విధ్వంసమే విస్తుపోయేలా.. | bengaluru puts heavy target to punjab | Sakshi
Sakshi News home page

విధ్వంసమే విస్తుపోయేలా..

Published Thu, May 19 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

విధ్వంసమే విస్తుపోయేలా..

విధ్వంసమే విస్తుపోయేలా..

మళ్లీ ‘శత’క్కొట్టిన కోహ్లి
50 బంతుల్లో 113 పరుగులు
12 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత
సీజన్‌లో నాలుగో సెంచరీతో మరో ఘనత
హడలెత్తించిన క్రిస్‌గేల్
పంజాబ్‌పై బెంగళూరు ఘనవిజయం
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

 
 
ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్లుగా... మధ్యాహ్నం పూట నిద్రలో కలగంటున్నట్లుగా... ముందే షాట్లన్నీ ఫీడ్ చేసిన ఒక మెషీన్ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా... మరోసారి కోహ్లి రెచ్చిపోయాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఐపీఎల్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న విరాట్ కోహ్లి... ఈసారి పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. చేతికి గాయం ఉన్నా లెక్క చేయకుండా... అంపైర్లకు చేతులు నొప్పుట్టేలా, బౌలర్లకు తల తిరిగేలా... కోహ్లి ఒక్కో షాట్ కొడుతుంటే... చిన్నస్వామి బౌండరీ మరింత చిన్నబోయింది. విరాట్ విధ్వంసానికి గేల్ ప్రకంపనలు తోడవడంతో... పరుగుల సునామీలో పంజాబ్ జట్టు తుడిచిపెట్టుకుపోయింది.
 
 
బెంగళూరు: పాపం... ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు..? వచ్చానా, ఆరు బంతులు వేశానా.. వెళ్లానా..? పోనీలే నన్ను నాలుగు ఫోర్లే కొట్టారు... పక్క బౌలర్‌ని మూడు సిక్సర్లు బాదారు... ఇలా సంబర పడటం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితికి బౌలర్లు చేరారు. కొడితే ఫోర్, లేదంటే సిక్సర్... ఎంత మంచి బంతి వేసినా, ఫీల్డర్ చూస్తూ ఉండిపోవడం తప్ప బంతిని ఆపలేని నిస్సహాయత.... బుధవారం కోహ్లి ఇన్నింగ్స్‌ను చూడలేని వాళ్లు దురదృష్టవంతులే అనుకోవాలి. కోహ్లి (50 బంతుల్లో 113; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత సెంచరీకి... క్రిస్ గేల్ (32 బంతుల్లో 73; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో... పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) విజయం సాధించింది.


వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు మూడు వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. గేల్, కోహ్లి తొలి వికెట్‌కు కేవలం 66 బంతుల్లో 147 పరుగులు జోడించడం విశేషం. తర్వాత పంజాబ్ 14 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఈ దశలో మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికి పంజాబ్ చివరి ఓవర్లో విజయానికి 92 పరుగులు చేయాలి. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బెంగళూరు 82 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

ఒకరిని మించి మరొకరు..: బెంగ ళూరు ఓపెనర్లు కోహ్లి, గేల్ ఆరంభం నుంచే పోటాపోటీగా చెలరేగారు. నాలుగో ఓవర్లో గేల్ వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్‌తో జాతర మొదలుపెడితే... దానిని కోహ్లి అందిపుచ్చుకున్నాడు. 28 బంతుల్లో విరాట్ అర్ధసెంచరీ చేస్తే... గేల్ 26 బంతుల్లో ఈ మార్కును చేరాడు. ఈ బౌలర్, ఆ బౌలర్ అనే తేడా లేకుండా ఇద్దరూ పోటాపోటీగా సిక్సర్లు బాదారు.  అక్షర్ బౌలింగ్‌లో గేల్ అవుట్ కావడం, తర్వాతి ఓవర్లో డివిలియర్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో పంజాబ్ కాస్త సంబరపడ్డా... అక్కడి నుంచి కోహ్లి గేర్ మార్చి మరింత వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరులో మరో సిక్సర్, ఫోర్ కొట్టి అవుటయ్యాడు. చివరి ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు కొట్టాడు.


 పెవిలియన్‌కు క్యూ: భారీ లక్ష్యాన్ని ఛేదించే ఒత్తిడిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ పోరాడలేకపోయారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ విజయ్ అవుటయ్యాక.... ఏ బ్యాట్స్‌మన్ కూడా కుదురుగా ఆడలేకపోయాడు. సాహా (10 బంతుల్లో 24; 5 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో విజయాన్ని పూర్తి చేశారు.

 స్కోరు వివరాలు: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 73; కోహ్లి (సి) మిల్లర్ (బి) సందీప్ 113; డివిలియర్స్ (బి) అబాట్ 0; రాహుల్ నాటౌట్ 16; వాట్సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (15 ఓవర్లలో మూడు వికెట్లకు) 211.

 వికెట్ల పతనం: 1-147; 2-154; 3-199.
 బౌలింగ్: సందీప్ శర్మ 3-0-29-1; మోహిత్ శర్మ 3-0-33-0; అబాట్ 3-0-48-1; కరియప్ప 3-0-55-0; అక్షర్ పటేల్ 3-0-46-1.

 పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: విజయ్ (బి) అరవింద్ 16; ఆమ్లా (సి) జోర్డాన్ (బి) అరవింద్ 9; సాహా ఎల్బీడబ్ల్యు (బి) చాహల్ 24; మిల్లర్ (సి) డివిలియర్స్ (బి) వాట్సన్ 3; గురుకీరత్ (సి) గేల్ (బి) చాహల్ 18; అక్షర్ పటేల్ (సి) కోహ్లి (బి) వాట్సన్ 13; బెహర్డీన్ (సి) డివిలియర్స్ (బి) చాహల్ 0; అబాట్ (సి) డివిలియర్స్ (బి) చాహల్ 0; మోహిత్ రనౌట్ 14; కరియప్ప నాటౌట్ 12; సందీప్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 120.

వికెట్ల పతనం: 1-17; 2-43; 3-53; 4-54; 5-77; 6-79; 7-80; 8-96; 9-105.     బౌలింగ్: బిన్నీ 1-0-11-0; శ్రీనాథ్ అరవింద్ 2-0-18-2; జోర్డాన్ 1-0-12-0; చాహల్ 3-0-25-4; వాట్సన్ 2-0-7-2; ఆరోన్ 1-0-17-0; గేల్ 3-0-25-0; సచిన్ బేబీ 1-0-4-0.
 
ఈ సీజన్ ఐపీఎల్‌లో కోహ్లికి ఇది 4వ సెంచరీ. ఒకే సీజన్‌లో కనీసం మూడు సెంచరీలు చేసిన మరో క్రికెటర్ లేడు.
మామూలుగా 20 ఓవర్లలో 200 కొట్టడమే గొప్ప. కానీ ఈ మ్యాచ్‌లో బెంగళూరు 15 ఓవర్లలోనే 211 బాదింది.
ఈ మ్యాచ్‌తో కోహ్లి ఐపీఎల్‌లో 4 వేల పరుగులు (4002) చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ప్రస్తుత ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఏడు సెంచరీలు నమోదయ్యాయి. గతంలో 2008, 2011, 2012లలో అత్యధికంగా ఆరు చొప్పున సెంచరీలు నమోదయ్యాయి.
 
 గాయంతోనే...



గత మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య కోహ్లికి గాయమైంది. దీనికి 7 కుట్లు పడ్డాయి. మామూలుగా అయితే ఓ నెలరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన గాయం ఇది. కానీ జట్టు చావోరేవో తేల్చుకోవాల్సినందున కోహ్లి బరిలోకి దిగి... సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అక్షర్ పటేల్ క్యాచ్ పట్టినప్పుడు ఆ కుట్ల మీద మళ్లీ బంతి తగిలింది. బాధతో విలవిల్లాడినా... జట్టు విజయం ముందు ఆ బాధ తేలిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement