Hockey Tourney
-
FIH League: శెభాష్ గుర్జీత్.. చైనాపై మరో విజయం.. టేబుల్ టాపర్‌గా..
FIH Pro League: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. చైనా జట్టుతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ సాధించిన రెండు గోల్స్‌ను స్టార్ డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ చేయడం విశేషం. ఆట మూడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను తొలి గోల్‌గా మలిచిన గుర్జీత్... 49వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను కూడా లక్ష్యానికి చేర్చి భారత విజయాన్ని ఖాయం చేసింది. చైనా తరఫున 39వ నిమిషంలో షుమిన్ వాంగ్ ఏకైక గోల్ సాధించింది. మొత్తం తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ప్రొ లీగ్ జరుగుతోంది. ప్రస్తుతం భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తదుపరి మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ వేదికగా ఈనెల 19, 20 తేదీల్లో నెదర్లాండ్స్‌తో... 27, 28వ తేదీల్లో స్పెయిన్‌తో తలపడుతుంది. చదవండి: IPL 2022 Auction: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు, హనుమ విహారి కనీస విలువ ఎంతంటే! -
టోక్యో పిలుపు కోసం...
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో వెళ్లే దారిలో పడ్డాయి. ఒలింపిక్స్ బెర్తులే లక్ష్యంగా ఇరు జట్లు పోటీలకు సిద్ధమయ్యాయి. ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో శుక్రవారం పురుషుల జట్టుకు తమకంటే దిగువ ర్యాంకులో ఉన్న రష్యా ఎదురవగా... మహిళల జట్టుకు మాత్రం అమెరికా రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఒలింపిక్స్ పయనంలో భారత జట్లు కేవలం రెండే విజయాల దూరంలో ఉన్నాయి. ఐదో ర్యాంక్‌లో ఉన్న భారత పురుషుల జట్టు 22వ ర్యాంకర్ రష్యాపై గెలవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. కానీ భారత కోచ్ గ్రాహం రీడ్ మాత్రం ప్రత్యర్థి అంత సులువని తాము అంచనా వేయబోమని చెప్పారు. ‘మనది కాని రోజంటూ ఉంటే ఒలింపిక్స్ కలలు నీరుగారతాయని మాకు తెలుసు. అందుకే నిర్లక్ష్యానికి, అలసత్వానికి ఏమాత్రం తావివ్వం. ఈ రెండు మ్యాచ్‌లు మాకు కీలకం’ అని అన్నాడు. రీడ్ కోచింగ్‌లో భారత రక్షణ శ్రేణి మెరుగైంది. గత 12 నెలల కాలంలో సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లతో భారత డిఫెన్స్ పటిష్టమైంది. డ్రాగ్‌ఫ్లికర్లు రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లక్రాలు ఫామ్‌లో ఉన్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకెళుతున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో కెప్టెన్ మన్‌ప్రీత్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్‌సాగర్ ప్రసాద్‌లు ఆశించిన స్థాయిలో రాణిస్తే రష్యాపై భారత్ సులభంగానే గోల్స్ సాధిస్తుంది. అలాగే అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రష్యా దాడుల్ని సమర్థంగా నిరోధించగలడు. అమెరికాతో ఎలాగబ్బా! పురుషుల జట్టుకైతే సులువైన ప్రత్యర్థే! కానీ మహిళల జట్టుకే మింగుడుపడని ప్రత్యర్థి అమెరికా ఎదురైంది. ప్రపంచ 13వ ర్యాంకర్ అమెరికాతో భారత్‌కు 4–22తో పేలవమైన రికార్డు ఉంది. 22 సార్లు ప్రత్యర్థి చేతిలో ఓడిన మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. కెప్టెన్ రాణి రాంపాల్, డ్రాగ్‌ఫ్లికర్ గుర్జీత్ కౌర్, యువ ఫార్వర్డ్ ప్లేయర్ లాల్రెమ్సియామి, గోల్‌కీపర్ సవితలపై జట్టు ఆశలు పెట్టుకుంది. కోచ్ జోయెర్డ్ మరీనే మాట్లాడుతూ అమెరికాపై భారత్ గెలుస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ మ్యాచ్‌ల కోసమే గత ఏడాది కాలంగా నిరీక్షిస్తున్నామని, గెలిచే సత్తా అమ్మాయిల్లో ఉందని చెప్పారు. కెప్టెన్ రాణి రాంపాల్ మాట్లాడుతూ ‘ఆసియా గేమ్స్‌తోనే టోక్యో బెర్తు సాధించాలనుకున్నాం. దురదృష్టవశాత్తు అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒలింపిక్స్ బెర్తు సాధించే తీరతాం’ అని చెప్పింది. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్ సాధించే క్రమంలో తొలి లక్ష్యమైన క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత హాకీ జట్టు మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో బరిలోకి దిగనుంది. ఈనెల 15 నుంచి 23 వరకు జపాన్‌లోని హిరోషిమాలో ఈ టోర్నీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత జట్టు శనివారం జపాన్‌కు బయలుదేరింది. పూల్ ‘ఎ’లో భారత్‌తోపాటు పోలాండ్, ఉరుగ్వే, ఫిజీ జట్లు ఉన్నాయి. పూల్ ‘బి’లో జపాన్, చిలీ, రష్యా, మెక్సికో జట్లకు స్థానం కల్పించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలంటే భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాల్సి ఉంటుంది. భారత జట్టు తమ లీగ్ మ్యాచ్‌లను వరుసగా ఉరుగ్వేతో (జూన్ 15న), పోలాండ్‌తో (జూన్ 16న), ఫిజీతో (జూన్ 18న) ఆడుతుంది. ఫైనల్ 23న జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. -
రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా వివేక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్ పురుషుల జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్. వివేక్ ఎంపికయ్యాడు. విద్యా సాగర్ మేనేజర్‌గా, సంజయ్ కుమార్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జాతీయ హాకీ టోర్నమెంట్ జరుగుతుంది. జట్టు వివరాలు: ఆర్. వివేక్, ఫిరోజ్, ఎ. అశోక్ కుమార్, పి. శ్రీనివాస్, వై. శేఖర్, జి. పృథ్వీ రాజ్, బి. రామకృష్ణ, బి. అరవింద్, బి. సాయి వినీత్, కె. ప్రశాంత్, సాయి కుమార్, అభిమన్యు యాదవ్, ఎం. అజీజ్, పి. సన్నీ, అరవింద్, ఎం. రమేశ్, ఎం. వినీత్, జె. రాజశేఖర్. -
హెచ్‌పీఎస్ జట్లకు హాకీ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట్, ఫ్యూచర్ కిడ్స్ జట్లు సత్తాచాటాయి. హాకీ ఈవెంట్ జూనియర్, సీనియర్ విభాగాల్లో హెచ్‌పీఎస్ జట్లు విజేతలుగా నిలవగా, బాస్కెట్‌బాల్ టోర్నీ సీనియర్, జూనియర్ విభాగాల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. శనివారం బేగంపేట్‌లో జరిగిన హాకీ టోర్నీ సీనియర్ బాలుర తొలి మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ జట్టు 2–1తో అభ్యాస స్కూల్‌పై, రెండో మ్యాచ్‌లో 2–0తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అభ్యాస 1–0తో సెయింట్ జోసెఫ్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన హెచ్‌పీఎస్ విజేతగా నిలవగా, అభ్యాస, సెయింట్ జోసెఫ్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. జూనియర్ బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ 7–0తో ఎఫ్కేఎస్పై, రెండో మ్యాచ్‌లో 2–0తో ఎన్ఏఎస్ఆర్పై, మూడో మ్యాచ్‌లో 2–1తో అభ్యాసపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. అభ్యాస జట్టు 2–0తో ఎఫ్కేఎస్పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో 1–1తో ఎన్ఏఎస్ఆర్తో మ్యాచ్‌ను డ్రా చేసుకొని రెండో స్థానాన్ని దక్కించుకుంది. చాంపియన్స్ ఫ్యూచర్ కిడ్స్ జట్లు ఈ టోర్నీ బాస్కెట్‌బాల్ ఈవెంట్లో ఫ్యూచర్ కిడ్స్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. సీనియర్ బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ 18–10తో ఎన్ఏఎస్ఆర్పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రేయ (12) టాప్ స్కోరర్. జూనియర్ బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 12–3తో హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టును ఓడించి టైటిల్‌ను సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ అడ్మినిస్ట్రేటర్ అలేకందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
హాకీ టోర్నీ విజేత కృష్ణా జట్టు
రన్నర్స్‌గా పశ్చిమగోదావరి జట్టు ముగిసిన పోటీలు నెల్లూరు(బృందావనం): నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఏడో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలుర హాకీ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. విజేతగా కృష్ణా, రన్నర్స్‌గా పశ్చిమగోదావరి, తృతీయస్థానంలో విశాఖపట్నం జిల్లా జట్టు నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ మువ్వా రామలింగం హాజరయ్యారు. ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రదర్శించిన ఆటతీరు నామమాత్రంగా ఉందని, జాతీయస్థాయిలో రాణించాలంటే ఈ ప్రతిభ సరిపోదన్నారు. 45 ఏళ్లుగా హాకీ ప్రగతి కోసం కృషిచేస్తున్న తనకు ఈసారి క్రీడాకారులు ప్రదర్శించిన తీరు ఆవేదనకు గురిచేసిందన్నారు. విశాఖపట్నం జట్టులోని గోల్‌కీపర్ ప్రదర్శించిన ఆటతీరు మెరుగ్గా ఉందన్నారు. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లోని అకాడమీల్లో శిక్షణ పొందిన క్రీడాకారులు ప్రదర్శించిన తీరు ఏ మాత్రం బాగొలేదన్నారు. నెల్లూరు జిల్లా అసోసియేషన్‌కు సహకారం అందించిన ఆనం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ చెన్నకేశవరావు, జిల్లా అటవీశాఖ అధికారి చాణక్యరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి రామ్మూర్తి, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, సనత్‌కుమార్, ధ్యాన్‌చంద్ హాకీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రావు, సురేష్, జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శేషారెడ్డి, థామస్‌పీటర్, తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా హాకీ పోటీలు
నెల్లూరు(బృందావనం): నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులు జరిగే ఏడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్‌జూనియర్ మెన్స్ అంతర్జిల్లా హాకీ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తొలి రోజు జరిగిన పోటీలకు సంబంధించిన ఫలితాలను నిర్వాహకులు శనివారం రాత్రి ప్రకటించారు. నెల్లూరు జిల్లా జట్టు రెండు మ్యాచ్‌లో పాల్గొని ఆయా జట్లపై అలవోకగా నెగ్గింది. తొలిమ్యాచ్‌లో నెల్లూరు జట్టు ప్రకాశం జిల్లా జట్టును 5 – 0 గోల్స్ తేడాతో ఓటమిపాలు చేసింది. అనంతపురం– పశ్చిమగోదావరి జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1 - 1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 1 - 0 తేడాతో ప్రకాశం జట్టు గెలుపొందింది. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జట్టు 7 – 0 గోల్స్‌తో విజయం సాధించింది. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కృష్ణా జిల్లా 2 – 1 గోల్స్ తేడాతో గెలుపొందింది. అనంతపురం, కర్నూలు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు 6 – 1 గోల్స్ తేడాతో గెలుపొందింది. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జిల్లా జట్టు 6 – 0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు 2 - 1 గోల్స్ తేడాతో నెగ్గింది. నెల్లూరు – గుంటూరు జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 10 – 0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. -
క్రీడలతో బంగారు భవితకు బాటలు
హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ముకేష్‌కుమార్ మీనా అట్టహాసంగా రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పురుషుల హాకీ పోటీలు ప్రారంభం నెల్లూరు(బృందావనం): బాలబాలికలు క్రీడల్లో రాణించి తమ బంగారుభవితకు బాటలు వేసుకోవాలని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులు జరగనున్న ఏడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్స్ పురుషుల అంతర్‌జిల్లాల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. హాకీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో హాకీ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలకు నెల్లూరు వేదిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూ సివిల్ సర్వీస్‌లోకి 25 ఏళ్లక్రితం వచ్చానంటూ తన అనుభవాన్ని వివరించారు. హాకీ స్టిక్స్ పట్టుకున్న క్రీడాకారులను చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తోందని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో సాధించిన పతకాలతో భారతదేశంలో హాకీ క్రీడకు సమానమైన క్రీడ ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో హాకీ ప్రగతికి కృషి రాష్ట్రంలో హాకీ ప్రగతికి అసోసియేషన్ పరంగా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ముకేష్‌కుమార్‌మీనా వివరించారు. విభజన నేపథ్యంలో క్రీడారంగం మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోందని, రానున్న ఐదేళ్లలో సమస్యను అధిగమించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ విజయబాబు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామ్మూర్తి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, హాకీ నెల్లూరు డిస్ట్రిక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు శేషయ్య, థామస్‌పీటర్, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సనత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. 12 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక పోటీలకు విజయనగరం జిల్లా మినహాయించి 12 జిల్లాలకు చెందిన 240 మంది క్రీడాకారులు, 60 మంది కోచ్‌లు, 15 మంది అఫీషియల్స్ హాజరయ్యారు. తొలుత జాతీయపతాకాన్ని ముకేష్‌కుమార్‌మీనా, రాష్ట్ర క్రీడాపతాకాన్ని నిరంజన్‌రెడ్డి, జిల్లా క్రీడాపతాకాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాజ్యోతిని ముకేష్‌కుమార్‌మీనా వెలిగించి, కపోతాలు, బెలూన్లను ఎగురవేసి బాణసంచా హోరులో క్రీడలను ప్రారంభించారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ హాకీ పోటీలు
13 జిల్లాల నుంచి 200మంది క్రీడాకారుల రాక -హాకీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి నెల్లూరు(బృందావనం): నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నుంచి నాలుగురోజుల పాటు 7వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ పురుషుల హాకీ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు హాకీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్థానిక వీఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం ఆయన హాకీ టోర్నమెంట్ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. హాకీ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై శేషయ్య, థామస్‌పీటర్ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి బీ చాణక్యరాజ్, టోర్నమెంట్ డైరెక్టర్ జానకిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రథమ స్థానం
నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడారు. క్రీడారంగం అభివృద్ధికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాబిల్లును ప్రవేశపెట్టనుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి ఎస్.అపర్ణకు రూ.2 వేల బహుమతి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ముఖేష్‌కుమార్ లాంటి క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించడానికి రూ.50 వేలను హాకీ అసోసియేషన్‌కు అందజేస్తున్నట్లు ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జట్లకు ఎస్పీ, ఎమ్మెల్సీలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ముఖేష్ కుమార్, అసోసియేట్ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్‌ఖాన్, అసోసియేషన్ అధ్యక్షుడు కొండకింది చినవెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, డీఎస్డీఓ మక్బూల్ అహ్మ తదితరులు పాల్గొన్నారు.