రాయుడు,రషీద్ ఖాన్
ఐపీఎల్ ‘బ్రాండ్’ బాజా ఈ వేలంలోనూ మోగింది. నచ్చిన ఆటగాడిపై కోట్లు కురిపించేందుకు ప్రతీ ఫ్రాంచైజీ పోటీపడింది. ఎలాగైనా దక్కించుకోవాలన్న కసి వేలంపాటలో కనబడింది. అంతర్జాతీయ స్టార్లకు దీటుగా భారత ఆటగాళ్లకూ కళ్లు చెదిరే మొత్తం దక్కింది. అయితే సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అలరించిన క్రిస్ గేల్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. రెండు సార్లు కోల్‌కతాను చాంపియన్‌గా నిలబెట్టిన గంభీర్‌కు నామమాత్రపు ధరే లభించింది. ఊహించని మొత్తాలతో కొందరు, అన్ సోల్డ్ జాబితాలో ఇంకొందరు ఎలాగోలా... ఐపీఎల్ వేలం ప్రక్రియలో హైలైట్‌గా నిలిచారు.
బెంగళూరు: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి ఐపీఎల్ వేలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. గతేడాదిలాగే ఈ ఏడాదీ ఫ్రాంచైజీలన్నీ వేలంలో అతనిపైనే గాలం వేశాయి. మొత్తానికి రూ.12.50 కోట్లతో రాజస్తాన్ వశమయ్యాడు స్టోక్స్. గతేడాది (రూ. 14.50 కోట్లు; పుణే)తో పోలిస్తే 2 కోట్లు తక్కువైనా... అప్పుడు ఇప్పుడు వేలంలో అగ్రస్థానం అతనికే లభించడం విశేషం. స్టోక్స్ కోసం ముందుగా చెన్నై ‘విజిల్ పొడు’అంది. పంజాబ్ వెంటనే కోట్ల పాటకు తెరతీసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ 9.2 కోట్లు)కూడా మాకే కావాలంటూ పది కోట్లదాకా తీసుకొచ్చింది. ఇలా చూస్తుండగానే పంజాబ్ 11 కోట్లు... మరో ఫ్రాంచైజీ 12 కోట్లు... చివరకు రాజస్తాన్ రూ. 12.50 కోట్లంటూ ముగించింది. రాజస్తాన్ యాజమాన్యం రిటెయిన్ చేసుకున్న స్టీవెన్ స్మిత్... స్టోక్స్ కోసం అదేపనిగా పట్టుబట్టడంతో యాజమాన్యం కాదలేకపోయింది. స్మిత్ సారథ్యంలో రెండేళ్లు ఐపీఎల్‌లో ఉన్న రైజింగ్ పుణే తరఫున స్టోక్స్ విజయవంతం కావడం రాజస్తాన్ మొగ్గుచూపేందుకు కారణమైంది.
ధావన్‌తో మొదలైందిలా...
బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ వేలం ప్రక్రియ ముందుగా శిఖర్ ధావన్‌తో మొదలైంది. పంజాబ్ అతని కోసం రూ. 2 కోట్లతో పాట పాడగా... రాజస్తాన్ దక్కించుకునేందుకు పోటీ పడింది. ముంబై కూడా శ్రుతికలిపినప్పటికీ చివరకు పంజాబ్ సొంతమయ్యాడు ధావన్. అయితే వెంటనే అతను ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ సన్‌రైజర్స్ ‘రైట్ టు మ్యాచ్’ పాలసీతో ధావన్ (రూ.5.20 కోట్లు)ను తిరిగి పొందింది.
గేల్ వైపు కన్నెత్తిచూడలేదు
విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు క్రిస్ గేల్. సుడిగాలి మెరుపులతో ఐపీఎల్‌ను ఊపేసిన ఈ వెస్టిండీస్ స్టార్‌పై ఫ్రాంచైజీలన్నీ అనాసక్తి కనబరిచాయి. గతేడాది వైఫల్యం దరిమిలా పూర్తి మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కకపోవడం, ఫామ్‌లేమి... వయసు పైబడటంతో 37 ఏళ్ల గేల్‌వైపు ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూడలేదు. దీంతో జోరుగా సాగిన వేలంలో రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్ కలిగిన అతను అన్‌సోల్డ్ (విక్రయించబడని) ఆటగాడిగా మిగిలిపోయాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్‌పొలార్డ్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకోగా ముంబై రైట్ టు మ్యాచ్‌తో చేజిక్కించుకుంది. మెరుపులు మెరిపించే మ్యాక్స్‌వెల్ కోసం సన్‌రైజర్స్, రాయల్స్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆర్‌సీబీ కూడా గళమెత్తినప్పటికీ చివరికి ఢిల్లీ సొంతమయ్యాడు మ్యాక్స్. కోల్‌కతాను రెండు సార్లు విజేతగా నిలిపిన విజయవంతమైన సారథి గౌతమ్ గంభీర్‌ను నామమాత్రమైన ధర (రూ. 2.8 కోట్లు)కే సొంత జట్టు ఢిల్లీ దక్కించుకుంది. యువరాజ్ తిరిగి పంజాబ్ గూటికి చేరాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో అతను పంజాబ్ ఐకాన్ ప్లేయర్. ఇప్పుడు గంభీర్‌లాగే అతనూ సొంతజట్టు పంచన చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment