హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రథమ స్థానం
నల్లగొండ టౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. ఆదివారం విజేతలకు బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడారు. క్రీడారంగం అభివృద్ధికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాబిల్లును ప్రవేశపెట్టనుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి ఎస్.అపర్ణకు రూ.2 వేల బహుమతి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడ అయిన హాకీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ముఖేష్‌కుమార్ లాంటి క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించడానికి రూ.50 వేలను హాకీ అసోసియేషన్‌కు అందజేస్తున్నట్లు ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జట్లకు ఎస్పీ, ఎమ్మెల్సీలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ముఖేష్ కుమార్, అసోసియేట్ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్‌ఖాన్, అసోసియేషన్ అధ్యక్షుడు కొండకింది చినవెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, డీఎస్‌డీఓ మక్బూల్ అహ్మ తదితరులు పాల్గొన్నారు.