Hanuma Vihari: బా‘బోరు’ అంతే!.. మావాళ్లు చేస్తే పడుండాలి అనే టైపు! | Sakshi
Sakshi News home page

Hanuma Vihari: బా‘బోరు’ అంతే!.. మావాళ్లు చేస్తే పడుండాలి అనే టైపు!

Published Tue, Feb 27 2024 5:42 PM

Hanuma Vihari: How Yellow Media Once Defame Him - Sakshi

ప్రపంచంలో ఎక్కడ.. ఏ మూలన జరిగే విషయమైనా తనకు పనికి వస్తుందనుకుంటే వెంటనే రాగం అందుకుని సాగదీయడం చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్న మాట రాజకీయవర్గాల్లో తరచూ వినిపిస్తుంది. మంచి జరిగితే ఆ క్రెడిట్‌ కొట్టేసేందుకు ఆయన ఎంత ‘దూరమైనా’ వెళ్తారంటారు.

టీమిండియా క్రికెటర్‌, ఆంధ్ర రంజీ జట్టుకు ఆడబోనంటూ ఆరోపణలు చేసిన హనుమ విహారి విషయంలోనూ బాబు అదే పంథాను అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. ‘‘హనుమ విహారిని వేధించారు.. మేము అతడికి అండగా ఉంటాం’’.. అంటూ... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు... తాము అధికారంలోకి వస్తే విహారికి రెడ్‌కార్పెట్‌ పరిచి మరీ ఆహ్వానిస్తామంటూ ఆయన కుమారుడు లోకేశ్‌ సానుభూతి ఒలకబోస్తున్నారు.

టార్చర్‌ పెట్టారు.. అప్పుడే మర్చిపోయారా?
అధికారంలోకి వస్తే.. అని మాట్లాడుతున్న లోకేశ్‌, చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో.. తమ పార్టీ హనుమ విహారిని వేధించిన తీరును మర్చిపోయినట్లున్నారు. కేవలం ఆటకే పరిమితం కాకుండా హనుమ విహారి ఫౌండేషన్‌ పేరిట కార్యక్రమాలు చేస్తుంటే.. దానిని తమకు ఆపాదించుకుని.. ఆపై విహారే స్వయంగా తమకు క్షమాపణలు చెప్పేలా టార్చర్‌ పెట్టిన తీరు వాళ్లకు గుర్తున్నట్లు లేదు.

కులం పేరిట విహారిని వివక్షకు గురిచేసి, వ్యక్తిగతంగానూ అతడి ప్రతిష్టను దిగజార్చి ఫౌండేషన్‌ మూయించేసిన టీడీపీ పెద్దలు ఇప్పుడేమో అతడి పట్ల సానుభూతి ప్రదర్శించడం గమనార్హం. అది కూడా తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ..పైగా అతడికేదో మేలు చేస్తామంటూ మొసలి కన్నీళ్లు కార్చడం దౌర్భాగ్యం.

గతంలో ఏం జరిగింది?
2021లో తిరుపతిలో వర్షాల నేపథ్యంలో వరదలో చిక్కుకున్న ప్రజలకు విహారి ఫౌండేషన్‌ పాలు, బ్రెడ్‌ సహా పలు ఆహార పదార్థాలు పంపిణీ చేసింది. తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ప్రయత్నించింది.

అయితే, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్‌ ట్రస్టు టీ షర్ట్స్ వేసుకుని కనిపించడంతో.. ఇక టీడీపీ సోషల్‌ మీడియా రెచ్చిపోయింది. ప్రభుత్వంపై బురద జల్లే క్రమంలో విహారి ఫౌండేషన్‌ చేస్తున్న కార్యక్రమాన్ని బాబోరి ఖాతాలో వేసేసింది. 

ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందిస్తాయన్న విషయాన్ని.. అది కూడా పక్కోళ్లు చేసిన సాయానికి క్రెడిట్‌ తీసుకోవాలని స్కెచ్‌ వేసింది. సోషల్‌ మీడియాలో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది.

టీడీపీ, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ సాయం కాదిది
ఈ విషయాన్ని గమనించిన విహారి ఫౌండేషన్‌.. ‘‘19- నవంబరు-2021న తిరుపతిలో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలకి టీడీపీకి గానీ, ఎన్టీఆర్‌ ట్రస్టుకు గానీ ఎలాంటి సంబంధం లేదు.

మాతో పాటు వచ్చిన రవి, లోకేష్‌ అని ఇద్దరు వాలంటీర్స్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ టీ-షర్ట్స్‌ వేసుకుని ఉన్నారు. అంతమాత్రాన ఇది మీరు చేసినట్లు కాదు కదా?’’ అని టీడీపీ క్యాంపునకు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది.

కేవలం రూ. 3500 బ్రెడ్‌ ఇచ్చి దానకర్ణుడిలా బిల్డప్పా అంటూ
దీంతో బాబోరి బ్యాచ్‌కు కోపమొచ్చి.. ‘‘రవి, లోకేశ్‌ వాలంటీర్లు కాదు. ఎన్టీఆర్‌ ట్రస్టు ఉద్యోగులు. అయినా హనుమ విహారి ఫౌండేషన్‌ కేవలం రూ. 3500 విలువ చేసే బ్రెడ్‌ను మాత్రమే ప్రజలకు అందించింది. కానీ మేము రూ. 3 లక్షలు అందించాం’’ అంటూ విహారి సేవలను తక్కువ చేసేలా పోస్ట్‌ పెట్టింది.

ఈ నేపథ్యంలో విహారి, అతడి ఫౌండేషన్‌ను ట్రోల్‌ చేస్తూ ఫౌండేషన్‌తో వ్యాపారం చేస్తున్నావా? కుల రాజకీయాలకు పాల్పడుతున్నావా అని తమ బుద్ధులను ఆపాదిస్తూ కించపరిచింది. ట్రోల్స్‌ స్థాయి శ్రుతి మించడంతో విహారి తట్టుకోలేకపోయాడు.

కుల వివక్షకు గురిచేశారు
‘‘మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు కానీ రాజకీయ ఉద్దేశాలు కానీ లేవు. జరిగింది ఒక సమాచార లోపం. గత 24 గంటల్లో అతి తీవ్రమైన వ్యక్తి దూషణలకి, మరియు కుల వివక్షకు గురి అయ్యాము. గత 6 నెలల్లో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవ కార్యక్రమాలు చేసాము.

ఇక ముందు మేము ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం లేదు. ధన్యవాదాలు’’ అంటూ తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విహారి ఫౌండేషన్‌ ప్రకటించింది. బాబూ మీకో దండం అన్నట్లు విధిలేక క్షమాపణలు కూడా చెప్పింది.

తానా అంటే తందాన
అదండీ సంగతి.. పక్కోళ్ల క్రెడిట్‌ కొట్టేయడమే గాకుండా.. పైగా వాళ్లనే బోడి సాయం అన్న చందంగా కించపరిచి... అయినా అహం చల్లారక కుల వివక్ష చూపుతూ ట్రోల్‌ చేసి ఫౌండేషన్‌ను మూసివేయించింది పచ్చ బ్యాచ్‌. నలుగురికి అందే ఆ సాయమేదో అందకుండా చేసి పైశాచిక ఆనందం పొందింది.

ఇప్పుడేమో హనుమ విహారి ఏవో రాజకీయాలంటూ స్పష్టమైన కారణం చూపకుండా ఆంధ్ర జట్టుకు ఆడనంటే.. అతడిపై సానుభూతి ప్రదర్శించే నాటకాన్ని రక్తికట్టించే పనిలో పడింది. ఇక టీడీపీ బాస్‌కు తానా అంటే తందానా అని భజన చేసే యెల్లో మీడియా అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ గుండెలు బాదుకుంటోంది! అట్లుంటది మరి బా‘బోరు’.. ఆయన బ్యాచ్‌ పని(ప్రచార)తనం!!

చదవండి: ఇంకేంటి విహారి?!.. అన్నీ నువ్వే చెప్తే ఎలా? ఆ కోతులకేమో కొబ్బరి చిప్ప!

Advertisement

తప్పక చదవండి

Advertisement