
భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు పయనమైంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో మొత్తం టీమ్ సభ్యులు శుక్రవారం ముంబై విమానశ్రాయం నుంచి లండన్‌కు బయలు దేరారు. అక్కడకి వెళ్లాక పది రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది.
జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఈ రెడ్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా లండన్ విమానం ఎక్కేముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం భారత జట్టుకు కీలకం కానుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
"కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అది దేశవాళీ క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యత. యువ ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. డిమాస్టిక్ క్రికెట్‌లో మీరు అత్యున్నత ప్రదర్శన ఇస్తున్నన్ని రోజులు మీకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
ఈ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం జట్టుకు ఎంతోగానే ఉపయోగపడనుంది. కౌంటీ క్రికెట్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్ కూడా అతడికి ఉంది. కౌంటీల్లో కూడా పరుగులు సాధించాడు. అక్కడి పరిస్థితులు అతడికి బాగా తెలుసు. ఇప్పుడు ఇండియా-ఎ తరపున కూడా సెంచరీ చేశాడు.
ఇటువంటి పర్యటనలకు మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆటగాళ్లు ఫామ్‌ను ఒకటి లేదా రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా అంచనా వేయాలనుకోవడం లేదు. ఎవరైతే నిలకడగా పరుగులుసాధిస్తారో, వారు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రాణించగలరు అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.
కాగా కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారించాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.