ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్ వచ్చే అవకాశం ఉందని దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. ‘ది హండ్రెడ్ లీగ్’లో కోచ్‌గా నిరూపించుకుంటే ఫ్లింటాఫ్‌నకు మార్గం సుగమమైనట్లే అని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ ఆల్‌రౌండర్ పట్ల సుముఖంగా ఉన్నారని బ్రాడ్ తెలిపాడు.
కాగా ఇంగ్లండ్ ఇటీవలి రెండు ఐసీసీ టోర్నీల్లోనూ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ రెండు టోర్నమెంట్లలోనూ సత్తా చాటలేకపోయింది.
ఈ నేపథ్యంలో వన్డే, టీ20 జట్ల హెడ్ కోచ్ మాథ్యూ మాట్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అతడి స్థానాన్ని మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో భర్తీ చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్-2024 సమయంలో కోచింగ్ సహాయక సిబ్బందిలో ఒకడైన మాజీ కెప్టెన్ ఫ్లింటాఫ్‌నకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి.
కాగా ది హండ్రెడ్ లీగ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బెన్ స్టోక్స్ భాగమైన ఈ జట్టును నడిపించే తీరును నిశితంగా గమనించాలని ఇంగ్లండ్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ..
‘‘ఫ్రెడ్డీ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్నందుకు చాలా మంది ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అతడిని ఓ హీరోలా భావిస్తున్నారు. అతడిది గొప్ప క్రికెట్ బ్రెయిన్. ఆట పట్ల అంకితభావం ఉన్నవాడు.
ది హండ్రెడ్ లీగ్ రూపంలో కోచ్‌గా తనను తాను నిరూపించుకునే అవకాశం అతడికి దక్కింది. ఇంటర్నేషనల్ కోచ్‌గా ఎదిగేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి కోసం ఓ ఆడిషన్‌లా ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వస్తే ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా 46 ఏళ్ల ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో.. 3845, 3394, 76 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 226, వన్డేల్లో 169, టీ20లలో 5 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment