ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే ప్రతీకారం | CSK Beat SRH By 20 Runs | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే ప్రతీకారం

Published Tue, Oct 13 2020 11:18 PM | Last Updated on Tue, Oct 13 2020 11:20 PM

CSK Beat SRH By 20 Runs - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఓటమి పాలైన సన్‌రైజర్స్‌.. తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ చుక్కెదురైంది. సన్‌రైజర్స్‌ 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. సీఎస్‌కే నిర్దేశించిన 168 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌  8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దాంతో సన్‌రైజర్స్‌పై సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ లెగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించగా, ఆ లెక్కను సీఎస్‌కే సరిచేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ ఆదిలోనే రెండు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. డేవిడ్‌ వార్నర్‌(9), మనీష్‌ పాండే(4) వికెట్లను చేజార్చుకుంది.

ఆ తరుణంలో జోనీ బెయిర్‌ స్టో(23), కేన్‌ విలియమ్సన్‌(57)లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. కాగా, బెయిర్‌ స్టో మూడో వికెట్‌గా ఔటైన తర్వాత ఆరెంజ్‌ ఆర్మీ తడబాటుకు గురైంది. విలియమ్సన్‌ ఆడినా మిగతా వారి నుంచి సహకారం లభించలేదు. ప్రియాం గార్గ్‌(16), విజయ్‌ శంకర్‌(12)లు నిరాశపరచడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటమి తప్పలేదు. రషీద్‌ ఖాన్‌(14;8 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) ఆశలు రేకెత్తించినా హిట్‌  వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ ఖాతాలో మరో పరాజయం చేరింది. ఇది సీఎస్‌కే మూడో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఐదో ఓటమి. సీఎస్‌కే బౌలర్లలో కరాన్‌ శర్మ, బ్రేవోలు తలో రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, శార్దూల్‌, సామ్‌ కరాన్‌లకు తలో వికెట్‌ లభించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్‌ వాట్సన్‌(42; 38 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు(41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డుప్లెసిస్‌ ఆడిన తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌తో కలిసి సామ్‌ కరాన్‌ ఆరంభించాడు. అయితే డుప్లెసిస్‌ గోల్డెన్‌ డక్‌ కావడంతో వాట్సన్‌ ఫస్ట్‌ డౌన్‌ వచ్చాడు.  కరాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 

కాగా, సీఎస్‌కే స్కోరు 35 పరుగుల వద్ద కరాన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వాట్సన్‌-అంబటి రాయుడులు ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. భారీ షాట్లతో అలరించాడు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత రాయుడు భారీ షాట్‌ ఆడబోయి వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఫుల్‌టాస్‌ బాల్‌కు రాయుడు వికెట్‌ సమర్పించుకున్నాడు. కాసేపటికి వాట్సన్‌ కూడా అదే తరహాలో పెవిలియన్‌ చేరాడు. నటరాజన్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతికి షాట్‌ ఆడబోయిన వాట్సన్‌..మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చాడు. చివర్లో ధోని(21; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), జడేజా(25 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)లు ఆకట్టుకుని గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement