హ్యాట్రిక్‌ తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌ | England Spinner Charlie Dean Takes Hat Trick Against South Africa In Second ODI | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌

Published Sun, Dec 8 2024 6:27 PM | Last Updated on Sun, Dec 8 2024 6:27 PM

England Spinner Charlie Dean Takes Hat Trick Against South Africa In Second ODI

మహిళల క్రికెట్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 8) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ చార్లీ డీన్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డీన్‌ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసిన మూడో మహిళా క్రికెటర్‌గా డీన్‌ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా (పురుషుల క్రికెట్‌తో పాటు) ఈ ఘనత సాధించిన ఏడో ఇంగ్లండ్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డీన్‌ ఇన్నింగ్స్‌ 17, 19 ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి మారిజన్‌ కాప్‌ వికెట్‌ తీసిన డీన్‌.. ఆతర్వాత 19వ ఓవర్‌ మొదటి రెండు బంతులకు నదినే డి క్లెర్క్‌, సినాలో జఫ్టా వికెట్లు తీసింది.

ఇంగ్లండ్‌ తరఫున హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బౌలర్లు..
కరోల్‌ హాడ్జస్‌ 1993లో డెన్మార్క్‌ మహిళల జట్టుపై
క్లేర్‌ కాన్నర్‌ 1999లో భారత మహిళా జట్టుపై
జేమ్స్‌ అండర్సన్‌ 2003లో పాకిస్తాన్‌ పురుషుల జట్టుపై
స్టీవ్‌ హార్మిసన్‌ 2004లో భారత పురుషుల జట్టుపై
ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 2009లో వెస్టిండీస్‌ పురుషుల జట్టుపై
స్టీవెన్‌ ఫిన్‌ 2015లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుపై
చార్లీ డీన్‌ 2024లో సౌతాఫ్రికా మహిళల జట్టుపై

మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. చార్లీ డీన్‌ (4/45), సోఫీ ఎక్లెస్టోన్‌ (3/27), లారెన్‌ ఫైలర్‌ (3/32) రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లో టైరాన్‌ (45), లారా వోల్వార్డ్ట్‌ (35), డెర్క్‌సన్‌ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామీ బేమౌంట్‌ (34), బౌచియర్‌ (33), డేనియల్‌ హాడ్జ్‌ (25 నాటౌట్‌), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (20) ఇంగ్లండ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్‌సన్‌ 2, డి క్లెర్క్‌, మారిజన్‌ కాప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్‌ 11న  జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement