సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ | France in the semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో ఫ్రాన్స్‌

Published Sun, Jul 7 2024 4:17 AM | Last Updated on Sun, Jul 7 2024 4:17 AM

France in the semifinals

షూటౌట్‌లో పోర్చుగల్‌పై విజయం 

యూరో కప్‌ ఫుట్‌బాల్‌ 

హాంబర్గ్‌: యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ‘షూటౌట్‌’ ద్వారా మరో మాజీ విజేత పోర్చుగల్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిశాక కూడా ఇరు జట్లు 0–0తో సమంగా నిలవగా షూటౌట్‌ అనివార్యమైంది. 

ఇందులో ఫ్రాన్స్‌ 5–3తో పోర్చుగల్‌పై విజయం సాధించింది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో తన జాతీయ జట్టు తరఫున ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. ఆరో సారి యూరో కప్‌లో బరిలోకి దిగిన రొనాల్డో ముందే ఇది తనకు చివరి యూరో అని ప్రకటించాడు. 2026 వరల్డ్‌ కప్‌లో 41 ఏళ్లు ఉండే అతను వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు!  

పేరుకు రెండు పెద్ద జట్లే అయినా ఈ క్వార్టర్స్‌ పోరు పెద్దగా ఉత్కంఠ, మలుపులు లేకుండా సాగింది. ఇరు జట్లూ కూడా డిఫెన్స్‌కే ప్రాధాన్యనివ్వడంతో ఆటలో వేగం కనిపించలేదు. అటు రొనాల్డో, ఇటు ఎంబాపె కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పోర్చుగల్‌ ప్లేయర్లలో బ్రూనో ఫెర్నాండెజ్, వితిన్హ కొట్టిన షాట్‌లను ప్రత్యర్థి గోల్‌కీపర్‌ మైక్‌ మెగ్నన్‌ నిలువరించగా...ఫ్రాన్స్‌ ఆటగాళ్లు రాండల్, కామవింగాలకకు గోల్స్‌ అవకాశం వచి్చనా కీపర్‌ రూబెన్‌ డయాస్‌ను దాటి బంతి వెళ్లలేకపోయింది. 

అదనపు సమయంలో రొనాల్డో కొట్టిన ఒక కిక్‌ కూడా గోల్‌ బార్‌ మీదనుంచి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు జాగ్రత్తగానే ఆడాయి. షూటౌట్‌లో తొలి నాలుగు ప్రయత్నాల్లో ఫ్రాన్స్‌ తరఫున డెంబెలె, ఫొఫానా, కౌండే, బార్కొలా గోల్స్‌ కొట్టగా...పోర్చుగల్‌ తరఫున రొనాల్డో, బెర్నార్డో సిల్వ, న్యూనో మెండెస్‌ గోల్‌ సాధించగా జోవో ఫెలిక్స్‌ విఫలమయ్యాడు. దాంతో స్కోరు ఫ్రాన్స్‌ పక్షాన 4–3తో నిలిచింది. 

ఐదో షాట్‌ను కూడా ఫ్రాన్స్‌ ప్లేయర్‌ హెర్నాండెజ్‌ గోల్‌ సాధించి తమ జట్టును గెలిపించాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ 2–1 తేడాతో ఆతిథ్య జర్మనీని ఓడించింది.  శనివారం జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ షూటౌట్‌లో 5–3తో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్‌ చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement