
PC: Hockey India
FIH Pro League: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. చైనా జట్టుతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ సాధించిన రెండు గోల్స్‌ను స్టార్ డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ చేయడం విశేషం. ఆట మూడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను తొలి గోల్‌గా మలిచిన గుర్జీత్... 49వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను కూడా లక్ష్యానికి చేర్చి భారత విజయాన్ని ఖాయం చేసింది.
చైనా తరఫున 39వ నిమిషంలో షుమిన్ వాంగ్ ఏకైక గోల్ సాధించింది. మొత్తం తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ప్రొ లీగ్ జరుగుతోంది. ప్రస్తుతం భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తదుపరి మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ వేదికగా ఈనెల 19, 20 తేదీల్లో నెదర్లాండ్స్‌తో... 27, 28వ తేదీల్లో స్పెయిన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment