
భారత కెప్టెన్ రోహిత్ శర్మతో సంజూ శాంసన్ (PC: BCCI)
‘టీమిండియాలో ప్రస్తుతం తగినన్ని అవకాశాలు పొందలేకపోతున్న ఆటగాళ్లలో తనూ ఒకడు.. అబ్బే అదేం లేదు! ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే మళ్లీ సెలక్టర్ల పిలుపు అందుకోలేకపోతున్నాడు’.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ గురించి క్రికెట్ వర్గాల్లో తరచూ జరిగే చర్చలు.
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఆరేళ్ల తర్వాత గానీ అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా మాత్రమే అవకాశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై అతడి అభిమానులు సహా మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023లో సంజూకు చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. మెరుగైన గణాంకాలు ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను కాదని.. టీ20 నంబర్ వన్ సూర్యకుమార్ యాదవ్‌ను మెగా ఈవెంట్‌కు సెలక్ట్ చేయడాన్ని వ్యతిరేకించారు.
ఇలా టీమిండియా సెలక్టర్లు తనను పక్కనపెట్టినా సంజూ శాంసన్ మాత్రం దేశవాళీ క్రికెట్లో ఆడుతూ.. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గానూ రాణిస్తున్నాడు. రెండేళ్ల క్రితం జట్టును ఫైనల్ చేర్చిన సంజూ.. గత సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ కూడా చేర్చలేకపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శనతో రాజస్తాన్ రాయల్స్‌ను టైటిల్ రేసులో నిలుపుతానంటున్నాడు.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో స్టార్ నహీ ఫార్‌లో మాట్లాడుతూ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అవకాశాల గురించి చెబుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ జట్టుకు ఆడటం గొప్ప విషయం.
ఇండియా ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్. ఈ దేశంలో ఆటగాళ్లకు ముఖ్యంగా ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదవలేదు. ఇక్కడ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి.
కేరళ నుంచి వచ్చిన ఓ కుర్రాడు టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే అందరి కంటే తను మరింత ప్రత్యేకం అని నిరూపించుకోవాల్సి ఉంటుంది’’ అని సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. జాతీయ జట్టులో అంత సులభంగా అవకాశాలు రావని పేర్కొన్నాడు.
కాగా టీమిండియాలో ముంబై, గుజరాత్ ఆటగాళ్లదే హవా అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్ నుంచి ఇటీవల అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ముంబై నుంచి రాగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి వాళ్లు గుజరాత్ నుంచి విచ్చేశారు.
ఇదిలా ఉంటే.. తన బ్యాటింగ్ శైలి గురించి సంజూ శాంసన్ ప్రస్తావిస్తూ.. తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఒక్క సిక్స్ కొట్టడానికి పది బంతుల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని భావిస్తానని తెలిపాడు. పవర్ హిట్టర్‌గా తనను తాను మలచుకునేందుకు ఈ ఆటిట్యూడ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకానుండగా.. మార్చి 24న రాజస్తాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి ఆయా ఫార్మాట్లలో 510, 374 పరుగులు సాధించాడు. ఇందులో ఓ వన్డే సెంచరీ ఉంది. ఐపీఎల్‌లో మొత్తంగా 152 మ్యాచ్‌లలో 3888 పరుగులు చేసిన సంజూ ఖాతాలో మూడు శతకాలు ఉండటం విశేషం.