బర్మింగ్‌హామ్: ఎనిమిదేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈ సారి స్వర్ణంగా మార్చాలని బరిలోకి దిగిన భారత జూడో ప్లేయర్ సుశీలా దేవికి నిరాశే ఎదురైంది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బూ విజయం సాధించింది.
గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి.
కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది.
బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్
డిఫెండింగ్ చాంపియన్ భారత్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 3–0తో సింగపూర్‌ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో మలేసియాపైనే నెగ్గి భారత్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. సింగపూర్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–11, 21–12తో యాంగ్ కాయ్–లియాంగ్ క్వెక్‌లపై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21–11, 21–12తో జియా మిన్ యోను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యంలో నిలిపింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–18, 21–15తో ప్రపంచ చాంపియన్ కీన్ యె లోపై నెగ్గి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
పురుషుల హాకీలో ఇంగ్లండ్‌తో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 4–4తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (3వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్(46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మన్‌దీప్ (13వ, 22వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు.
సెమీస్‌లో సౌరవ్
పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–5, 8–11, 11–7, 11–3తో గ్రెగ్ లాబన్ (స్కాట్లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జోష్నా చినప్ప 9–11, 5–11, 13–15తో హోలీ నాటన్ (కెనడా) చేతిలో ఓడిపోయింది. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో భారత ప్లేయర్ ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment