Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్‌ చేతిలో తప్పని ఓటమి | Hong Kong Sixes 2024: Pakistan Beat India By 6 Wickets Check Details | Sakshi
Sakshi News home page

Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్‌ చేతిలో తప్పని ఓటమి

Nov 1 2024 9:30 PM | Updated on Nov 1 2024 9:46 PM

Hong Kong Sixes 2024: Pakistan Beat India By 6 Wickets Check Details

PC: X

హాంగ్‌కాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా రాబిన్‌ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.

కాగా 1992లో మొదటిసారిగా హాంకాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీ నిర్వహించగా.. 2017 వరకు కొనసాగింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2023 వరకు బ్రేక్‌ పడగా.. ఈ ఏడాది తిరిగి మళ్లీ మొదలైంది. ఇండియా, సౌతాఫ్రికా, ఆతిథ్య హాంగ్‌కాంగ్‌, న్యూజిలాండ్‌, నేపాల్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఒమన్‌ తదితర 12 జట్లు ఈసారి పోటీలో దిగాయి.

భారత బ్యాటర్ల విధ్వంసం
ఈ క్రమంలో శుక్రవారం టోర్నీ ఆరంభం కాగా.. ఇండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. రాబిన్‌ ఊతప్ప కెప్టెన్సీలోని భారత జట్టు.. నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఊతప్పతో పాటు.. భరత్‌ చిప్లీ రాణించాడు. 

ఊతప్ప ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేయగా.. భరత్‌ చిప్లీ 16 బంతుల్లోనే 53 రన్స్‌ చేశాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నందున నిబంధనల ప్రకారం రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

తప్పని ఓటమి
అయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని పాకిస్తాన్‌ సులువుగానే ఛేదించింది. ఆసిఫ్‌ అలీ 14 బంతుల్లో 55 పరుగులు చేయగా.. మహ్మద్ అఖ్లాక్‌ 12 బంతుల్లోనే 40 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికి తోడుగా కెప్టెన్‌ ఫహిమ్‌ ఆష్రఫ్‌ 5 బంతుల్లోనే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎక్స్‌ట్రా రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ భారత జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

భారత్: 
రాబిన్ ఊతప్ప (కెప్టెన్), కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, స్టువర్ట్ బిన్నీ, శ్రీవత్స్ గోస్వామి, భరత్ చిప్లీ, షాబాజ్ నదీమ్.

పాకిస్తాన్‌:
ఫహీమ్ అష్రఫ్ (కెప్టెన్), మహ్మద్ అఖ్లాక్, ఆసిఫ్ అలీ, డానిష్ అజీజ్, హుస్సేన్ తలాత్, అమీర్ యామిన్, షహబ్ ఖాన్.

స్కోర్లు: 
భారత్‌- 119/2
పాకిస్తాన్‌- 121/0
ఫలితం: భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో పాక్‌  విజయం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement