ఆర్సీబీ 'ఆట' మారలేదు..!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో మరోసారి చేతులేత్తేసింది. గురువారం గుజరాత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లును చేజార్చుకుండా స్వల్ప స్కోరుకే పరిమితమైంది విరాట్ సేన. ఏడుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో బెంగళూరు 135 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కేదర్ జాదవ్(31), పవన్ నేగీ(32)లే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. మరొకవైపు గుజరాత్ లయన్స్ బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ రాణించి ఆర్సీబీని కట్టడి చేసింది. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు రెండు,తంపి, సోని,ఫాల్కనర్ లకు తలో వికెట్ దక్కింది.
ఓపెనర్లు విఫలంతోనే పతనం..
గత గుజరాత్ మ్యాచ్ లో విరుచుకుపడిన ఆర్సీబీ.. ఈసారి మాత్రం ఆ జోరు కొనసాగించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రోజు మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఓపెనర్లు క్రిస్ గేల్, కోహ్లిలు తమ శైలికి భిన్నంగా ఆచితూచి బ్యాటింగ్ ఆరంభించారు. ఎటువంటి దూకుడుకు పోకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను తీసుకెళ్లే యత్నం చేశారు. అయితే ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ లో విరాట్ కోహ్లి ఓ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.
ఆ తరువాత ఓవర్ రెండో బంతికి గేల్ కూడా అవుటయ్యాడు. దాంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. ఆ తరువాత అదే పరుగు వద్ద ట్రావిస్ హెడ్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరుణంలో జాదవ్-డివిలియర్స్ లు స్కోరు బోర్డుకు మరమ్మత్తులు చేపట్టారు. అయితే అనవసర పరుగుకోసం యత్నించి డివిలియర్స్ అవుటయ్యాడు. ఆ తరువాత జాదవ్ దూకుడుగా ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక మధ్యలో పవన్ నేగీ తో పాటు చివర్లో అంకిత్ చౌదరి(15 నాటౌట్) కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌటైంది. కోల్ కతా తో మ్యాచ్ లో 49 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ.. కీలకమైన నేటి మ్యాచ్ లో కూడా రాణించకపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.