేసింది. ఇక ఆఖరి 5 ఓవర్లలో ‘బెంగ’తీరే విజయానికి 48 పరుగులు కావాలి. 16వ ఓవర్ వేసిన షమీ... కోహ్లి వికెట్ తీశాడు. దీంతో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ ఓవర్లో 4 పరుగులు, 17వ ఓవర్లో 6 పరుగులు రావడంతో చేయాల్సిన రన్‌రేట్ ఒక్కసారిగా పెరిగింది. 18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో అండ్రూ టై వేసిన 18వ ఓవర్లో స్టొయినిస్ 2 ఫోర్లు, డివిలియర్స్ సిక్స్ బాదాడు. దీంతో 18 పరుగులు రాగా, డివిలియర్స్ 35 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్నాడు. షమీ 19 ఓవర్లో 14 పరుగులిచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరమైతే స్టొయినిస్ (16 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) 4, 2తో మరో 4 బంతులు మిగిలుండగానే ముగించాడు. -
టి20ల్లో ‘విన్’డీసే
2016 మార్చి 31: ముంబైలో టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్... విరాట్ కోహ్లి (47 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో 192 పరుగులు చేసింది. సొంతగడ్డ బలంతో గెలుపు మనదే అనుకున్నారంతా. గేల్, శామ్యూల్స్ వంటి హిట్టర్లు విఫలం కావడంతో ఆట అలాగే మొదలైంది కూడా. కానీ, జాన్సన్ చార్లెస్ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లెండిల్ సిమన్స్ 51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), రసెల్ (20 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఇలా ఒకరి వెంట ఒకరు విరుచుకుపడి రెండు బంతులు ఉండగానే విజయాన్ని గుంజేసుకున్నారు. 2016 ఆగస్ట్ 27: ఫ్లోరిడాలో వెస్టిండీస్–భారత్ మధ్య రెండో టి20. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జాన్సన్ చార్లెస్ (33 బంతుల్లో 79; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఎవిన్ లూయీస్ (49 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) దుమ్ము రేపడంతో 245 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ, చివరి ఓవర్లో బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. సాక్షి క్రీడా విభాగం: ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ టి20ల్లో ఎంతటి మొండి జట్టో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలు. ఈ పొట్టి ఫార్మాట్లో భారత్... ఆస్ట్రేలియా కొమ్ములు వంచింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. పాకిస్తాన్‌కు దమ్ము చూపించింది. ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ, విండీస్‌ను మాత్రం కనీసం వణికించలేకపోతోంది. కారణం... ఆ జట్టులోని భీకర హిట్టర్లైన బ్యాట్స్‌మెన్, మంత్రం వేసినట్లు కట్టిపడేసే బౌలర్లే. టెస్టులు, వన్డే ల్లో ప్రదర్శన ఎలా ఉన్నా... ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల లో ఆడుతుండటంతో కరీబియన్లు టి20ల్లో మేటిగా నిలుస్తున్నారు. దీంతో వారికి ఒత్తిడిని అధిగమించడంతో పాటు, వేదిక ఏదైనా, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదురుదాడి చేసే స్థయిర్యం అలవడింది. ఎంతకూ మింగుడుపడదే! టీమిండియా ఇప్పటివరకు విండీస్‌పై 8 టి20లు ఆడితే రెండే నెగ్గగలిగింది. ఐదింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. మేటి జట్లన్నింటిపై మెరుగైన రికార్డు ఉన్నా, కరీబియన్లు మాత్రం మనకు ఎంతకూ లొంగడం లేదు. గేల్ దుమారం అంతగా తాకకున్నా... ఎవిన్ లూయీస్, జాన్సన్ చార్లెస్, లెండిల్ సిమ్మన్స్ వంటి పెద్దగా పేరు లేని ఆటగాళ్లే భారత్‌ను బంతాట ఆడుకున్నారు. వీరితోపాటు బ్రేవో, స్యామీ, బ్రాత్‌వైట్, పొలార్డ్, రస్సెల్ వంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు ఎంతకూ తెగని కథలా కనిపించేది. ఇందులో చాలామంది ప్రస్తుత జట్టులో లేకున్నా ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఆదమరిస్తే అంతే! చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు కొట్టి ఇంగ్లండ్ నుంచి టి20 ప్రపంచకప్‌ను అమాంతం లాగేసుకున్న కార్లోస్ బ్రాత్‌వైట్ ఇప్పుడు వెస్టిండీస్ టి20 జట్టు కెప్టెన్. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున మెరుపులు మెరిపించిన రసెల్, ముంబై ఇండియన్స్‌ను చాలా సార్లు గట్టెక్కించిన కీరన్ పొలార్డ్ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వీరితో పాటు జట్టులో ఉన్న కారీ పియరీ, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో దెబ్బకొట్టే సత్తా ఉన్న ఆల్‌రౌండర్లే కావడం విశేషం. ఇక, యువ హెట్‌మైర్ దూకుడెంతో వన్డే సిరీస్‌లోనే తెలిసొచ్చింది. లూయిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన నికొలస్ పూరన్ సైతం సత్తా ఉన్నవాడే. ఈ నేపథ్యంలో ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20ల్లో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. -
మాట ఇచ్చి... మొహం చాటేశారు
మొహాలి: ఐపీఎల్... క్రిస్ గేల్... క్రికెట్ ప్రజాదరణలో విడదీయలేని పేర్లివి. ఐపీఎల్ ఎంత పెద్ద హిట్టో, గేల్ కూడా అంతే గొప్పగా ఈ లీగ్‌లో పేరు గడించాడు. అలాంటి గేల్‌కు జనవరిలో వేలం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఏడు సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతన్ని తీసుకోలేదు. చివరకు పంజాబ్ రూ.2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది. ఈ పరిణామాలపై తాజాగా గేల్ స్పందించాడు. తనను రీటెయిన్ చేసుకుంటామని రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం హామీ ఇచ్చి... తర్వాత కనీసం ఫోన్ చేయకుండా మొహం చాటేసిందని అతడు చెబుతున్నాడు. ‘అది ఎంతో నిరుత్సాహపర్చింది. వారు నన్ను తీసుకోవట్లేదని తెలిసింది. వేలం చివరి రౌండ్లో ఎంచుకున్నా బాధపడేవాడిని కాదు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అప్పటికే సీపీఎల్, బీపీఎల్లలో రెండు సెంచరీలు చేశా. నా రికార్డులు అబద్ధం చెప్పవుగా. కొన్నిసార్లు ఐపీఎల్, ఆటకు దూరంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంటుంది. జీవితం అంటే ఇదే’ అని గేల్ వివరించాడు. నేనే దిగ్గజం..: ‘వారి దిగ్గజ ఆటగాళ్లలో నేనొకడిని కాదు. నేనే వారి దిగ్గజ ఆటగాడిని’ అంటూ గేల్ పరోక్షంగా బెంగళూరు జట్టును ఎద్దేవా చేశాడు. పంజాబ్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందివ్వడం తన తక్షణ కర్తవ్యంగా, 2019 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలిచేలా చూడటం భవిష్యత్ లక్ష్యంగా తెలిపాడు. -
ఈసారి పంజా(బ్) కోల్‌కతాపై...
కరీబియన్ గేల్ భీకర ఫామ్‌లో ఉంటే ఎంతటి లక్ష్యమైనా చిన్నబోతుంది. అతడి హిట్టింగ్‌కు కేఎల్ రాహుల్ కళాత్మక షాట్లు తోడైతే ఇక అడ్డేముంది. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఛేదన ఇంత సులువా అన్నట్లు సాగిన వీరిద్దరి భాగస్వామ్యం ముంగిట పైచేయి సాధించడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకపోయింది. కోల్‌కతా: క్రిస్ గేల్ పంజాబ్‌కు జాంపండులా దొరికినట్లున్నాడు. పెద్దగా ఆశల్లేకుండానే ఈ సీజన్ బరిలోకి దిగిన జట్టును తన ఆటతో ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నాడు. అతడికి ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా తోడవడంతో శనివారం కోల్‌కతాను దాని సొంతగడ్డపైనే పంజాబ్ 9 వికెట్లతో అలవోకగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్... ఓపెనర్ క్రిస్ లిన్ (41 బంతుల్లో 74; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు), రాబిన్ ఉతప్ప (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు గేల్ (38 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (27 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 8.2 ఓవర్లలో కింగ్స్ ఎలెవెన్ స్కోరు 96/0 వద్ద వర్షం అంతరాయం కలిగించింది. గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది. అనంతరం డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని సవరించి 13 ఓవర్లలో 125గా నిర్ణయించారు. దాంతో పంజాబ్ విజయానికి 28 బంతుల్లో 29 పరుగులు అవసరమయ్యాయి. దీనిని ఆ జట్టు రాహుల్ వికెట్ కోల్పోయి 11.1వ ఓవర్లోనే అందుకుంది. పంజాబ్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆ ముగ్గురి మెరుపులతో... మెరుపు షాట్లు కొట్టే నరైన్ (1) తొందరగానే నిష్క్రమించడంతో కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. అయితే, లిన్, ఉతప్ప దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 72 పరుగులు జోడించారు. శరణ్ వేసిన 8వ ఓవర్లో విరుచుకుపడి 23 పరుగులు సాధించారు. అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఉతప్ప, మరుసటి ఓవర్లోనే సమ్వనయ లోపంతో నితీశ్ రాణా (3) రనౌట్ కావడంతో రెండు ఓవర్ల పాటు స్కోరు మందగించింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ వస్తూనే బ్యాట్ ఝళిపించాడు. లిన్ కూడా తగ్గక పోవడంతో 34 బంతుల్లోనే 62 పరుగులు వచ్చాయి. వీరి జోరు చూస్తే స్కోరు 200 దాటేలా కనిపించింది. కానీ, లిన్, రస్సెల్ (10) వెంటవెంటనే అవుట్ కావడం, కార్తీక్ కీలక సమయంలో వెనుదిరగడం దెబ్బతీసింది. పంజాబ్ బౌలర్లు చివరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ (8 బంతుల్లో 14 నాటౌట్) దూకుడు చూపలేకపోవడంతో స్కోరు 191కే పరిమితమైంది. ఈ ఇద్దరి జోరుతో... లక్ష్యం భారీగా ఉన్నా పంజాబ్ ఓపెనర్లు గేల్, రాహుల్ బెదరకుండా ఆడారు. కోల్‌కతా తమ తురుపుముక్క నరైన్‌ను కాకుండా శివమ్ మావి, రస్సెల్‌తో ప్రారంభ ఓవర్లు వేయించడంతో వీరికి ఇబ్బంది ఎదురవలేదు. ఇద్దరిలో రాహులే స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. మావి వేసిన కొన్ని బంతులను ఆడలేకున్నా, రాణా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో గేల్ ప్రతాపం చూపాడు. నాలుగో ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక సవరించిన లక్ష్యాన్ని అందుకునే క్రమంలో గేల్ తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపి అర్ధ శతకం (28 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు. నరైన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఫిఫ్టీ (24 బంతుల్లో) అందుకున్న రాహుల్ మరో రెండు ఫోర్లు కొట్టి అవుటయ్యాడు. కరన్ బంతిని సిక్స్ కొట్టిన గేల్ మరో 11 బంతులు ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. -
గేల్ బల్లే బల్లే
సీజన్లో పావు వంతు మ్యాచ్‌లు అయిపోయాయి...అయినా ఒక్క శతకమూ నమోదు కాలేదే!సగటు క్రికెట్ అభిమానుల్లో ఒకింత నిరాశ...బహుశా ఈ నిరీక్షణంతా అతడి కోసమేనేమో...దానికి తెరదించేందుకే తను ఉన్నాడేమో...!మొదటిసారి వేలంలో అక్కర్లేదన్నారురెండోసారి వేలంలో పట్టించుకోనేలేదుఎప్పుడైనా చెలరేగకపోతాడాని అనుకున్నారేమో? మూడోసారి కనీస మొత్తానికి దక్కించుకున్నారుఈ కసినంతా మనసులో పెట్టుకున్నాడేమో!దానిని మనసారా ఆటలో చూపాడేమో!అందుకే అతడు క్రిస్ గేల్ అయ్యాడేమో!అదిగో... రానే వచ్చాడు! సెంచరీ కొట్టనే కొట్టాడు! మొహాలి: ఐపీఎల్లో మళ్లీ మొదలైంది గేల్ తుఫాన్! టి20ల్లో తానెంతటి విశిష్ట ఆటగాడో చాటుతూ, తనను తీసుకోకపోవడం ఎంత తప్పో ఇతర జట్లకు చెబుతూ, తన బ్యాట్ పదును తగ్గలేదని చూపుతూ... అతడు విరుచుకు పడ్డాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కింగ్‌లా నిలిచి... వరుస విజయాల ఊపులో ఉన్న సన్‌రైజర్స్‌ను పరాజయం పాల్జేశాడు. రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గేల్ (63 బంతుల్లో 104 నాటౌట్; 1 ఫోర్, 11 సిక్స్‌లు) దూకుడుతో కింగ్స్ ఎలెవెన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. భువనేశ్వర్ (1/25) మెరుగ్గానే బౌలింగ్ చేసినా, రషీద్ ఖాన్ (1/55) భారీగా పరుగులిచ్చాడు. ఛేదనలో శిఖర్ ధావన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా, కెప్టెన్ విలియమ్సన్ (41 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ పాండే (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా బ్యాట్స్‌మెన్ చతికిలపడటంతో హైదరాబాద్ నాలుగు వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15 పరుగుల తేడాతో సీజన్లో తొలి ఓటమిని మూటగట్టుకుంది. ఆండ్రూ టై (2/23), శరణ్ (0/22), ముజీబ్ (0/27) పొదుపుగా బంతులేశారు. గేల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. అశ్విన్ ఆలోచనే మలుపు... ఐపీఎల్–11లో ఇప్పటివరకు టాస్ గెలిచిన కెప్టెన్లందరూ మొదట బ్యాటింగ్ ఎంచుకోలేదు. కానీ, హైదరాబాద్ బౌలింగ్‌లో ఛేదన కష్టమని తెలివిగా ఆలోచించిన పంజాబ్ సారథి అశ్విన్... ఏమాత్రం సంకోచించకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఫలితం దక్కడానికి మాత్రం ఆ జట్టుకు కొంత సమయం పట్టింది. భువనేశ్వర్, జోర్డాన్ కట్టుదిట్టంగా బంతులేయడంతో 4 ఓవర్లకు కింగ్స్ ఎలెవెన్ 25 పరుగులే చేయగలిగింది. అయితే 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాహా క్లిష్టమైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ దక్కిన గేల్... రెండు సిక్స్‌లు కొట్టి ఊపులోకి వచ్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 49/0తో నిలిచింది. మరో ఎండ్‌లో సాధికారికంగా ఆడలేకపోయిన కేఎల్ రాహుల్ (21 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో పాటు, కొన్ని మెరుపు షాట్లు ఆడిన మయాంక్ అగర్వాల్ (9 బంతుల్లో 18) త్వరగా వెనుదిరిగారు. అప్పటికీ గేల్ కూడా జోరందుకోలేదు. దీంతో 11 ఓవర్లకు 86/2తో మ్యాచ్ సాధారణంగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ, కరుణ్ నాయర్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా కరీబియన్ సునామీ విరుచుకుపడటంతో ఆట మారిపోయింది. 39 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న అతడు 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి రషీద్‌కు చుక్కలు చూపాడు. ఈ ఓవర్లో మొత్తం 27 పరుగులు రాగా అందులో 26 గేల్ చేసినవే. దీంతో అతడు ఒక్కసారిగా 70ల్లోకి వచ్చాడు. జోర్డాన్ బౌలింగ్‌లో సిక్స్‌తో 90ల్లోకి వచ్చిన అతడు, 18వ ఓవర్ చివరి బంతిని సిక్స్ కొట్టి 99 మీద నిలిచాడు. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో సింగిల్ శతక లాంఛనం పూర్తి చేశాడు. అంతకుముందు గేల్, కరుణ్ మూడో వికెట్‌కు 48 బంతుల్లో 85 పరుగులు జోడించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. చివర్లో ఫించ్ (6 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) తనవంతుగా ఆడాడు. ఆదిలోనే కోలుకోలేని దెబ్బ... ఎదురుగా భారీ లక్ష్యం. దానిని అందుకోవాలంటే మెరుపు ఆరంభం కావాలి. జట్టులో అలాంటి ఇన్నింగ్స్ ఆడగల ఏకైక బ్యాట్స్‌మన్ అయిన శిఖర్ ధావన్... శరణ్ బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే రిటైర్ట్ హర్ట్ అయ్యాడు. ఇక సన్ రైజర్స్ పరిస్థితి చెప్పేదేముంది! సాహా (6), యూసుఫ్ పఠాన్ (19) నిరాశపరిచారు. హైదరాబాద్ కొద్దిసేపైనా మ్యాచ్‌లో నిలిచిందంటే అది విలియమ్సన్, పాండే క్రీజులో ఉన్నప్పుడే. వీరు 56 బంతుల్లో 76 పరుగులు జోడించినప్పటికీ ఆ రన్‌రేట్ విజయానికి సరిపోలేదు. షకి బుల్ హసన్ (12 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. మ్యాచ్లోఫీల్డర్లు పలు అవకాశాలు జారవిడవకుంటే పంజాబ్ మరింత ఆధిక్యంతో గెలిచేదే. నాకు వయసైపోయిందని చాలా మంది అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవడానికేమీ లేదు. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకోబోతున్న నా కూతురికి ఈ సెంచరీ అంకితం. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై పట్టుదలతో నిలబడ్డాను. నన్ను జట్టులోకి తీసుకొని సెహ్వాగ్ ఐపీఎల్‌ను రక్షించాడు. రెండు మ్యాచుల్లో గెలిపిస్తే చాలన్న అతని మాట నిలబెట్టాను – క్రిస్ గేల్ ►21 టి20ల్లో గేల్ సెంచరీల సంఖ్య. మెకల్లమ్, క్లింగర్, ల్యూక్ రైట్ తలా 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ►16 గేల్ ఒక ఇన్నింగ్స్‌లో పదికి పైగా సిక్సర్లు బాదడం ఇది 16వ సారి. మరో నలుగురు ఆటగాళ్లు మాత్రమే గరిష్టంగా రెండు సార్లు ఈ ఘనత సాధించారు. -
సొంతగడ్డపై పంజాబ్‌కు మరో గెలుపు
-
ధోని ధమాకా సరిపోలేదు
మొహాలి: ఐపీఎల్లో మరో ఉత్కంఠభరిత ముగింపు... మహేంద్ర సింగ్ ధోని (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనతో సూపర్ కింగ్స్‌ను విజయానికి చేరువగా తెచ్చినా చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సి ఉండగా, చెన్నై 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు రెండు ఓవర్లలో కలిపి ధోని ధమాకా బ్యాటింగ్‌తో 38 పరుగులు రాగా... వెన్నునొప్పితో సరిగ్గా కదల్లేకపోయిన చెన్నై కెప్టెన్ ఆఖరి ఓవర్లో లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. ఆదివారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో చెన్నైను ఓడించింది. సొంతగడ్డపై అశ్విన్ సేనకు ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన క్రిస్ గేల్ (33 బంతుల్లో 63; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో చెలరేగి అర్ధ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 37; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లోనే 96 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ఠాకూర్, తాహిర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధోని మెరుపు బ్యాటింగ్ చేయగా, అంబటి రాయుడు (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, ఒక సిక్స్) కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. టైకి 2 వికెట్లు దక్కాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హమ్మయ్య! విండీస్ గట్టెక్కింది
హరారే: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించి... రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ చేజిక్కించుకున్న విండీస్ ఎట్టకేలకు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరుగనున్న మెగా టోర్నీకి అర్హత సాధించింది. చిన్న జట్లతో కలిసి క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొన్న విండీస్ బుధవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్‌సిక్స్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో వరణుడు విండీస్ వైపు నిలవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం గెలిచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటయ్యారు. గేల్ (0) ‘గోల్డెన్’ డక్‌గా వెనుదిరగగా... ఎవిన్ లెవీస్ (66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్లోన్ శామ్యూల్స్ (51; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షరీఫ్, బ్రాడ్ వీల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడింది. మ్యాచ్ నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం స్కాట్లాండ్ స్కోరు 130 పరుగులుగా ఉంటే ఆ జట్టు గెలిచేది. అయితే ఆ స్కోరుకు ఐదు పరుగుల దూరంలో స్కాట్లాండ్ ఉండటంతో విండీస్ విజయం ఖాయమైంది. -
యువీ, గేల్.. చెరో రెండు విజయాలు చాలు!
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ ఇద్దరూ కలిసి చెరో రెండు మ్యాచ్‌లను గెలిపించినా ఫ్రాంచైజీకి న్యాయం చేసినట్టేనని ఆ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను రెండోసారి జరిగిన వేలంలోనూ ఏ ఫాంచైజీ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. వీరిని రూ.2 కోట్ల చొప్పున పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఓపెనర్‌గా యువీ సేవలు.. ‘దిగ్గజ ఆటగాళ్లు గేల్, యువరాజ్లు తక్కువ ధరకే మా సొంతం అయ్యారు. వారిద్దరూ మ్యాచ్ విన్నర్లు. వాళ్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిపించినా.. వాళ్లపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసినట్టే’నని సెహ్వాగ్ అన్నారు. ‘ఓపెనర్‌గా యువీని కొన్ని మ్యాచుల్లో వినియోగించుకుంటాం. అయితే ఆరోన్ ఫించ్, మయాంక్ అగర్వాల్ తరహాలో క్రిస్ గేల్ ప్రారంభంలో ఆటలోకి దిగి ఎక్కువ సేపు వికెట్ కాపాడుకోలేడు. ఆరోన్ ఫించ్ వివాహం సందర్భంగా తొలి మ్యాచ్‌లో అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో గేల్ ఓపెనింగ్‌కు పంపిస్తాం. అయితే, అతను నిలకడ ఆడాల్సిన అవసరముంది’ అని సెహ్వాగ్ పేర్కొన్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించి నాణ్యమైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నామనీ.. వారంతా మంచి ప్రతిభతో ఆడితే ఈ సారి ఐపీఎల్ విజేతగా పంజాబ్ జట్టు నిలుస్తుందని ఈ మాజీ ఓపెనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రోఫీని చేజిక్కించుకోవాలంటే వాళ్ల ప్రదర్శన కీలకం.. గత సీజన్లలో పంజాబ్ జట్టులో భారత్ ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉండేదనీ, కానీ ఈసారి రవించంద్రన్ అశ్విన్ నేతృత్వంలో యువ తరంగాలు.. అక్షర్ పటేల్, కరణ్ నాయర్, కేఎల్ రాహుల్, బరీందర్ శరన్, మోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్ ఉన్నారని సెహ్వాగ్ వెల్లడించారు.‘గత కొన్నేళ్లుగా వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ మినహా మిగతా భారత ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ట్రోఫీని చేజిక్కించుకోవాలంటే భారత ఆటగాళ్ల ప్రదర్శన కీలకం. ఈ సారి మా తుది జట్టులో 4 నుంచి 5 మంది భారత ఆటగాళ్లుంటార’ని ఆయన తెలిపారు. జట్టుకు కెప్టెన్‌గా బౌలర్ ఉండడం అదనపు బలమని అన్నారు. అశ్విన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను జట్టును ముందుండి నడిపిస్తాడని ఆకాక్షించారు. చివరి ఓవర్లో ప్రత్యర్థి జట్టుకు 10, 15 పరుగులు అవసరమైనప్పుడు బౌలర్ కెప్టెన్‌గా ఉన్న జట్టుకే విజయావకాశాలు ఎక్కువని జోస్యం చెప్పారు. -
కోట్లు కురిశాయి
ఐపీఎల్ ‘బ్రాండ్’ బాజా ఈ వేలంలోనూ మోగింది. నచ్చిన ఆటగాడిపై కోట్లు కురిపించేందుకు ప్రతీ ఫ్రాంచైజీ పోటీపడింది. ఎలాగైనా దక్కించుకోవాలన్న కసి వేలంపాటలో కనబడింది. అంతర్జాతీయ స్టార్లకు దీటుగా భారత ఆటగాళ్లకూ కళ్లు చెదిరే మొత్తం దక్కింది. అయితే సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించిన క్రిస్ గేల్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. రెండు సార్లు కోల్‌కతాను చాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్‌కు నామమాత్రపు ధరే లభించింది. ఊహించని మొత్తాలతో కొందరు, అన్ సోల్డ్ జాబితాలో ఇంకొందరు ఎలాగోలా... ఐపీఎల్ వేలం ప్రక్రియలో హైలైట్‌గా నిలిచారు. బెంగళూరు: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి ఐపీఎల్ వేలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. గతేడాదిలాగే ఈ ఏడాదీ ఫ్రాంచైజీలన్నీ వేలంలో అతనిపైనే గాలం వేశాయి. మొత్తానికి రూ.12.50 కోట్లతో రాజస్తాన్ వశమయ్యాడు స్టోక్స్. గతేడాది (రూ. 14.50 కోట్లు; పుణే)తో పోలిస్తే 2 కోట్లు తక్కువైనా... అప్పుడు ఇప్పుడు వేలంలో అగ్రస్థానం అతనికే లభించడం విశేషం. స్టోక్స్ కోసం ముందుగా చెన్నై ‘విజిల్ పొడు’అంది. పంజాబ్ వెంటనే కోట్ల పాటకు తెరతీసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ 9.2 కోట్లు)కూడా మాకే కావాలంటూ పది కోట్లదాకా తీసుకొచ్చింది. ఇలా చూస్తుండగానే పంజాబ్ 11 కోట్లు... మరో ఫ్రాంచైజీ 12 కోట్లు... చివరకు రాజస్తాన్ రూ. 12.50 కోట్లంటూ ముగించింది. రాజస్తాన్ యాజమాన్యం రిటెయిన్ చేసుకున్న స్టీవెన్ స్మిత్... స్టోక్స్ కోసం అదేపనిగా పట్టుబట్టడంతో యాజమాన్యం కాదలేకపోయింది. స్మిత్ సారథ్యంలో రెండేళ్లు ఐపీఎల్లో ఉన్న రైజింగ్ పుణే తరఫున స్టోక్స్ విజయవంతం కావడం రాజస్తాన్ మొగ్గుచూపేందుకు కారణమైంది. ధావన్‌తో మొదలైందిలా... బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ వేలం ప్రక్రియ ముందుగా శిఖర్ ధావన్‌తో మొదలైంది. పంజాబ్ అతని కోసం రూ. 2 కోట్లతో పాట పాడగా... రాజస్తాన్ దక్కించుకునేందుకు పోటీ పడింది. ముంబై కూడా శ్రుతికలిపినప్పటికీ చివరకు పంజాబ్ సొంతమయ్యాడు ధావన్. అయితే వెంటనే అతను ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ సన్‌రైజర్స్ ‘రైట్ టు మ్యాచ్’ పాలసీతో ధావన్ (రూ.5.20 కోట్లు)ను తిరిగి పొందింది. గేల్ వైపు కన్నెత్తిచూడలేదు విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు క్రిస్ గేల్. సుడిగాలి మెరుపులతో ఐపీఎల్‌ను ఊపేసిన ఈ వెస్టిండీస్ స్టార్‌పై ఫ్రాంచైజీలన్నీ అనాసక్తి కనబరిచాయి. గతేడాది వైఫల్యం దరిమిలా పూర్తి మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కకపోవడం, ఫామ్‌లేమి... వయసు పైబడటంతో 37 ఏళ్ల గేల్వైపు ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూడలేదు. దీంతో జోరుగా సాగిన వేలంలో రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్ కలిగిన అతను అన్‌సోల్డ్ (విక్రయించబడని) ఆటగాడిగా మిగిలిపోయాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్‌పొలార్డ్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకోగా ముంబై రైట్ టు మ్యాచ్‌తో చేజిక్కించుకుంది. మెరుపులు మెరిపించే మ్యాక్స్‌వెల్ కోసం సన్‌రైజర్స్, రాయల్స్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆర్సీబీ కూడా గళమెత్తినప్పటికీ చివరికి ఢిల్లీ సొంతమయ్యాడు మ్యాక్స్. కోల్‌కతాను రెండు సార్లు విజేతగా నిలిపిన విజయవంతమైన సారథి గౌతమ్ గంభీర్‌ను నామమాత్రమైన ధర (రూ. 2.8 కోట్లు)కే సొంత జట్టు ఢిల్లీ దక్కించుకుంది. యువరాజ్ తిరిగి పంజాబ్ గూటికి చేరాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో అతను పంజాబ్ ఐకాన్ ప్లేయర్. ఇప్పుడు గంభీర్‌లాగే అతనూ సొంతజట్టు పంచన చేరాడు. -
ఇంకా మాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు: గేల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 సీజన్ లో ముందుగానే ఇంటిదారి పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆట తీరుపై అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్. ఈ సీజన్ లో పెద్దగా రాణించని గేల్.. తమ జట్టు వరుసగా మ్యాచ్ లు ఓడిపోతున్నా అభిమానులు మద్దతు తెలుపుతూనే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఈ సీజన్ లో మా ఆట తీరు బాలేదు. అందుకు ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. మేము వరుసగా ఓడిపోతున్నా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అభిమానుల అభిమానం వెలకట్టలేనిది. అసలు ఇంతటి పేలవమైన ఆటను ప్రదర్శించినా ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే'అని గేల్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 13 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 10 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కేవలం రెండు మ్యాచ్ ల్లోనే గెలుపును సొంతం చేసుకోగా, ఒక మ్యాచ్ రద్దయింది. -
క్రిస్ గేల్ గోల్డెన్ డక్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా ఇక్కడ ఆదివారం నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తోజరుగుతున్న మ్యాచ్ లోరాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. కోల్ కతా పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే గేల్ గోల్డెన్ డకౌటయ్యాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఆర్సీబీ తొలి వికెట్ ను నష్టపోయింది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్ లోసైతం గేల్ డకౌటైన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఇప్పటికే నాకౌట్ పోరు నుంచి నిష్ర్కమించిన ఆర్సీబీకి ఇది నామమాత్రపు మ్యాచ్. మరొకవైపు కోల్ కతా విజయం సాధిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. -
గేల్... ద టి20 మాస్టర్!
అతను దిగితే హడల్... అతను కొడితే సిక్సర్... అతను నిలిస్తే విన్నర్... నిజం కాదంటారా??? గేల్ తుది జట్టులో ఉంటే ప్రత్యర్థి హడలిపోద్ది! కొడితే మైదానమే చిన్నబోతుంది! కడదాకా నిలిస్తే తన జట్టు గెలుస్తుంది. సాక్షి క్రీడావిభాగం: ఇదంతా ‘టి20 మాస్టర్’ గేల్ గురించే. లేకపోతే పొట్టి ఫార్మాట్లో ఎవరూ చేయలేని 10 వేల పరుగులు ఎలా సాధ్యమవుతాయి. అతను వెస్టిండీస్ జాతీయ జట్టుకు దూరమైనా... ‘లీగ్’ స్పెషలిస్ట్‌గా మారిపోయాడు... కాదు కాదు ఎదిగిపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున సుడి‘గేల్’ ఇన్నింగ్స్‌లకు కొదవే లేదు. గుజరాత్ లయన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులు చేయగానే 10 వేల మైలురాయితో టి20ల్లో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 38 బంతుల్లో 77 (5 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి బెంగళూరు పరాజయాల పరంపరకు బ్రేకులేశాడు. గుజరాత్ (లయన్స్) సింహాలను పిల్లుల్ని చేశాడు. పైగా బెంగళూరు 213/2 స్కోరుతో ఈ సీజన్లో అత్యధిక జట్టు స్కోరును కూడా నమోదు చేసింది ఈ విధ్వంసకారుడి వల్లే! విధ్వంసంలో విలువైనవి... ∙10,074 పరుగులు, 743 సిక్సర్లు, 18 సెంచరీలు. ∙గేల్ పరుగుల్లో బౌండరీల ద్వారానే 74.8 శాతం పరుగులు వచ్చా యి. ∙టి20 క్రికెట్లో 18 జట్లకు (వెస్టిండీస్, బరిసాల్ బుల్స్, చిట్టగాంగ్ వికింగ్స్, ఢాకా గ్లాడియేటర్స్, జమైకా, జమైకా తల్లవాస్, కరాచీ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లాహోర్ కలందర్స్, లయన్స్, మతబెలెలాండ్ టస్కర్స్, మెల్బోర్న్ రెనెగెడ్స్, పీసీఏ ఎలెవన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సోమర్సెట్, స్టాన్ఫోర్డ్ సూపర్‌స్టార్స్, సిడ్నీ థండర్, వెస్టర్న్ ఆస్ట్రేలియా) ప్రాతినిధ్యం ∙18 సెంచరీల్లో 15 సెంచరీలు (2011–15)ఐదేళ్లలో వచ్చాయి. అప్పుడు గంగ్నమ్... ఇపుడు ‘సాల్ట్ బే’ అప్పట్లో మైదానంలో గంగ్నమ్ స్టయిల్‌ను పరిచయం చేసిన గేల్ తాజాగా ‘సాల్ట్ బే’ పోజు పెట్టాడు. గుజరాత్‌పై అర్ధసెంచరీ పూర్తి కాగానే పిచ్‌పై ఒంటికాలుపై కూర్చొని కుడి చేతిని జిరాఫీ మెడలా వంచి ఉప్పుచల్లే పోజే ‘సాల్ట్ బే’. ఈ పోజుకు టర్కీ కుక్ నుస్రత్ గుచి ఫేమస్. ఈ వంటగాడు తాను వండిన ఏదైనా వంటకం పూర్తికాగానే ‘సాల్ట్ బే’ పోజుతో ఉప్పు చల్లుతాడు. ఇది తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గేల్ కంటే ముందు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అర్సెనల్ ఆటగాడు డానీ వెల్బెక్ గోల్ చేయగానే ఈ పోజుతో అలరించాడు. తర్వాత జర్మన్ బుండెస్‌లీగాలో హకన్ కాలహనోగ్లూ, ఒమర్ తొప్రక్లు ‘సాల్ట్ బే’ పోజు పెట్టారు. 10వేల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనతకు తోడ్పడిన వారందరికి థ్యాంక్స్. ముఖ్యంగా నా షాట్లకు జేజేలు పలికిన అభిమానులకు.! వెన్నంటి నిలిచిన సహచరులకు, జట్టులో స్థానమిచ్చిన ఫ్రాంచైజీ యజమానులకు కృతజ్ఞతలు. నేను ప్రపంచ వ్యాప్తంగా జరిగిన లీగ్‌లన్నీ ఆడుతున్నా. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చి... ప్రోత్సహించిన వారెవరినీ మరచిపోలేను. ఇక ముందు కూడా ఇలాగే అభిమానుల్ని అలరిస్తాను – గేల్ -
మూడు పరుగుల దూరంలో గేల్..
రాజ్‌కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అతి కొద్ది దూరంలో ఉన్నాడు. ఇంకా మూడు పరుగులు చేస్తే ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో పది వేల పరుగులను సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు గేల్. ఈ ఐపీఎల్ కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్.. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల్లో పేలవమైన ఆటకే పరిమితమయ్యాడు. ఈ ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్ ల్లోనే గేల్ ఆ రికార్డును సాధిస్తాడని భావించినా అది జరగలేదు. ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు ఆడి 60 పరుగులు మాత్రమే చేశాడు. సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 32 పరుగులు చేసిన గేల్.. ఆపై ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేశాడు. ఆ తరువాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో 22 పరుగులు మాత్రమే చేశాడు. మరో రెండు మ్యాచ్ లకు గేల్ దూరమయ్యాడు. దాంతో ఈ రికార్డు కోసం అతనికి నిరీక్షణ తప్పడం లేదు. ఈ క్రమంలోనే గుజరాత్ తో జరిగే మ్యాచ్ కు గేల్ దాదాపు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతని స్థానాన్ని గేల్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ లో గేల్ కు అవకాశం దక్కి కొత్త చరిత్రను సృష్టిస్తాడేమో చూడాలి. మంగళవారం రాత్రి గం.8.00 ని.లకు గుజరాత్ తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైనదే. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంటే, గుజరాత్ ఏడో స్థానంలో ఉంది. -
క్రిస్ గేల్ అవుట్
ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ ను తప్పించారు. గత రెండు మ్యాచ్ ల్లో గేల్ నిరాశపరచడంతో ఈ జమైకా స్టార్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్-10 సీజన్ లో ఏబీకి ఇదే తొలి మ్యాచ్. గాయం కారణంగా గడిచిన మ్యాచ్ ల్లో ఏబీ డివిలియర్స్ పాల్గొనలేదు. అయితే డివిలియర్స్ అందుబాటులోకి వచ్చినా ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ గా షేన్ వాట్సనే కొనసాగనున్నాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ రెండు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. ఒకదాంట్లో ఓడగా, మరొక మ్యాచ్ లో గెలిచింది. మరొకవైపు ఆడిన తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణి కొట్టిన కింగ్స్ పంజాబ్ రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆర్సీబీ తుది జట్టు: షేన్ వాట్సన్(కెప్టెన్), విష్ణు వినోద్, ఏబీ డివిలియర్స్, కేదర్ జాదవ్, మన్ దీప్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగీ, ఇక్బాల్ అబ్దుల్లా, తైవాల్ మిల్స్, స్టాన్ లేక్, చాహల్ కింగ్స్ తుది జట్టు: గ్లెన్ మ్యాక్స్ వెల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హషీమ్ ఆమ్లా, వోహ్రా, సాహా, స్టోనిస్,అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ, వరుణ్ అరోన్, నటరాజన్ -
విధ్వంసమే విస్తుపోయేలా..
మళ్లీ ‘శత’క్కొట్టిన కోహ్లి ► 50 బంతుల్లో 113 పరుగులు ► 12 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత ► సీజన్లో నాలుగో సెంచరీతో మరో ఘనత ► హడలెత్తించిన క్రిస్‌గేల్ ► పంజాబ్‌పై బెంగళూరు ఘనవిజయం ► ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్లుగా... మధ్యాహ్నం పూట నిద్రలో కలగంటున్నట్లుగా... ముందే షాట్లన్నీ ఫీడ్ చేసిన ఒక మెషీన్ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా... మరోసారి కోహ్లి రెచ్చిపోయాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఐపీఎల్లో సంచలన ఇన్నింగ్స్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న విరాట్ కోహ్లి... ఈసారి పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. చేతికి గాయం ఉన్నా లెక్క చేయకుండా... అంపైర్లకు చేతులు నొప్పుట్టేలా, బౌలర్లకు తల తిరిగేలా... కోహ్లి ఒక్కో షాట్ కొడుతుంటే... చిన్నస్వామి బౌండరీ మరింత చిన్నబోయింది. విరాట్ విధ్వంసానికి గేల్ ప్రకంపనలు తోడవడంతో... పరుగుల సునామీలో పంజాబ్ జట్టు తుడిచిపెట్టుకుపోయింది. బెంగళూరు: పాపం... ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు..? వచ్చానా, ఆరు బంతులు వేశానా.. వెళ్లానా..? పోనీలే నన్ను నాలుగు ఫోర్లే కొట్టారు... పక్క బౌలర్‌ని మూడు సిక్సర్లు బాదారు... ఇలా సంబర పడటం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితికి బౌలర్లు చేరారు. కొడితే ఫోర్, లేదంటే సిక్సర్... ఎంత మంచి బంతి వేసినా, ఫీల్డర్ చూస్తూ ఉండిపోవడం తప్ప బంతిని ఆపలేని నిస్సహాయత.... బుధవారం కోహ్లి ఇన్నింగ్స్‌ను చూడలేని వాళ్లు దురదృష్టవంతులే అనుకోవాలి. కోహ్లి (50 బంతుల్లో 113; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత సెంచరీకి... క్రిస్ గేల్ (32 బంతుల్లో 73; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో... పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) విజయం సాధించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు మూడు వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. గేల్, కోహ్లి తొలి వికెట్‌కు కేవలం 66 బంతుల్లో 147 పరుగులు జోడించడం విశేషం. తర్వాత పంజాబ్ 14 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఈ దశలో మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికి పంజాబ్ చివరి ఓవర్లో విజయానికి 92 పరుగులు చేయాలి. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బెంగళూరు 82 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఒకరిని మించి మరొకరు..: బెంగ ళూరు ఓపెనర్లు కోహ్లి, గేల్ ఆరంభం నుంచే పోటాపోటీగా చెలరేగారు. నాలుగో ఓవర్లో గేల్ వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్‌తో జాతర మొదలుపెడితే... దానిని కోహ్లి అందిపుచ్చుకున్నాడు. 28 బంతుల్లో విరాట్ అర్ధసెంచరీ చేస్తే... గేల్ 26 బంతుల్లో ఈ మార్కును చేరాడు. ఈ బౌలర్, ఆ బౌలర్ అనే తేడా లేకుండా ఇద్దరూ పోటాపోటీగా సిక్సర్లు బాదారు. అక్షర్ బౌలింగ్‌లో గేల్ అవుట్ కావడం, తర్వాతి ఓవర్లో డివిలియర్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో పంజాబ్ కాస్త సంబరపడ్డా... అక్కడి నుంచి కోహ్లి గేర్ మార్చి మరింత వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరులో మరో సిక్సర్, ఫోర్ కొట్టి అవుటయ్యాడు. చివరి ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు కొట్టాడు. పెవిలియన్‌కు క్యూ: భారీ లక్ష్యాన్ని ఛేదించే ఒత్తిడిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ పోరాడలేకపోయారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ విజయ్ అవుటయ్యాక.... ఏ బ్యాట్స్‌మన్ కూడా కుదురుగా ఆడలేకపోయాడు. సాహా (10 బంతుల్లో 24; 5 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో విజయాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 73; కోహ్లి (సి) మిల్లర్ (బి) సందీప్ 113; డివిలియర్స్ (బి) అబాట్ 0; రాహుల్ నాటౌట్ 16; వాట్సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (15 ఓవర్లలో మూడు వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1-147; 2-154; 3-199. బౌలింగ్: సందీప్ శర్మ 3-0-29-1; మోహిత్ శర్మ 3-0-33-0; అబాట్ 3-0-48-1; కరియప్ప 3-0-55-0; అక్షర్ పటేల్ 3-0-46-1. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: విజయ్ (బి) అరవింద్ 16; ఆమ్లా (సి) జోర్డాన్ (బి) అరవింద్ 9; సాహా ఎల్బీడబ్ల్యు (బి) చాహల్ 24; మిల్లర్ (సి) డివిలియర్స్ (బి) వాట్సన్ 3; గురుకీరత్ (సి) గేల్ (బి) చాహల్ 18; అక్షర్ పటేల్ (సి) కోహ్లి (బి) వాట్సన్ 13; బెహర్డీన్ (సి) డివిలియర్స్ (బి) చాహల్ 0; అబాట్ (సి) డివిలియర్స్ (బి) చాహల్ 0; మోహిత్ రనౌట్ 14; కరియప్ప నాటౌట్ 12; సందీప్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1-17; 2-43; 3-53; 4-54; 5-77; 6-79; 7-80; 8-96; 9-105. బౌలింగ్: బిన్నీ 1-0-11-0; శ్రీనాథ్ అరవింద్ 2-0-18-2; జోర్డాన్ 1-0-12-0; చాహల్ 3-0-25-4; వాట్సన్ 2-0-7-2; ఆరోన్ 1-0-17-0; గేల్ 3-0-25-0; సచిన్ బేబీ 1-0-4-0. ► ఈ సీజన్ ఐపీఎల్లో కోహ్లికి ఇది 4వ సెంచరీ. ఒకే సీజన్లో కనీసం మూడు సెంచరీలు చేసిన మరో క్రికెటర్ లేడు. ► మామూలుగా 20 ఓవర్లలో 200 కొట్టడమే గొప్ప. కానీ ఈ మ్యాచ్‌లో బెంగళూరు 15 ఓవర్లలోనే 211 బాదింది. ► ఈ మ్యాచ్‌తో కోహ్లి ఐపీఎల్లో 4 వేల పరుగులు (4002) చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ► ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు సెంచరీలు నమోదయ్యాయి. గతంలో 2008, 2011, 2012లలో అత్యధికంగా ఆరు చొప్పున సెంచరీలు నమోదయ్యాయి. గాయంతోనే... గత మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య కోహ్లికి గాయమైంది. దీనికి 7 కుట్లు పడ్డాయి. మామూలుగా అయితే ఓ నెలరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన గాయం ఇది. కానీ జట్టు చావోరేవో తేల్చుకోవాల్సినందున కోహ్లి బరిలోకి దిగి... సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అక్షర్ పటేల్ క్యాచ్ పట్టినప్పుడు ఆ కుట్ల మీద మళ్లీ బంతి తగిలింది. బాధతో విలవిల్లాడినా... జట్టు విజయం ముందు ఆ బాధ తేలిపోయింది. -
12 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేసిన క్రిస్ గేల్
డాక్లాండ్స్: వెస్ట్ ఇండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఆడిలైడ్ స్ట్రైకర్స్‌తో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆడిలైడ్ టీం 170 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మెల్బోర్న్ టీం ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ క్రిస్ గేల్ తొలి ఓవర్లోనే 4 సిక్సర్లు కొట్టడంతో 27 పరుగులు చేసింది. ఈ క్రమంలో క్రిస్ గేల్ ఏడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 17 బంతులు ఆడిన గేల్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే గేల్ చెలరేగినా మెల్బోర్న్ రెనిగేడ్స్ మాత్రం గెలవలేక పోయింది. 15.3 ఓవర్లలోనే 143 పరుగులు చేసి ఆలౌటయింది.