టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో ఒకే కేటగిరీలో వరుసగా మూడు స్వర్ణాలు గెలిచిన రెండో జూడో ప్లేయర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాలని ఆశించిన ఫ్రాన్స్ దిగ్గజ ప్లేయర్ టెడ్డీ రైనర్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లస్ 100 కేజీల విభాగంలో 32 ఏళ్ల టెడ్డీ రైనర్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన ప్లస్ 100 కేజీల క్వార్టర్ ఫైనల్లో రష్యా ప్లేయర్ తమెర్లాన్ బషయెవ్ చేతిలో టెడ్డీ ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన క్రీడాకారుల మధ్య రెపిచేజ్ పద్ధతిలో కాంస్యం కోసం పోటీ జరిగింది. ఇందులో టెడ్డీ ఆడిన రెండు బౌట్‌లలో గెలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు.
10 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు వరుసగా 152 బౌట్‌లలో విజయాలు సాధించిన రికార్డు టెడ్డీ సొంతం. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 140 కేజీల బరువున్న టెడ్డీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి ... 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం స్వర్ణాలు సాధించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో (1996, 2000, 2004) ఒకే వెయిట్ కేటగిరీలో స్వర్ణ పతకాలు గెలిచిన ఏకైక జూడో ప్లేయర్‌గా తడహిరో (60 కేజీలు–జపాన్) ఘనత వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment