టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచపు అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ బెట్‌వే ఎస్‌ఏ20కు అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. లీగ్ క్రికెట్‌లో డీకేకు ఉన్న అనుభవం, భారత్‌లో కార్తీక్‌కు ఉన్న క్రేజ్ తమ లీగ్ వృద్ధికి తోడ్పడుతుందని స్మిత్ అన్నాడు. బెట్‌వే ఎస్‌ఏ20 లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై డీకే స్పందించాడు. కొత్త బాధ్యతలు చేపట్టనుండటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. గ్రేమ్ స్మిత్ బృందంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కార్తీక్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సహచర అంబాసిడర్ ఏడీ డివిలియర్స్‌తో కలిసి పని చేస్తాడు.
ఎస్‌ఏ20 లీగ్ గత రెండు సీజన్లుగా విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లోనూ ఐపీఎల్ తరహాలో చాలామంది విదేశీ స్టార్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతుల్లో నడుస్తుంది. ఈ జట్టుకు సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీలు ఎస్‌ఏ20 లీగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఓనర్ల యాజమాన్యంలోనే నడుస్తున్నాయి.
కార్తీక్ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ప్రారంభ ఎడిషన్‌ను (2008) నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన డీకే.. ఐపీఎల్ 2024 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. డీకే రిటైర్మెంట్ ముందు వరకు ఆర్సీబీకి ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఆర్సీబీ డీకేను తమ మెంటార్‌గా నియమించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో కార్తీక్ 135.66 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment