క్రీడలతో బంగారు భవితకు బాటలు
-
హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ముకేష్‌కుమార్ మీనా
-
అట్టహాసంగా రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పురుషుల హాకీ పోటీలు ప్రారంభం
నెల్లూరు(బృందావనం): బాలబాలికలు క్రీడల్లో రాణించి తమ బంగారుభవితకు బాటలు వేసుకోవాలని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులు జరగనున్న ఏడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్స్ పురుషుల అంతర్‌జిల్లాల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. హాకీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో హాకీ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలకు నెల్లూరు వేదిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూ సివిల్ సర్వీస్‌లోకి 25 ఏళ్లక్రితం వచ్చానంటూ తన అనుభవాన్ని వివరించారు. హాకీ స్టిక్స్ పట్టుకున్న క్రీడాకారులను చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తోందని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో సాధించిన పతకాలతో భారతదేశంలో హాకీ క్రీడకు సమానమైన క్రీడ ఏదీ లేదన్నారు.
రాష్ట్రంలో హాకీ ప్రగతికి కృషి
రాష్ట్రంలో హాకీ ప్రగతికి అసోసియేషన్ పరంగా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ముకేష్‌కుమార్‌మీనా వివరించారు. విభజన నేపథ్యంలో క్రీడారంగం మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోందని, రానున్న ఐదేళ్లలో సమస్యను అధిగమించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ విజయబాబు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామ్మూర్తి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, హాకీ నెల్లూరు డిస్ట్రిక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు శేషయ్య, థామస్‌పీటర్, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సనత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
12 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక
పోటీలకు విజయనగరం జిల్లా మినహాయించి 12 జిల్లాలకు చెందిన 240 మంది క్రీడాకారులు, 60 మంది కోచ్‌లు, 15 మంది అఫీషియల్స్ హాజరయ్యారు. తొలుత జాతీయపతాకాన్ని ముకేష్‌కుమార్‌మీనా, రాష్ట్ర క్రీడాపతాకాన్ని నిరంజన్‌రెడ్డి, జిల్లా క్రీడాపతాకాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాజ్యోతిని ముకేష్‌కుమార్‌మీనా వెలిగించి, కపోతాలు, బెలూన్లను ఎగురవేసి బాణసంచా హోరులో క్రీడలను ప్రారంభించారు.