చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్‌.. సరికొత్త రికార్డు | HISTORY CREATED BY SREE CHARANI | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్‌.. సరికొత్త రికార్డు

Sep 29 2026 2:31 PM | Updated on Sep 29 2026 3:05 PM

HISTORY CREATED BY SREE CHARANI

source: BCCI X

భారత యువ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీ చరణి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త మైలురాయిని అందుకుంది. తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 817 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీ చరణి ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు (817) సాధించిన బౌలర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్‌ పేసర్‌ మెగాన్‌ షట్‌ (806) రికార్డును బద్దలు కొట్టింది. శ్రీ చరణి షట్‌ కంటే 11 పాయింట్లు ఎక్కువగా సాధించింది. ఏషియన్‌ గేమ్స్‌లో అద్భుతంగా రాణించడంతో శ్రీ చరణి రేటింగ్‌ పాయింట్లు పెరిగాయి. ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ స్వర్ణం గెలవడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించింది.

టాప్‌-5లోకి మంధాన
మరోవైపు భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్‌-5లోకి ప్రవేశించింది. ఏషియన్‌ గేమ్స్‌ ఫైనల్లో శ్రీలంకపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ (46 బంతుల్లో 79 పరుగులు) ఆమెను టాప్‌-5లోకి ప్రవేశించేలా చేసింది. మంధాన కూడా ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ స్వర్ణం సాధించడంలో కీలకంగా వ్యవహరించింది.

భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కూడా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. శ్రీలంకతో ఫైనల్లో 22 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసిన ఆమె తాజా ర్యాంకింగ్స్‌లో 25వ స్థానానికి చేరుకుంది.

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ప్లేయర్ల పురోగతి
బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ షర్మిన్‌ అక్తర్‌ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 35వ స్థానంలో నిలిచింది.

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో పాక్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నష్రా సంధు తిరిగి టాప్‌-10లోకి వచ్చింది. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ నహిదా అక్తర్‌, పాకిస్థాన్‌ ఉమ్‌-ఎ-హానీ, భారత్‌కు చెందిన క్రాంతి గౌడ్‌ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.

హేలీ మాథ్యూస్‌ జోరు
బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో జరిగిన ఐసీసీ వుమెన్స్‌ ఛాంపియన్‌షిప్‌ సిరీస్‌లో మాథ్యూస్‌ ఓ మ్యాచ్‌లో 182 పరుగులు చేసింది. ఇది వెస్టిండీస్‌ మహిళా క్రికెటర్‌ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచింది.

ఇదీ చదవండి: పరువు కాపాడుకునే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement