న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌ | Eng-W vs NZ-W: England Whitewash New Zealand Ahead T20 WC 2024 | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌.. వరల్డ్‌కప్‌నకు రెడీ!

Published Thu, Jul 18 2024 2:23 PM | Last Updated on Thu, Jul 18 2024 3:02 PM

Eng-W vs NZ-W: England Whitewash New Zealand Ahead T20 WC 2024

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు దుమ్ములేపింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఐదో టీ20లోనూ విజయం సాధించింది.

లండన్‌ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా 5-0తో వైట్‌వాష్‌ చేసి సత్తా చాటింది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి టీ20లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది. పర్యాటక జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

హీథర్‌ నైట్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(31 బంతుల్లో 46 నాటౌట్‌) కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది. మిగతా వాళ్లలో అలిస్‌ కాప్సీ 25, చార్లీ డీన్‌ 24 పరుగులతో రాణించారు.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు సుజీ బేట్స్‌(16), జార్జియా ప్లీమర్‌(8) విఫలమయ్యారు.

అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ అమేలియా కెర్‌(42) ఇన్నింగ్స్‌ చక్కదిద్దగా.. బ్రూక్‌ హాలీడే(25) ఆమెకు సహకారం అందించింది. అయితే, మిగతా వాళ్లెవరూ బ్యాట్‌ ఝులిపించలేకపోయారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగుల(ఎనిమిది వికెట్లు)కే పరిమితమైన న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌ చేతిలో ఓడి.. క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. సారా గ్లెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకుంది.

టీ20 వరల్డ్‌కప్‌-2024కు రెడీ
ఈ ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్‌ వేదికగా ఐసీసీ వుమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌పై ఇలాంటి విజయం తమకు మంచి బూస్ట్‌ ఇచ్చిందని కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ పేర్కొంది.

మెగా టోర్నీకి ముందు అజేయంగా నిలవాలని భావించామని.. దూకుడైన ఆటతో ఆ కలను నెరవేర్చుకున్నట్లు తెలిపింది. వరల్డ్‌కప్‌నకు సన్నాహకాల్లో భాగంగా ముందుగా తాము అబుదాబికి వెళ్తామని.. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. జూన్‌ 26న ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ మహిళా జట్టు వన్డే సిరీస్‌ను కూడా 0-3తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. అక్కడా వైట్‌వాష్‌ ఎదుర్కొంది. ఓవరాల్‌గా ఈ టూర్‌ వాళ్లకు చేదు అనుభవం మిగిల్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement