
ముంబై: వచ్చే ఏడాది భారత్‌లో జరగాల్సిన ఫిఫా అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు మరో మూడు జట్లు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌తో పాటు ఇంగ్లండ్, జర్మనీలను యూరప్ విభాగం నుంచి క్వాలిఫై చేస్తున్నట్లు యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘాల యూనియన్ (యూఈఎఫ్‌ఏ) శుక్రవారం ప్రకటించింది. ‘యూరప్ నుంచి స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీలు ప్రాతినిధ్యం వహిస్తాయి’ అని యూఈఎఫ్‌ఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
వాస్తవానికి ప్రపంచ కప్ అర్హత టోర్నీ అయిన ‘యూఈఎఫ్‌ఏ అండర్–17 మహిళల చాంపియన్‌షిప్’ ద్వారా ప్రపంచ కప్‌లో పాల్గొనే యూరప్ జట్లను నిర్ణయిస్తారు. అయితే కరోనా మహమ్మారితో చాంపియన్‌షిప్ చివరి రౌండ్ పోటీలు రద్దయ్యాయి. అయితే మెరుగైన ర్యాంకింగ్ ఉండటంతో స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో భారత్‌తో పాటు కొరియా రిపబ్లిక్, జపాన్, న్యూజిలాండ్‌లు ఇప్పటికే ప్రపంచ కప్‌కు అర్హత పొందాయి. కరోనా వల్ల ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్... వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7కి వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment