భారత క్రికెట్ జట్టులో పునరాగమనం గురించి స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక అప్‌డేట్ అందించాడు. టీమిండియాలోకి తిరిగి రావడం తన చేతుల్లో లేదని.. ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడతానని పేర్కొన్నాడు. బెంగాల్ జట్టు తరఫున త్వరలోనే బరిలోకి దిగనున్నానని స్పష్టం చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్లు వీరుడిగా నిలిచిన ఉత్తరప్రదేశ్ బౌలర్ షమీ.. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్న షమీ.. దీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన ఈ రైటార్మ్ పేసర్.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఇటీవలే నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
ఈ నేపథ్యంలో.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి షమీ అందుబాటులోకి వస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. సెప్టెంబరులో మొదలయ్యే ఈ సిరీస్‌లో షమీ తప్పక ఆడతాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవలి ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. కాగా గాయం లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా టీమిండియాకు దూరమైన క్రికెటర్లు.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటూ బీసీసీఐ నిబంధన ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేస్ బౌలింగ్ విభాగం నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా వంటి ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావారందరికీ ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకునేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో షమీ సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైనట్లు అతడి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
కోల్‌కతాలోని ఓ కార్యక్రమంలో షమీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు తిరిగి టీమిండియాలో ఆడతానో తెలియదు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాను. అయితే, టీమిండియా కంటే ముందు మీరు న్ను బెంగాల్ జెర్సీలో చూస్తారు. త్వరలోనే బెంగాల్ తరఫున 2- 3 మ్యాచ్‌లు ఆడతాను. ఇందుకోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను’’ అని పేర్కొన్నాడు.
గాయం ఇంతలా వేధిస్తుందని ఊహించలేదని.. టీ20 ప్రపంచకప్ ఈవెంట్ ముగిసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని భావించగా.. అందుకు అవకాశం లేకుండా పోయిందని షమీ తెలిపాడు. గాయం కారణంగా ఐపీఎల్, వరల్డ్‌కప్ టోర్నీలకు దూరమయ్యానని విచారం వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు నుంచి రంజీ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, షమీ బెంగాల్ తరఫున ఆడాలంటే బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరమవ్వాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment