గేల్... ద టి20 మాస్టర్!
అతను దిగితే హడల్... అతను కొడితే సిక్సర్... అతను నిలిస్తే విన్నర్... నిజం కాదంటారా??? గేల్ తుది జట్టులో ఉంటే ప్రత్యర్థి హడలిపోద్ది! కొడితే మైదానమే చిన్నబోతుంది! కడదాకా నిలిస్తే తన జట్టు గెలుస్తుంది.
సాక్షి క్రీడావిభాగం: ఇదంతా ‘టి20 మాస్టర్’ గేల్ గురించే. లేకపోతే పొట్టి ఫార్మాట్‌లో ఎవరూ చేయలేని 10 వేల పరుగులు ఎలా సాధ్యమవుతాయి. అతను వెస్టిండీస్ జాతీయ జట్టుకు దూరమైనా... ‘లీగ్’ స్పెషలిస్ట్‌గా మారిపోయాడు... కాదు కాదు ఎదిగిపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున సుడి‘గేల్’ ఇన్నింగ్స్‌లకు కొదవే లేదు. గుజరాత్ లయన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులు చేయగానే 10 వేల మైలురాయితో టి20ల్లో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 38 బంతుల్లో 77 (5 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసి బెంగళూరు పరాజయాల పరంపరకు బ్రేకులేశాడు. గుజరాత్ (లయన్స్) సింహాలను పిల్లుల్ని చేశాడు. పైగా బెంగళూరు 213/2 స్కోరుతో ఈ సీజన్‌లో అత్యధిక జట్టు స్కోరును కూడా నమోదు చేసింది ఈ విధ్వంసకారుడి వల్లే!
విధ్వంసంలో విలువైనవి...
∙10,074 పరుగులు, 743 సిక్సర్లు, 18 సెంచరీలు. ∙గేల్ పరుగుల్లో బౌండరీల ద్వారానే 74.8 శాతం పరుగులు వచ్చా యి. ∙టి20 క్రికెట్‌లో 18 జట్లకు (వెస్టిండీస్, బరిసాల్ బుల్స్, చిట్టగాంగ్ వికింగ్స్, ఢాకా గ్లాడియేటర్స్, జమైకా, జమైకా తల్లవాస్, కరాచీ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లాహోర్ కలందర్స్, లయన్స్, మతబెలెలాండ్ టస్కర్స్, మెల్‌బోర్న్ రెనెగెడ్స్, పీసీఏ ఎలెవన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సోమర్‌సెట్, స్టాన్‌ఫోర్డ్ సూపర్‌స్టార్స్, సిడ్నీ థండర్, వెస్టర్న్ ఆస్ట్రేలియా) ప్రాతినిధ్యం ∙18 సెంచరీల్లో 15 సెంచరీలు (2011–15)ఐదేళ్లలో వచ్చాయి.
అప్పుడు గంగ్నమ్... ఇపుడు ‘సాల్ట్ బే’
అప్పట్లో మైదానంలో గంగ్నమ్ స్టయిల్‌ను పరిచయం చేసిన గేల్ తాజాగా ‘సాల్ట్ బే’ పోజు పెట్టాడు. గుజరాత్‌పై అర్ధసెంచరీ పూర్తి కాగానే పిచ్‌పై ఒంటికాలుపై కూర్చొని కుడి చేతిని జిరాఫీ మెడలా వంచి ఉప్పుచల్లే పోజే ‘సాల్ట్ బే’. ఈ పోజుకు టర్కీ కుక్ నుస్రత్ గుచి ఫేమస్. ఈ వంటగాడు తాను వండిన ఏదైనా వంటకం పూర్తికాగానే ‘సాల్ట్ బే’ పోజుతో ఉప్పు చల్లుతాడు. ఇది తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గేల్ కంటే ముందు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అర్సెనల్ ఆటగాడు డానీ వెల్‌బెక్ గోల్ చేయగానే ఈ పోజుతో అలరించాడు. తర్వాత జర్మన్ బుండెస్‌లీగాలో హకన్ కాలహనోగ్లూ, ఒమర్ తొప్రక్‌లు ‘సాల్ట్ బే’ పోజు పెట్టారు.
10వేల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనతకు తోడ్పడిన వారందరికి థ్యాంక్స్. ముఖ్యంగా నా షాట్లకు జేజేలు పలికిన అభిమానులకు.! వెన్నంటి నిలిచిన సహచరులకు, జట్టులో స్థానమిచ్చిన ఫ్రాంచైజీ యజమానులకు కృతజ్ఞతలు. నేను ప్రపంచ వ్యాప్తంగా జరిగిన లీగ్‌లన్నీ ఆడుతున్నా. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చి... ప్రోత్సహించిన వారెవరినీ మరచిపోలేను. ఇక ముందు కూడా ఇలాగే అభిమానుల్ని అలరిస్తాను
– గేల్