ఐపీఎల్-10లో సీన్ రివర్స్
హైదరాబాద్: ఐపీఎల్-10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ విఫలమయ్యాయి. ఈ రెండు జట్లకు ‘ప్లే–ఆఫ్’ కు దారులు మూసుకుపోయాయి. గత సీజన్‌లో లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు టీమ్‌లు ఈ ఎడిషన్‌లో చతికిలపడ్డాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 5 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.
ఇప్పటివరకు 10 ఆడిన కోహ్లి సేన కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడింది. వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. 6 పాయింట్లతో గుజరాత్ లయన్స్ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన రైనా టీమ్ కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. 8 మ్యాచుల్లో పరాజయం పాలైంది.
ఈ రెండు జట్లు మరో మూడేసి లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సివుంది. మిగతా మ్యాచుల్లో గెలిచినా ప్లే–ఆఫ్ కు అవకాశం లేదు. ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా అవకాశాలున్నాయి. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ దాదాపుగా ప్లే–ఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. బెంగళూరు, గుజరాత్ మినహా అన్ని జట్లకు ప్లే–ఆఫ్ లో నిలవడంతో మిగతా మ్యాచ్‌లు రసవత్తరంగా సాగనున్నాయి.