టోక్యో: ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్ చేతిలో 4-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచి బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివర్లో పెనాల్టి కార్నర్‌లు సమర్పించుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా, అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన రాణి రాంపాల్ సేనను బాధపడొద్దంటూ ఓదార్చి.. దీనిని స్పూర్తిగా తీసుకొని మున్ముందు మరిన్ని పథకాలు సాధించాలని ధైర్యం చెబుతున్నారు.
అయితే భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌తో ఓడిపోయినప్పటికీ జట్టులోని మణిపూర్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ సుశీల చానును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. చానుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ నజరానా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ నేను ఇంఫాల్‌లో అడుగుపెట్టిన వెంటనే సుశీల చానుతో మాట్లాడాను. ఈరోజు తృటిలో కాంస్యం పథకం చేజారింది. కానీ ఒలింపిక్స్‌లో మహిళల జట్టులో సుశీల ప్రదర్శనను అభినందిచాల్సిన విషయం. ఆమెకు యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ విభాగంలో ఉద్యోగంతోపాటు 25 లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు' తెలిపారు.
మణిపూర్‌లో హాకీని మరింతగా అభివృద్ధి చేయాలని భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ సుశీల చేసిన సూచనపై సీఎం స్పందింస్తూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో హాకీ కోసం ఆస్ట్రోటార్ఫ్ పిచ్‌లనుకూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలదిపారు. కాంస్య పతకం మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయం, ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన మహిళల జట్టు ప్రదర్శన గర్వకారణమని అని పేర్కొన్నారు. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళ హాకీ జట్టుకు సుశీల చాను నాయకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment