సాక్షి, హైదరాబాద్: ఆరువారాల్లో రూ.17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర, చరాస్తులపై థర్డ్ పారీ్టకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్‌సీఏకు సూచించింది.
తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ అడ్మినిస్టేటర్, జస్టిస్ ఎల్.నాగేశ్వర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన ఆ అటాచ్‌మెంట్లు రద్దు చేయాలని కోరారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ.శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్‌సీఏ తరఫున సీనియర్ న్యాయవాది రాజాశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ వేరొక చోట ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిందన్నారు.
దాని ఫలితంగా అటాచ్‌మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున సీనియర్ న్యాయవాది సునీల్ వాదనలు వినిపిస్తూ.. 2016లో మధ్యవర్తిత్వ తీర్మానం ఆమోదించగా, ఏడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని.. విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించకుండా ఉండేందుకు హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విశాఖ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పులో భాగంగా హెచ్‌సీఏ రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment