హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 7 పాయింట్లు సంపాదించింది. చామా మిలింద్ సారథ్యంలో ఈ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టుకు ఇద్దరు స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి తమ ప్రదర్శనతో విజయాన్ని కట్టబెట్టారు.
ఫాలోఆన్ ఆడుతూ ఆఖరి రోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ జట్టు వన్డే తరహాలో ఆడి 45.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 118 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ గంగం అనికేత్ రెడ్డి 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.
హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభం అరోరా (72 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... అంకిత్ కాల్సి (39 బంతుల్లో 44; 6 ఫోర్లు), వైభవ్ అరోరా (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్ల తీసిన అనికేత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.
రెండు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించి... రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నాగ్‌పూర్‌లో ఈనెల 30 నుంచి జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో విదర్భ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment