
సౌతాంఫ్టన్: ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ సిరీస్‌కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న ఫిల్ విట్టికేస్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మూడో టీ20 సందర్భంగా పలుపురు అధికారులతో పాటు కొందరు క్రికెటర్లు రిఫరితో సన్నిహితంగా మెలిగారు. రిఫరికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అందరూ సహజంగానే తమ విధులు నిర్వహించారు. అయితే, రోజు వారి పరీక్షల్లో భాగంగా రిఫరికి కరోనా టెస్ట్ నిర్వహించడంతో అసలు విషయం వెలుగుచూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు(ఆదివారం) ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.
ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయనను కాంటాక్ట్ అయిన వారందరూ సురక్షితంగానే ఉన్నప్పటికీ.. సిరీస్ సజావుగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిఫరితో సన్నిహితంగా ఉన్నవారంతా 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. దీంతో జూన్ 29న ఇరు జట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్ అనంతరం శ్రీలంక జట్టు స్వదేశంలో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల కోసం లంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. టీ20 సిరీస్‌ను ఆతిధ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా, జూన్ 29 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.
చదవండి: సచిన్ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్
Comments
Please login to add a commentAdd a comment