judo player
-
డోపింగ్‌లో పట్టుబడ్డ అఫ్గానిస్తాన్ జూడో ప్లేయర్
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన జూడో ఆటగాడు మొహమ్మద్ సమీమ్ ఫైజాద్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతన్ని అఫ్గాన్ జట్టు నుంచి తప్పించారు. 81 కేజీల కేటగిరీలో తొలి బౌట్లో పాల్గొన్న సమయంలోనే 22 ఏళ్ల ఫైజాద్ నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. అనంతరం ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆధ్వర్యంలోని ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిం ది. పారిస్ క్రీడల్లో పట్టుబడిన మూడో డోపీ సమీమ్ ఫైజాద్. ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల బృందంతో అఫ్గాన్ ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటుంది. -
Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం
బర్మింగ్‌హామ్: ఎనిమిదేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈ సారి స్వర్ణంగా మార్చాలని బరిలోకి దిగిన భారత జూడో ప్లేయర్ సుశీలా దేవికి నిరాశే ఎదురైంది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బూ విజయం సాధించింది. గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది. బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 3–0తో సింగపూర్‌ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో మలేసియాపైనే నెగ్గి భారత్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. సింగపూర్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–11, 21–12తో యాంగ్ కాయ్–లియాంగ్ క్వెక్‌లపై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21–11, 21–12తో జియా మిన్ యోను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యంలో నిలిపింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–18, 21–15తో ప్రపంచ చాంపియన్ కీన్ యె లోపై నెగ్గి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’ పురుషుల హాకీలో ఇంగ్లండ్‌తో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 4–4తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (3వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్(46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మన్దీప్ (13వ, 22వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. సెమీస్‌లో సౌరవ్ పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–5, 8–11, 11–7, 11–3తో గ్రెగ్ లాబన్ (స్కాట్లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జోష్నా చినప్ప 9–11, 5–11, 13–15తో హోలీ నాటన్ (కెనడా) చేతిలో ఓడిపోయింది. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో భారత ప్లేయర్ ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది. -
Commonwealth Games: మరో రెండు పతకాలు ఖాయం చేసుకున్న భారత్
కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. జూడో 48 కేజీ విభాగంలో భారత అథ్లెట్ సుశీలా దేవి లిక్మాబమ్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మారిషస్‌కు చెందిన ప్రిస్సిల్లా మోరాండ్పై సుశీలా దేవి విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఒక వేళ ఫైనల్లో సుశీలా దేవి దేవి ఓటమి చెందిన రజత పతకమైన భారత్ ఖాతాలో చేకూరుతుంది. మరో వైపు లాన్ బౌల్స్ క్రీడలో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 16-13తో ఓడించింది. తత్వారా కామన్ వెల్త్ గేమ్స్‌లో మరో పతకం భారత్ ఖాతాలో చేరనుంది. కాగా లాన్ బౌల్స్ క్రీడలో భారత్ తొలి సారి పతకం సాధించబోతుండడం గమనార్హం. ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో ఇప్పటికే ఆరు పతకాలు ఉన్నాయి. వాటిలో మూడు గోల్డ్ మెడల్స్, రెండు రజత పతకాలు, ఒక్క కాంస్య పతకం ఉంది. కాగా ఇప్పటి వరకు భారత అథ్లెట్లు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. చదవండి: Mirabai Chanu: ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయిన మీరాబాయి తల్లి! వీడియో వైరల్ -
టెడ్డీ రైనర్‌కు షాక్
టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో ఒకే కేటగిరీలో వరుసగా మూడు స్వర్ణాలు గెలిచిన రెండో జూడో ప్లేయర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాలని ఆశించిన ఫ్రాన్స్ దిగ్గజ ప్లేయర్ టెడ్డీ రైనర్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లస్ 100 కేజీల విభాగంలో 32 ఏళ్ల టెడ్డీ రైనర్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన ప్లస్ 100 కేజీల క్వార్టర్ ఫైనల్లో రష్యా ప్లేయర్ తమెర్లాన్ బషయెవ్ చేతిలో టెడ్డీ ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన క్రీడాకారుల మధ్య రెపిచేజ్ పద్ధతిలో కాంస్యం కోసం పోటీ జరిగింది. ఇందులో టెడ్డీ ఆడిన రెండు బౌట్లలో గెలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. 10 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు వరుసగా 152 బౌట్లలో విజయాలు సాధించిన రికార్డు టెడ్డీ సొంతం. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 140 కేజీల బరువున్న టెడ్డీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి ... 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం స్వర్ణాలు సాధించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో (1996, 2000, 2004) ఒకే వెయిట్ కేటగిరీలో స్వర్ణ పతకాలు గెలిచిన ఏకైక జూడో ప్లేయర్‌గా తడహిరో (60 కేజీలు–జపాన్) ఘనత వహించాడు. -
జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సమీపంలోని బిలాస్పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక అత్యాచారానికి పాల్పడిందని నిందితులని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. క్రీడాకారిణిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఘటనలో ఇద్దరు నేపాలీ యువతులు అత్యాచారానికి గురయ్యారు. సౌదీ అరేబియా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఆ బాధిత మహిళలు కేసు నమోదు చేశారు. డీఎల్ఎఫ్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బాధితులు అక్కడ ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తమపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో బాధిత యువతులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.