సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ రికీ భుయ్ (38 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (38 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్ (51 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్ టెండూల్కర్ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్ భరత్ ధనాధన్ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్ హెబర్ (13), షేక్ రషీద్ (8) విఫలం కాగా... భరత్, భుయ్ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment