బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణం కేసులో నలుగురు భారత క్రికెటర్లకు గుజరాత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) సమన్లు పంపింది. వారిలో టీమిండియా ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, రాహుల్ తెవాటియా ఉన్నారు. వీరు నలుగురూ ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు గుజరాత్ సిఐడి సమన్లు పంపింది. త్వరలోనే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి కోటి మధ్య ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ముగిసిన అనంతరం గిల్ విచారణకు హాజరు కానున్నాడు. అయితే మిగితా ముగ్గురు ఆటగాళ్లు భారత్‌లోనే ఉండడంతో గిల్ కంటే ముందు విచారణకు హాజరు అయ్యే అవకాశముంది.
ఏంటీ బీజడ్ గ్రూపు స్కామ్?
గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ చెందిన భూపేంద్రసిన్హ్ జాలా.. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజడ్ ట్రేడర్స్ కంపెనీలను స్దాపించాడు. ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలను గుజరాత్‌లోని పలు జిల్లాల్లో విస్తరించాడు. ఈ కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రజలను నమ్మించారు.
అంతేకాకుండా బహుమతులను ప్రకటించి పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించారు. ఉదాహరణకు వారి కంపెనీలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే 32 ఇంచ్ టీవీ, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్స్ వంటి గిప్ట్ ప్యాకేజిలను బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసింది.
దీంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకమని, మోసపోయాయని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో భూపేంద్రసిన్హ్ జాలాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసును సిఐడీ అప్పగించారు.
తొలుత భూపేంద్రసిన్హ్ రూ. 6000 కోట్ల చిట్-ఫండ్ మోసానికి పాల్పడ్డారని నివేదించిన గుజరాత్ సీఐడీ.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 450 కోట్లగా ఖారారు చేసింది. అయితే పోలీసుల విచారణలో గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, తెవాటియా సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నలుగురుకు సిఐడి సమన్లు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment