టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ గత వారం తన ఆల్‌టైమ్, ఆల్ ఫార్మాట్ ఫేవరెట్ టీమిండియాను ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా డీకే ఈ జాబితాలో ఎంఎస్ ధోనికి చోటివ్వలేదు. ఈ కారణంగా అతను ధోని అభిమానుల నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డీకే తాజా వివరణ ఇచ్చాడు.
ధోని విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పొరపాటున ధోని పేరును లిస్ట్‌లో చేర్చలేదని వివరణ ఇచ్చాడు. స్వతహాగా వికెట్‌కీపర్‌ను అయి ఉండి, ధోని పేరును చేర్చకపోవడం నిజంగా పెద్ద పొరపాటని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ జట్టులో ఉండటంతో అందరూ అతనే వికెట్‌కీపర్ అనుకున్నారని పేర్కొన్నాడు. ఈ అంశానికి సంబంధించిన ఎపిసోడ్ బయటికి వచ్చే వరకు ధోనిని ఎంపిక చేయలేదని తనకు కూడా తెలీదని వివరణ ఇచ్చాడు. జట్టు ఎంపిక సమయంలో తన మదిలో చాలా విషయాలు ఉన్నాయని, అందుకే పొరపాటు జరిగిందని అన్నాడు.
తన జట్టులో ధోని తప్పనిసరిగా ఉంటాడని తెలిపాడు. ధోని ఏడో స్థానంలో వికెట్‌కీపర్‌గా మాత్రమే కాకుండా జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తాడని అన్నాడు. ధోని ఈ జట్టులోనే కాదు, తాను ఎంపిక చేసే ఏ జట్టులోనైనా ఉంటాడని తెలిపాడు. కాగా, ధోని నేతృత్వంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment