ప్రిక్వార్టర్స్‌ చేరిన రిబాకినా | Elena Rybakina reach 4th round | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌ చేరిన రిబాకినా

Jun 2 2024 4:17 AM | Updated on Jun 2 2024 4:17 AM

Elena Rybakina reach 4th round

జ్వెరెవ్, అల్‌కరాజ్‌ కూడా... 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో కజకిస్తాన్‌ స్టార్‌ రిబాకినా, రెండో సీడ్‌ సబలెంక అలవోక విజయాలతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడోరౌండ్లో నాలుగో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌) 6–4, 6–2తో వరుస సెట్లలో ఎలైస్‌ మెర్టెన్స్‌ (బెల్జియం)ను చిత్తు చేయగా, రెండో సీడ్‌ సబలెంక (రష్యా) 7–5, 6–1తో బడొసా (స్పెయిన్‌)పై నెగ్గింది. 

ఆ్రస్టేలియా ఓపెన్‌ రన్నరప్, ఏడోసీడ్‌ క్వినెన్‌ జెంగ్‌కు రష్యా ప్లేయర్‌ ఎలీనా అవనెసియాన్‌ షాకి చ్చింది. మూడో రౌండ్లో అన్‌సీడెన్‌ ఎలీనా 3–6, 6–3, 7–6 (10/6)తో చైనా స్టార్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో వింబుల్డన్‌ చాంపియన్‌ మార్కెటా వొండ్రొసొవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–1, 6–3తో క్లో పాక్వెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరింది. 

పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్, అల్‌కరాజ్‌ ముందంజ వేశారు. మూడోరౌండ్లో నిరుటి సెమీఫైనలిస్ట్, నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 3–6, 6–4, 6–2, 4–6, 7–6 (10/3)తో టాలన్‌ గ్రీక్‌స్పూర్‌ (నెదర్లాండ్స్‌)పై శ్రమించి నెగ్గాడు. స్పెయిన్‌ స్టార్, మూడో సీడ్‌ కార్లొస్‌ అల్‌కరాజ్‌ 6–4, 7–6 (7/5), 6–3తో 27వ సీడ్‌ సెబాస్టియన్‌ కొర్డా (అమెరికా)పై గెలుపొందగా, సిట్సిపాస్‌ (గ్రీస్‌) 6–3, 6–3, 6–1తో జాంగ్‌ జిజెన్‌ (చైనా)ను ఓడించాడు. ఆ్రస్టేలియా ఓపెన్‌ రన్నరప్, ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 7–6 (7/4), 7–5, 1–6, 6–4తో థామస్‌ మచక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై చెమటోడ్చి విజయం సాధించాడు. 
 
శ్రీరామ్‌ బాలాజీ ముందంజ 
భారత ఆటగాడు శ్రీరామ్‌ బాలాజీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పురుషుల డబుల్స్‌లో మిగెల్‌ వరేలా (మెక్సికో)తో జోడీకట్టిన బాలాజీ  మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో భారత్‌–మెక్సికన్‌ ద్వయం 6–4, 3–6, 6–2తో డాన్‌ ఆడెడ్‌–థియో అరిబేజ్‌ (ఫ్రాన్స్‌) జంటపై గెలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement