మూడు పరుగుల దూరంలో గేల్..
రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అతి కొద్ది దూరంలో ఉన్నాడు. ఇంకా మూడు పరుగులు చేస్తే ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో పది వేల పరుగులను సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు గేల్. ఈ ఐపీఎల్ కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్.. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల్లో పేలవమైన ఆటకే పరిమితమయ్యాడు.
ఈ ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్ ల్లోనే గేల్ ఆ రికార్డును సాధిస్తాడని భావించినా అది జరగలేదు. ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు ఆడి 60 పరుగులు మాత్రమే చేశాడు. సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 32 పరుగులు చేసిన గేల్.. ఆపై ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేశాడు. ఆ తరువాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో 22 పరుగులు మాత్రమే చేశాడు. మరో రెండు మ్యాచ్ లకు గేల్ దూరమయ్యాడు. దాంతో ఈ రికార్డు కోసం అతనికి నిరీక్షణ తప్పడం లేదు.
ఈ క్రమంలోనే గుజరాత్ తో జరిగే మ్యాచ్ కు గేల్ దాదాపు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కు ఏబీ డివిలియర్స్ దూరం కావడంతో అతని స్థానాన్ని గేల్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ లో గేల్ కు అవకాశం దక్కి కొత్త చరిత్రను సృష్టిస్తాడేమో చూడాలి. మంగళవారం రాత్రి గం.8.00 ని.లకు గుజరాత్ తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైనదే. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంటే, గుజరాత్ ఏడో స్థానంలో ఉంది.