
సర్ఫరాజ్ ఖాన్- ముషీర్ ఖాన్ బ్యాటింగ్‌పై ఐసీసీ వీడియో (PC: ICC Instagram Grab)
భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్ తరఫున ఒకేరోజు వేర్వేరు ఫార్మాట్లలో శతకాలు బాదిన ఈ అన్నాదమ్ముళ్లు.. ఎప్పటికప్పుడు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్, ముషీర్‌ల అర్హతకు తగినట్లుగా బీసీసీఐ అవకాశాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముంబై ఆటగాళ్ల బ్యాటింగ్ శైలిని పోలుస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి వీడియో షేర్ చేయడం విశేషం.
‘‘మా అన్నయ్య.. నేనూ ఒకే తరహాలో బ్యాటింగ్ చేస్తాం’’ అంటూ ముషీర్ ఖాన్ మాట్లాడుతున్న దృశ్యాలను తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఐసీసీ.. నీలం రంగు జెర్సీలో అన్నాదమ్ముళ్లు బ్యాట్ ఝలిపించిన తీరును కొనియాడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంలో బీసీసీఐ కంటే ఐసీసీ బెటర్‌గా ఉందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం.. ముషీర్ కచ్చితంగా టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మందేమో.. మీ అన్నలా ఇగో చూపించకుండా హుందాగా ఉంటూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని ముషీర్‌కు సూచనలు ఇస్తున్నారు.
కాగా గురువారం ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు తరఫున సర్ఫరాజ్ ఖాన్ అద్భుత శతకం(161)తో మెరిశాడు. మరోవైపు.. ఇదే రోజు అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో ముషీర్ ఖాన్ 118 పరుగులు సాధించి.. ఐర్లాండ్‌పై యువ భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ మేరకు వీడియో షేర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక డిసెంబరు 2022లో ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ముషీర్ ఖాన్.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడి 96 రన్స్ చేశాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రైట్‌హ్యాంట్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు.
ఇక ముషీర్ ఖాన్ అన్న సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టాడు. భారత్-ఏ జట్టు తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు. కాగా సర్ఫరాజ్ ప్రస్తుతం స్వదేశంలో అనధికారిక టెస్టు సిరీస్‌తో బిజీగా ఉండగా.. ముషీర్ సౌతాఫ్రికాలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్నాడు. సుమారుగా 7625 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరిద్దరూ ఒకేరోజు శతకాలు బాదడం ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.
చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’