న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ ఇద్దరూ కలిసి చెరో రెండు మ్యాచ్‌లను గెలిపించినా ఫ్రాంచైజీకి న్యాయం చేసినట్టేనని ఆ జట్టు కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను రెండోసారి జరిగిన వేలంలోనూ ఏ ఫాంచైజీ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. వీరిని రూ.2 కోట్ల చొప్పున పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది.
ఓపెనర్‌గా యువీ సేవలు..
‘దిగ్గజ ఆటగాళ్లు గేల్, యువరాజ్‌లు తక్కువ ధరకే మా సొంతం అయ్యారు. వారిద్దరూ మ్యాచ్ విన్నర్లు. వాళ్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిపించినా.. వాళ్లపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసినట్టే’నని సెహ్వాగ్ అన్నారు. ‘ఓపెనర్‌గా యువీని కొన్ని మ్యాచుల్లో వినియోగించుకుంటాం. అయితే ఆరోన్ ఫించ్, మయాంక్ అగర్వాల్ తరహాలో క్రిస్ గేల్ ప్రారంభంలో ఆటలోకి దిగి ఎక్కువ సేపు వికెట్ కాపాడుకోలేడు.
ఆరోన్ ఫించ్ వివాహం సందర్భంగా తొలి మ్యాచ్‌లో అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో గేల్ ఓపెనింగ్‌కు పంపిస్తాం. అయితే, అతను నిలకడ ఆడాల్సిన అవసరముంది’ అని సెహ్వాగ్ పేర్కొన్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించి నాణ్యమైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నామనీ.. వారంతా మంచి ప్రతిభతో ఆడితే ఈ సారి ఐపీఎల్ విజేతగా పంజాబ్ జట్టు నిలుస్తుందని ఈ మాజీ ఓపెనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రోఫీని చేజిక్కించుకోవాలంటే వాళ్ల ప్రదర్శన కీలకం..
గత సీజన్లలో పంజాబ్ జట్టులో భారత్ ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉండేదనీ, కానీ ఈసారి రవించంద్రన్ అశ్విన్ నేతృత్వంలో యువ తరంగాలు.. అక్షర్ పటేల్, కరణ్ నాయర్, కేఎల్ రాహుల్, బరీందర్ శరన్, మోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్‌పుత్ ఉన్నారని సెహ్వాగ్ వెల్లడించారు.‘గత కొన్నేళ్లుగా వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ మినహా మిగతా భారత ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ట్రోఫీని చేజిక్కించుకోవాలంటే భారత ఆటగాళ్ల ప్రదర్శన కీలకం.
ఈ సారి మా తుది జట్టులో 4 నుంచి 5 మంది భారత ఆటగాళ్లుంటార’ని ఆయన తెలిపారు. జట్టుకు కెప్టెన్‌గా బౌలర్ ఉండడం అదనపు బలమని అన్నారు. అశ్విన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను జట్టును ముందుండి నడిపిస్తాడని ఆకాక్షించారు. చివరి ఓవర్లో ప్రత్యర్థి జట్టుకు 10, 15 పరుగులు అవసరమైనప్పుడు బౌలర్ కెప్టెన్‌గా ఉన్న జట్టుకే విజయావకాశాలు ఎక్కువని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment