‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియమ్ గార్గ్
ఇరవై ఏళ్ల ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, పందొమ్మిదేళ్ల అబ్దుల్ సమద్... సీనియర్ ఆటగాళ్లు విఫలమైన చోట ముగ్గురు కుర్రాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెచ్చుకోదగ్గ విజయాన్ని అందించారు. ముందుగా బ్యాటింగ్‌లో ఇద్దరు ఆకట్టుకుంటే, ఆ తర్వాత బౌలింగ్‌లో మరొకరు తన బాధ్యత నిర్వర్తించారు. ఫలితంగా ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు వరుసగా రెండో గెలుపు లభించింది. సాధారణ స్కోరే సాధించినా, ఎప్పటిలాగే తమ బౌలింగ్‌ను నమ్ముకున్న రైజర్స్ మళ్లీ విజయతీరం చేరింది. మరోవైపు మాజీ చాంపియన్ చెన్నైకి వరుసగా ఇది మూడో పరాజయం. బ్యాటింగ్‌ను పటిష్టపర్చుకునే క్రమంలో తుది జట్టులో మూడు మార్పులు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. కీలక సమయంలో బ్యాట్స్‌మన్ వైఫల్యంతో లక్ష్యానికి కాస్త దూరంలో నిలిచిపోయింది.
దుబాయ్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (21 బంతుల్లో 29; 5 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడింది. జడేజా (35 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ధోని (36 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
వార్నర్ తడబాటు...
శార్దుల్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే బెయిర్‌స్టో (0) బౌల్డ్ కావడంతో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో వార్నర్, పాండే కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే వార్నర్ తన సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. తాను ఎదుర్కొన్న 15వ బంతికిగానీ అతను తొలి బౌండరీ కొట్టలేకపోయాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన పాండేను శార్దుల్ అవుట్ చేయడంతో 46 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.
వరుస బంతుల్లో...
క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇబ్బంది పడిన వార్నర్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్ బౌండరీ వద్ద డుప్లెసిస్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. బంతిని బౌండరీ లోపల సరిగ్గానే అందుకున్న ప్లెసిస్ పట్టు కోల్పోతున్నట్లు అనిపించడంతో దానిని గాల్లోకి విసిరేసి బౌండరీ గీత దాటేశాడు. మళ్లీ వెనక్కి వచ్చి అతను క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే తర్వాతి బంతికే విలియమ్సన్ (9) రనౌట్ కావడంతో రైజర్స్ ఇబ్బందుల్లో పడింది.
సమష్టి వైఫల్యం...
ఛేదనలో చెన్నై బాగా ఇబ్బంది పడింది. వాట్సన్ (1), రాయుడు (8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్ (19 బంతుల్లో 22; 4 ఫోర్లు) సందేహాస్పద రీతిలో రనౌటయ్యాడు. సింగిల్ కోసం డుప్లెసిస్ ప్రయత్నించగా మిడ్ వికెట్‌నుంచి గార్గ్ విసిరిన త్రోను వేగంగా పరుగెత్తుకొచ్చి కీపర్ బెయిర్‌స్టో వికెట్లపైకి పంపించాడు. అయితే స్టంప్స్‌కు ముందుగా బంతి తగిలిందా, లేక బెయిర్‌స్టో గ్లవ్స్ తగిలాయా అనేదానిపై రీప్లేలో కూడా స్పష్టత రాలేదు. జాదవ్ (3) విఫలమయ్యాడు. ఈ దశలో ధోని, జడేజా పోరాడారు. 56 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. అయితే జడేజా కీలక సమయంలో అవుట్ కావడంతో మ్యాచ్ మళ్లీ రైజర్స్‌వైపు మళ్లింది. చివర్లో ధోని ప్రయత్నించినా అది విజయానికి సరిపోలేదు.
చివర్లో ఉత్కంఠ
చెన్నై విజయానికి చివరి 2 ఓవర్లలో 44 పరుగులు చేయాల్సి ఉండగా 19వ ఓవర్ అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ వేస్తుండటంతో ఫలితం లాంఛనమే అనిపించింది. అయితే ఒక్క బంతి వేసిన తర్వాత భువీ తొడ కండరాలు పట్టేయడంతో వెనుదిరిగాడు. మిగిలిన ఐదు బంతులు వేసిన ఖలీల్ 15 పరుగులిచ్చాడు. చివరి ఓవర్ వేసేందుకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సమద్‌కు బంతిని అందించాల్సి వచ్చింది. చెన్నై విజయానికి 6 బంతుల్లో 28 పరుగులు కావాలి. కెరీర్‌లో రెండో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సమద్ తీవ్ర ఒత్తిడిలో 2 బంతుల్లోనే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే తర్వాతి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రం ఇవ్వడంతో వార్నర్ ఊపిరి పీల్చుకున్నాడు. చివరి బంతికి కరన్ సిక్స్ కొట్టినా అప్పటికే ఆట ముగిసింది.
కుర్రాళ్ల రాజ్యం...
11 ఓవర్లలో స్కోరు 69/4 అంటే ఎక్కువేమీ కాదు... మరోవైపు నేరుగా తన తప్పేమీ లేకపోయినా సరే తన కారణంగానే స్టార్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ రనౌట్ అయ్యాడనే అపరాధ భావం! ఇలాంటి స్థితిలో 20 ఏళ్ల కుర్రాడు మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పట్టుదల ప్రదర్శించాడు. మిగిలిన 9 ఓవర్లలో జట్టు 95 పరుగులు జోడించగలిగిందంటే అది గార్గ్ చలవే. గత రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని ప్రియమ్ గార్గ్ తన ఆటతో అందరికీ సమాధానం చెప్పేశాడు. శార్దుల్ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా చక్కటి బౌండరీ కొట్టిన అతను కరన్ వేసిన తర్వాతి ఓవర్లో చెలరేగిపోయాడు.
వరుసగా నాలుగు బంతుల్లో 4, 4 (నోబాల్), 6, 4 కొట్టాడు. మూడు ఫోర్లు కూడా బలంగా బాదినవి కాకుండా చక్కటి టైమింగ్‌తో పాయింట్ దిశగా కొట్టగా, పేసర్ బౌలింగ్‌లో స్వీప్ ఆడుతున్నట్లుగా డీప్ మిడ్‌వికెట్ దిశగా కొట్టిన సిక్సర్ యువ ధోనిని గుర్తుకు తెచ్చింది! ఆ తర్వాత చహర్, బ్రేవో బౌలింగ్‌లో కూడా అతను కొట్టిన మరో రెండు ఫోర్లు ఆకట్టుకున్నాయి. మరో యువ ఆటగాడు అభిషేక్‌నుంచి గార్గ్‌కు మంచి మద్దతు లభించింది. గార్గ్ జోరుకు ముందే అభిషేక్ దూకుడు ప్రదర్శించాడు. జడేజా బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్‌తో అతను తన ధాటిని చూపించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 43 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) చావ్లా 28; బెయిర్‌స్టో (బి) చహర్ 0; పాండే (సి) కరన్ (బి) శార్దుల్ 29; విలియమ్సన్ (రనౌట్) 9; గార్గ్ (నాటౌట్) 51; అభిషేక్ (సి) ధోని (బి) చహర్ 31; సమద్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164.
వికెట్ల పతనం: 1–1; 2–47; 3–69; 4–69; 5–146. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–31–2; స్యామ్ కరన్ 3–0–37–0; శార్దుల్ 4–0–32–1; బ్రేవో 4–0– 28–0; పీయూష్ చావ్లా 3–0–20–1; జడేజా 2–0–16–0.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: డుప్లెసిస్ (రనౌట్) 22; వాట్సన్ (బి) భువనేశ్వర్ 1; రాయుడు (బి) నటరాజన్ 8; జాదవ్ (సి) వార్నర్ (బి) సమద్ 3; ధోని (నాటౌట్) 47; జడేజా (సి) సమద్ (బి) నటరాజన్ 50; కరన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–4; 2–26; 3–36; 4–42; 5–114. బౌలింగ్: భువనేశ్వర్ 3.1–0–20–1; ఖలీల్ 3.5–0–34–0; నటరాజన్ 4–0–43–2; అభిషేక్ 1–0–4–0; రషీద్ ఖాన్ 4–0–12–0; సమద్ 4–0–41–1.
- టి20ల్లో జడేజాకు ఇదే తొలి అర్ధ సెంచరీ. గతంలో అత్యధిక స్కోరు 48 కాగా... 241వ మ్యాచ్‌లో (168 ఇన్నింగ్స్‌లు) హాఫ్ సెంచరీ నమోదు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment