అహ్మదాబాద్: తండ్రి మరణం పట్ల టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆయన లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని పేర్కొన్నాడు. జీవితంలో తన తండ్రి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం అత్యంత కఠినమైనదని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటోతోపాటు భావోద్వేగ పోస్టు చేశాడు. ‘నాన్నా.. నువ్ నా హీరో. నువ్ ఇక లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మీరు వదిలి వెళ్లిన ఎన్నో మధుర జ్ఞాపకాలను, మీ నవ్వును ఎప్పుడూ మరువం నాన్నా. అన్నయ్య, నేను ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మీరే. మీ కష్టం, మీపై మీకున్న నమ్మకం మీ కలల్ని నిజం చేసింది. మీ లేమితో ఈ ఇంటికి కళ తప్పింది. మిమ్మల్నెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం. మీ పేరు నిలబెడతాం. మీరు ఎక్కడున్నా మమ్మల్ని కనిపెడుతూనే ఉంటారని ఆశిస్తున్నా. మమ్మల్ని చూసి మీరు గర్వపడ్డారు. కానీ, మీ ఆదర్శవంతమైన జీవన ప్రయాణం చూసి మేమంతా గర్విస్తున్నాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా కింగ్. ప్రతిరోజు ప్రతి గడియా మిమ్మల్ని మిస్ అవుతా. లవ్ యూ డాడీ!!’ అని పాండ్యా పేర్కొన్నాడు.!
(చదవండి: శార్దూల్, వషీ జబర్దస్త్; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్)
కాగా, భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ సంతాపం తెలియజేశారు.
(చదవండి: నేను ఇలాగే ఆడతా : రోహిత్ శర్మ)
Comments
Please login to add a commentAdd a comment