వెస్టిండీస్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విండీస్ మహిళ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు డాటిన్ తెలిపింది. కాగా 2022లో జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ అంతర్జాతీయ విడ్కోలు పలికింది.
అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా.. డాటిన్ తన రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకుంది. "అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగానే భావిస్తాను. క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ డాక్టర్. కిషోర్ షాలోతో చర్చలు అనంతరం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. తిరిగి విండీస్ జెర్సీని ధరించేందుకు సిద్దమయ్యాను. మళ్లీ జట్టులో తిరిగి చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
వెస్టిండీస్ మహిళల జట్టుకు అన్ని ఫార్మాట్లలో నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తాను. నా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని డాటిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment