శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే టై గా ముగియగా.. రెండో వన్డేల్లో భారత జట్టు పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినప్పటికీ అనూహ్య రీతిలో లంక చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఓ చెత్త రికార్డు ముంగిట నిలిచింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత క్రికెట్ జట్టు తొలిసారి లంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది.
అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసిపోగా.. రెండో వన్డేలో రోహిత్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది.
ఆరంభంలోనే సిరాజ్.. ఓపెనర్ పాతుమ్ నిసాంక వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. 40 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టగా.. మిగతా వాళ్లు కూడా ఫర్వాలేదనిపించారు. కమిందు మెండిస్ సైతం 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(64), శుబ్‌మన్ గిల్(35) అదిరిపోయే ఆరంభం అందించారు. కానీ.. ఆ తర్వాత సీన్‌పూర్తిగా మారిపోయింది. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వాండర్సె తన మాయాజాలంతో టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు.10 ఓవర్లలో బౌలింగ్ కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో కాసేపు పోరాడినా.. వాండర్సె స్పిన్ దెబ్బకు భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంక సిరీస్ 1-0తో ముందంజ వేసింది.
ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత.. తొలిసారిగా శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవలేని స్థితిలో టీమిండియా నిలిచింది. మూడో వన్డేలో గెలిస్తే.. సిరీస్ 1-1తో సమం అవుతుంది. లేదంటే 2-0తో సిరీస్ కోల్పోయి 27 ఏళ్ల తర్వాత లంకకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా టీమిండియా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment