వామ్మో.. ఒక్క ఫొటోతో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న రవిశాస్త్రి! | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఒక్క ఫొటోతో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న రవిశాస్త్రి!

Published Wed, Apr 10 2024 3:33 PM

I Am Naughty: Ravi Shastri Post Breaks Internet Pics Goes Viral - Sakshi

టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెటర్‌గా తనకంటూ గుర్తింపు పొందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ వ్యాఖ్యానం చేయడంలో రవిశాస్త్రి దిట్ట. ఇక సోషల్‌ మీడియాలో ఈ ‘61 ఏళ్ల కుర్రాడు’ చురుగ్గా ఉంటాడు. తాజాగా ఎక్స్‌.కామ్‌లో అతడు షేర్‌ చేసిన ఫొటో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

మిమ్మల్ని ఆకర్షించేలా ఉన్నానా?
నావీ బ్లూ నైట్‌ సూట్‌లో స్టైలిష్‌ ఫోజులతో ఫొటోలు దిగిన రవిశాస్త్రి.. ‘‘నేను హాటీ.. నేను నాటీ.. నేను సిక్స్టీ’’ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉన్న మరో ఫొటోకు ‘‘మిమ్మల్ని నా వైపు ఆకర్షించేలా ఉన్నానా’’ అంటూ వేరే లెవల్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘‘ఫిట్‌గా ఉండే టీమిండియా కుర్రాళ్లు కూడా ఒక్క ఫొటోతో ఇలాంటి మాయ చేయలేకపోయారు. కానీ అరవై ఏళ్ల రవిశాస్త్రి అయ్య బాబోయ్‌ అనిపిస్తున్నాడు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైనా యాడ్‌ షూట్‌ కోసం ఇలా ఫోజులు ఇచ్చి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. లేదంటే రవిశాస్త్రి అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందేమో అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

80లలో టీమిండియాలోకి వచ్చిన ముంబైకర్‌
మే 27, 1962లో ముంబైలో జన్మించిన రవిశాస్త్రి.. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌లో సత్తా చాటాడు. 17 ఏళ్ల వయసులో నాటి బాంబే రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. తన నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఆ మరుసటి ఏడాది టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న రవిశాస్త్రి.. 1981లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. దాదాపు పదకొండేళ్లపాటు కెరీర్‌ కొనసాగించి.. భారత్‌ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3830, 3108 పరుగులు సాధించాడు రవిశాస్త్రి.

కోచ్‌గా ప్రస్థానం
2014లో టీమిండియా డైరె​క్టర్‌గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. వీరిద్దరి నేతృత్వంలో ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ గెలిచింది. 

అదే విధంగా నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించింది. వన్డే వరల్డ్‌కప్‌-2019లో సెమీ ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీ తర్వాత రెండేళ్ల పాటు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి 2021లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: ముంబైకి గుడ్‌బై.. ఎవరూ ఊహించని జట్టులో చేరనున్న రోహిత్‌ శర్మ?!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement