
India tour of West Indies, 2023- Hardik Pandya: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తీరుపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత జట్టు కరేబియన్ దీవి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
రెండు సిరీస్‌లూ మనవే!
ఈ క్రమంలో.. టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది రోహిత్ సేన. అయితే, వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఎలాగోలా గట్టెక్కిన టీమిండియా.. హార్దిక్ పాండ్యా సారథిగా వ్యవహరించిన రెండో వన్డేలో మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఆఖరి మ్యాచ్‌లో గెలిచి విండీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ట్రోఫీని 2-1తో కైవసం చేసుకుంది.
హార్దిక్ అదరగొట్టాడు
ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆరంభంలో మందకొడిగా సాగిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇన్నింగ్స్ ఆఖర్లో మాత్రం అభిమానులను అలరించింది. ఇక బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు సాధించి టీమిండియా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఘన విజయం అందుకుంది.
విలాసాలు కావాలని అడగటం లేదు.. కానీ
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన హార్దిక్.. బ్రియన్ లారా మైదానంలో ఈ విజయం తమకు ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. అదే విధంగా వెస్టిండీస్‌లో తమకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ.. ‘‘మేము ఇక్కడ ఆడిన అత్యంత మెరుగైన మైదానాల్లో ఇదీ ఒకటి. అయితే, మేము మళ్లీ ఇక్కడికి వచ్చే నాటికి పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నా. ప్రయాణాల దగ్గర నుంచి కనీస సౌకర్యాల దాకా ఏదీ సరిగ్గా లేదు.
గతంలో ఇక్కడకు వచ్చినపుడు కూడా ఇలాగే జరిగింది. ఇప్పటికైనా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సమస్యలను నిశితంగా పరిశీలించాలి. మేము ఇక్కడికి వచ్చినపుడు విలాసాలు కావాలని కోరుకోవడం లేదు. కనీస సౌకర్యాలైనా కల్పించాలని అడుగుతున్నాం’’ అంటూ విండీస్ బోర్డు తీరును విమర్శించాడు.
సంపన్నులు కదా హార్దిక్!
అయితే, ఇలాంటి చిన్న చిన్న లోపాలే తప్ప ఈ పర్యటనను మేము బాగా ఎంజాయ్ చేస్తున్నామని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల వన్డే సిరీస్ కోసం బార్బడోస్‌కు పయనమైన నేపథ్యంలోనూ.. అర్ధరాత్రి విమాన ప్రయాణం వల్ల రెస్ట్ లేకుండా పోయిందని టాప్ క్రికెటర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దీనస్థితిలో ఉన్న విండీస్‌తో సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా అంగీకరించినపుడు ఇలాంటివి జరగడం సహజమంటున్న ఫ్యాన్స్.. సంపన్న బోర్డుకు చెందిన భారత ఆటగాళ్లకు అక్కడ విలాసాలు దొరకవంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 3 నుంచి టీమిండియా- విండీస్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
మొన్న వాటర్‌బాయ్! ఇప్పుడు ఇలా.. ఏంటిది కోహ్లి! వీడియో వైరల్
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు.. ఏకంగా..
Mukesh Kumar is in a hurry to finish things off! Can he convert it into a fifer?#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/wWPNTY853m
— FanCode (@FanCode) August 1, 2023